breaking news
Irregularities home
-
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అధికార నివాసం నిర్మాణంలో అవకతవకలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ కోసం చేపట్టిన నూతన అధికారిక నివాసం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని అధికారులపై ఈ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే పూర్తిస్థాయి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీఎం కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని సీబీఐ సోమవారం ఢిల్లీ ప్రజా పనుల విభాగానికి లేఖ రాసింది. కేజ్రివాల్ కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.43.70 కోట్లు కేటాయించింది. కానీ, రూ.44.78 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. 2020 సెప్టెంబర్ 9 నుంచి 2022 జూన్ దాకా ఈ సొమ్ము ఖర్చు చేశారు. -
అద్దె విషయంలో అవకతవకలు.. ఇలా చేయకండి!
యజమాని చెల్లించే జీతభత్యాల్లో ‘‘ఇంటద్దె అలవెన్సు’’ ఒక ముఖ్యమైన అంశం. పెద్ద అంశం. దీని వెనుక రహస్యం ఏమిటంటే ‘‘ఇంటద్దె అలవెన్స్’’తో పన్నుపరంగా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఇతర అలవెన్సుల కన్నా ఇక్కడ అవకాశమూ, వెసులుబాటు ఎక్కువ. తండ్రి పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో ఉంటూ, తండ్రికి అద్దె ఇచ్చినట్లు రసీదు చూపించి, ఇంటద్దె అలవెన్స్‌కి పూర్తిగా మినహాయింపు పొందే సుపుత్రులు ఎందరో. ఈ కట్టుకథని నిజం చేయాలంటే నిజంగానే తండ్రి అకౌంటులో అద్దె జమ చేయండి. తండ్రి ఆదాయంలో ఈ మొత్తాన్ని ఆదాయంగా చూపించి బైటపడండి. ఇలా అద్దె పుచ్చుకున్న వారు ట్యాక్స్ లిమిట్స్‌లోకి రాకుండా జాగ్రత్త పడండి.. నాన్నకు ప్రేమతో నమస్కారం పెట్టండి. ‘‘ఇల్లరికంలో ఉంది మజా’’ అంటూ మావగారింట్లో పూర్తిగా తిష్టవేసిన అల్లుళ్లు ఉన్నారు. ‘‘అల్లుడా ..మజాకా’’ అని మావగారు భయపడకుండా పైన చెప్పినట్లు చేయండి. అలా చేస్తే ఉభయకుశలోపరి. ఆఫీసులోని అధికారితో గల ప్రేమో, అభిమానమో, నాటకమో, చొరవో, చనువో .. దొంగ రసీదు ఇచ్చి క్లెయిం చేసే ప్రబుద్ధులెందరూ. స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యుల పేరుతో రసీదు, లేని ఇంటి నంబరుతో రసీదు, తప్పుడు ఇంటి పేరు మీద రసీదు, నాన్ రెసిడెంటు సంతానం పేరున రసీదు, భార్యభర్తలు కలిసి ఉంటూ ఒక ఇంటి మీద చెరొక రసీదు లేదా చెరొక ఇంటి నంబరుతో రసీదు, కుడి చేత్తో ఒక రసీదు .. ఎడమ చేత్తో ఒక రసీదుపై సంతకాలు పెట్టడం .. తన పేరు మీద ఇల్లున్నా ఏదో ఒక నంబరుపై రసీదు చూపించడం వంటివి ఎన్నో జరుగుతుంటాయి. హైదరాబాదులో అసలే ఇంటి నంబర్లు పది అంకెలు దాటి ఉంటాయి. ఒకో నంబరుకు నాలుగు బైలు(/) .. రెండేసి ఇంగ్లీషు అక్షరాలు కూడా ఉంటాయి. పోస్ట్‌మ్యాన్‌కి దొరక్కపోవచ్చు. గూగుల్ మ్యాప్‌కి కూడా అందకపోవచ్చు. కానీ డిపార్టుమెంటుకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా? ఈ డమ్మీ ఆటకు పేకాటలో ‘‘రమ్మీ’’లో జోకర్లాంటి వెసులుబాటు ఉంది. మీకు ఉపశమనం కూడా లభిస్తుంది. మీరు ఎవరినైతే సృష్టించారు ఆ వ్యక్తి నిజంగానే ఉండాలి. ఆ ఇల్లు ఆ వ్యక్తి పేరు మీద ఉండాలి. అప్పుడు అద్దెను వారు తమ ఆదాయంగా డిక్లేర్ చేసి, ఇన్‌కంట్యాక్సు రిటర్నుల్లో ఇన్కమ్గా వేయాలి. పన్ను పరిధిలోకి రాకపోతే సమస్య లేదు. తక్కువ శ్లాబులు పడ్డా మీకు లాభమే. పన్ను భారం తగ్గకపోతే ఆ జోలికి వెళ్లకండి. లక్ష రూపాయల్లోపల రసీదులు అడగరు. బీ హ్యాపీ. ఇదీ చదవండి: ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు! జీవిత భాగస్వామి పేరు మీద ఇల్లు ఉండి, ఆ వ్యక్తి పన్ను పరిధిలోకి రాకపోతే ఈ ప్లానింగ్ చేయండి. కానీ నిజంగా చెల్లించడం, అటు పక్క వ్యక్తికి ఆదాయంగా చూపించడం, నిజమైన రసీదు, నిజమైన డిక్లరేషన్స్తో అంతా నిఖార్సయిన వ్యవహారంగా ఉండాలి. ఎందుకంటే, డిపార్ట్మెంట్ వారి దగ్గర దొంగ రశీదుల వ్యవహారం రుజువులతో సహా ఉంది. అద్దె విషయంలో అవకతవకలకు పాల్పడకండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
గాడి తప్పిన విద్య
గాంధారిలో ఒకే రోజు డిఈవో, డిప్యూటీ డిఈవో, ఎంఈవోల తనిఖీలు ఒకరు సస్పెన్షన్, ఇద్దరికి మెమోలు జారీ వెలుగులోకి అనేక అక్రమాలు గతంలోనే వెలుగులోకి తెచ్చిన సాక్షి నిజామాబాద్ అర్బన్ : పాఠశాల విద్యాబోధన అస్తవ్యస్తంగా తయారైంది.. అక్రమాలకు నిలయంగా మారింది.. పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు కొందరు పక్కదారి పడుతున్నారు. అక్రమాలకు పాల్పడుతూ, విధులకు డుమ్మా కొడుతూ విద్యాబోధనను విస్మరిస్తున్నారు. గాంధారి మండలంలో విద్యావ్యవస్థ గాడి తప్పింది. కొన్నేళ్లుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. తాజాగా మండలంలో డీఈవో తనిఖీలతో అక్రమాలు బయటపడ్డాయి. గాంధారి మండలంలో విద్యాబోధన, వసూళ్ల పర్వంపై ‘సాక్షి’ జనవరిలోనే వెలుగులోకి తెచ్చింది. దీంతో ఫిబ్రవరి 13న డీఈవో లింగయ్య ఒకే రోజు 15 పాఠశాలలను తనిఖీ చేశారు. అక్రమాలు వెలుగులోకి రావడంతో కొందరు టీచర్లపై చర్యలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అదే పరిస్థితి పునరావృతమైంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జెండా ఎగురవేసిన టీచర్లు.. ఉదయం 10 గంటలకే జెండాను దింపేశారు. కనీసం జాతీయ పతాకాన్ని జెండా కర్ర నుంచి వేరు చేయకుండా ఓ గదిలో పడేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై పత్రికలో రావడంతో డీఈవో మంగళవారం మళ్లీ తనిఖీలు చేశారు. ఎన్నో అక్రమాలు వెలుగులోకి.. గుర్జల్ తండా పాఠశాలను డీఈవో లింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ పట్టుకొని ఇంటింటికీ తిరిగి విద్యార్థులను ఆరా తీశారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న యోగేశ్, జైల్‌సింగ్ పేర్లు ప్రభుత్వ పాఠశాల రిజిస్టర్లో నమోదు చేయడం చూసి అవాక్కయ్యారు. అంతేకాక, ఆ పాఠశాలలో కేవలం 12 మంది విద్యార్థులే ఉంటే, 22 మంది ఉన్నట్లు నమోదు చేసినట్లు గుర్తించారు. దీంతో టీచర్ రవీందర్‌ను సస్పెండ్ చేశారు. అలాగే, తాత్కాలిక హెచ్ఎం వెంకట్‌కు చార్జిమెమో జారీ చేశారు. హెచ్ఎం భూమేశ్ మూడు నెలలుగా స్కూలుకు రాకున్నా వేతనం తీసుకున్నట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని ఎంఈవోను ఆదేశించారు. మరోవైపు, టీచర్ల అటెండెన్స్ రిజిస్టర్లు మాయం కావడం వెలుగులోకి వచ్చింది. అక్రమాలు చోటు చేసుకోవడం వల్లే రిజిస్టర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపైనా విచారణ చేపట్టనున్నారు. దారి తప్పిన టీచర్లు.. గాంధారిలో ఓ అధికారితో పాటు ముగ్గురు ఉపాధ్యాయ సంఘం నేతలు వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన సంఘానికి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు ఆ అధికారి వెంటే ఉండి విధులకు డుమ్మా కొడుతున్నారు. పైగా ఇతర టీచర్లపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల పీఆర్ ఫిక్సేషన్ సందర్భంగా ఒక్కొక్కరి నుంచి రూ.300 చొప్పున వసూలు చేశారు. అలాగే, రూ.40 వేల స్కూల్ గ్రాంట్‌ను స్వాహా చేసినట్లు తెలిసింది. ‘గడ్డ’ స్కూల్‌కు చెందిన ఓ టీచర్ ఉండేది మెదక్ జిల్లాలో. ఆ టీచర్ స్థానంలో, మరో టీచర్ అనాధికారికంగా విద్యాబోధన చేస్తున్నారు. సదరు టీచర్ ఓ అధికారికి రూ.లక్ష బాకీ ఇవ్వడం, అతడు ఆ టీచర్‌కు వత్తాసు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థ మండలంలోని 9 స్కూళ్లకు ఉచితంగా కంప్యూటర్లను అందజేసింది. ఈ నేపథ్యంలో ఓ సంఘం నాయకుడు ఒక్కో పాఠశాల నుంచి రూ.2 వేలు వసూలు చేసి, ఓ అధికారితో పాటు మరో ఇద్దరు టీచర్లు కలిసి డబ్బు పంచుకున్నట్లు తెలిసింది. మండలంలోని ఓ మహిళ టీచర్ సమ్మర్లో పాఠశాలకు వెళ్లకున్నా ఆమె స్థానంలో మరో ‘నాయక్’ పాఠశాలకు వెళ్లాడు. ఈ వ్యవహరంలో అధికారి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిసింది. అలాగే, తన కార్యాలయంలో జనరేటర్ కోసం ఓ అధికారి మండలంలోని 300 టీచర్ల నుంచి రూ.200 చొప్పున వసూలు చేశాడు. కానీ, ఇంతవరకు జనరేటర్ కొనుగోలు చేయకపోవడంతో ఉపాధ్యాయులు నోరెళ్లబెట్టారు. ఇద్దరు టీచర్లు బాన్సువాడలో ప్రైవేట్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. వీరి స్థానంలో అనాధికారికంగా విద్యావాలంటీర్లు కొనసాగుతున్నారు. ఈ వ్యవహరంలో అధికారి స్పందించకపోవడం గమనార్హం. ఒకసారి గ్రామస్తులు టీచర్లు రావడం లేదని నిలదీస్తే వారం పాటు వచ్చిన టీచర్లు, మళ్లీ ముఖం చాటేశారు. మండలంలో తండాలు ఎక్కువగా ఉండడం, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో కొందరు టీచర్లు డుమ్మాలు కొడుతున్నారు. మరికొందరేమో వంతుల వారీగా విధులకు వస్తున్నారు. ఇక రిజిస్టర్లను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం వంటి తంతు కొనసాగుతోంది. గాంధారిపై ప్రత్యేక దృష్టి.. విద్యావ్యవస్థలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న గాంధారి మండలంపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. డీఈవో లింగయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనేక లోటుపాట్లు వెలుగులోకి రావడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. దీంతో మండలంలో విస్తృతంగా తనిఖీలు చేసి, విద్యావ్యవస్థను సరిదిద్దాలని డిప్యూటీ డీఈవోను ఆదేశించారు. ప్రతి వారం డీఈవో, డిప్యూటీ డీఈవో ఆకస్మిక తనిఖీలు చేయనున్నురు. ఇందుకోసం ఇప్పటికే పలు పాఠశాలలను గుర్తించారు. విద్యాబోధన సరిగా లేని పాఠశాలలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లు, డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు విధులు నిర్వహిస్తున్న స్కూళ్లలో సోదాలు చేయనున్నారు. కఠిన చర్యలు తప్పవు.. – లింగయ్య, డీఈవో ‘మెరుగైన విద్యనించాలని మేము కృషి చేస్తున్నాం. గాంధారి మండలంలో కొన్ని పాఠశాలలు సక్రమంగా లేవు. ఆయా స్కూళ్లను తనిఖీ చేసి, విద్యావ్యవస్థను మెరుగుపరుస్తాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా రిజిస్టర్లు, నివేదికలు మా దగ్గర ఉన్నాయి. వీటి ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం.’