breaking news
Interior Designing Course
-
అతివలకు అందుబాటులో కోర్సులెన్నో..
అనుస్మిత... నగరంలో సాధారణ గృహిణి. అత్తమామ, భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంటీరియర్ డిజైనింగ్‌లో రెండేళ్ల కోర్సు పూర్తిచేశారు. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. కామర్స్‌లో పీజీ పూర్తిచేసిన ఆమె అమెరికాలో ఐదేళ్లపాటు ఓ బ్యాంక్‌లో అడ్వైజర్‌గా సేవలందించారు. తర్వాత మాతృదేశానికి తిరిగి వచ్చి, తన అభిరుచికి తగినట్లు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కెరీర్‌గా ఎంచుకున్నారు. భార్గవి... బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్‌లో చేరారు. అక్కడ కొంతకాలం పనిచేశాక తనకు ఇష్టమైన రంగాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని భావించారు. ఉద్యోగం మానేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరారు. ప్రస్తుతం బోటిక్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. - వీరిద్దరే కాదు.. నగరంలో చాలామంది మహిళలు, గృహిణులు, చదువు మధ్యలో ఆపేసిన యువతులు.. కొంతకాలం ఉద్యోగం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక తమ ఆసక్తికి తగిన కోర్సులో చేరిపోతున్నారు. ఇష్టమైన వ్యాపకాన్నే కెరీర్‌గా ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వ్యాపార నిర్వహణ వైపు మొగ్గుచూపుతుండడం విశేషం. తద్వారా భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా పలు షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్, డిస్టెన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఆ వివరాలు.. క్రేజ్.. సోషల్ ఇమేజ్ నగరంలో కార్పొరేట్ కల్చర్‌తోపాటు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అందం, ఆహారం, ఆరోగ్యం, అలంకరణ, ఫ్యాషన్, జువెలరీ డిజైనింగ్ వంటి అంశాలకు ఆదరణ పెరిగింది. దానికి తగినట్లుగానే ఆయా రంగాల్లో నిపుణులకు డిమాండ్ అధికమైంది. దాంతో వీటిని కెరీర్‌గా ఎంచుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని నిఫ్ట్-హైదరాబాద్ డిప్యూటీ డెరైక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. ముఖ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, జెమ్, జువెలరీ అంశాల్లో అర్హత, నెపుణ్యాలను పెంచుకునేందుకు సిటీ మహిళలు,యువతులు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించారు. వీటితో కెరీర్ ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారని వెల్లడిం చారు. అంతేకాకుండా పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వతహాగా ఆర్ట్, డిజైనింగ్ వంటి కళాత్మక అంశాలకు వనితలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తార ని అన్నారు. నానాటికీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా గృహిణులు సైతం కుటుంబానికి తమ వంతు తోడ్పాటునివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. వీరితోపాటు గ్రాడ్యుయేషన్, పీజీలు చేసిన యువతులు కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమకిష్టమైన కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లలో చేరి నైపుణ్యాల్ని పెంచుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ సొంతం చేసుకుంటున్నారు. అందం నుంచి అలంకరణ వరకు... నగర పరిస్థితులు, ఇక్కడి మార్కెటింగ్ అవకాశాలకు అనుగుణంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు మహిళాలకు ఎన్నోకోర్సులను అందిస్తున్నాయి. బ్యూటీషియన్ నుంచి ఎయిర్‌హోస్టెస్ వరకు ప్రత్యేకంగా మహిళల కోసం కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నెలల వ్యవధి ఉన్న కోర్సుల నుంచి మూడేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సుల వరకు అభ్యసించే అవకాశం ఉంది. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఈ కోర్సులను చదవొచ్చు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, అప్పెరల్ డిజైనింగ్, గార్మెంట్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైనింగ్, క్యాండిల్ మేకింగ్, యోగా, చాక్లెట్ మేకింగ్, సలాడ్ మేకింగ్, జెమాలజీ, జువెలరీ డిజైన్, జువెలరీ మేకింగ్, డైమండ్ గ్రేడింగ్, డైమండ్ సర్టిఫికేషన్, డైటీషియన్, హోమ్‌సైన్స్, లెదర్ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్, స్కూల్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌టాయ్స్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కటింగ్ అండ్ టైలరింగ్, బంజారా అండ్ మిర్రర్ వర్క్.. ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. నిఫ్ట్‌లో 3 నెలలు, 6 నెలలు, ఏడాది వ్యవధిలో ఫ్యాషన్ బ్రాండ్ మేనే జ్మెంట్, ఫ్యాషన్ క్లాతింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్, ఫ్యాషన్ ఇంటిగ్రేషన్, మార్కెటింగ్ అప్లికేషన్ ఫర్ టెక్స్టైల్స్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, క్లాతింగ్ ప్రొడక్షన్ టెక్నాలజీ కోర్సులున్నాయి. వీటిలో చేరేందుకు ఆయా కోర్సులను బట్టి ఎనిమిదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. కళలకు డిమాండ్ భారతావని ప్రాచీన కాలం నుంచి కళలకు పెట్టింది పేరు. సంగీతం, నాట్యం వంటివాటిపె ఆసక్తి ఉన్నవారికి నగరంలో పలు విద్యా సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కర్ణాటక సంగీతం, వయోలిన్, వీణ, మృదంగం, నాదస్వరం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, సితార్, తబలా, వేణువు, డోలు, లలిత సంగీతం, పేరిణి నృత్యం, జానపద సంగీతం.. వంటివాటిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. భాగ్యనగరిలో ఆంధ్ర మహిళా సభ ఫైన్ఆర్ట్స్ కళాశాల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభు త్వ సంగీత, నృత్య కళాశాలలు వంటివి ఆయా విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సంస్థలు, కోర్సులు.. నగరంలో ఆయా కోర్సులను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇంటీరియర్ డిజైన్ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.jnafau.ac.in మాదాపూర్‌లోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం.. సర్టిఫికెట్ ఇన్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్; డిప్లొమా ఇన్ ఎర్లీచైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: http://rchyderabad.ignou.ac.in/ రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం హోమ్‌సైన్స్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీని అందిస్తోంది. వెబ్సైట్: www.angrau.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్).. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీలో అనేక కోర్సులను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.nift.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ), అప్పెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్- మాదాపూర్, గవర్నమెంట్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజ్ - వెస్ట్ మారేడుపల్లి, సెట్విన్ వంటివి అనేక కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆత్మవిశ్వాసం.. ఆర్థిక ఆలంబన ‘‘గతంతో పోల్చితే ప్రస్తుతం కుటుంబ ఖర్చులు పెరిగాయి. పిల్లల చదువుకు అధిక భాగం వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఫురుషులతోపాటు మహిళలు కూడా పనిచేయాల్సి వస్తోంది. ఉద్యోగం చేసే మహిళలకు సొంతంగా ఉపాధి పొందాలనే ఆలోచన పెరుగుతోంది. దీంతో హోమ్‌సైన్స్, ప్లేస్కూల్ టీచర్ ట్రైనింగ్, అప్పెరల్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్ మేకింగ్, యోగా, డ్యాన్స్, ఫిట్నెస్ వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. దీనివల్ల తమకిష్టమైన పని చేస్తున్నామనే ఆనందం, ఆత్మసంతప్తి లభిస్తాయి. హోమ్‌సైన్స్ కోర్సుల్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, అప్పెరల్ అండ్ టెక్స్టైల్స్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, ఇంటీరియర్ డిజైన్ వంటి అంశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తమకు ఆసక్తి ఉన్న రంగా న్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. లేదంటే.. తామే పదిమందికి ఉపాధి కల్పిం చేందుకు ప్లేస్కూల్స్, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు’’ -ఎస్.నిర్మలాదేవి, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజీ, సికింద్రాబాద్ -
యువతరాల అంతర్యానం
ఇరవై నాలుగేళ్ల ఇంటీరియర్ డిజైనర్ మనాలీ రాథోడ్, ఒక్క ఉదుటున ఇహ బంధాలన్నిటినీ తెంచుకుని... తనలోని ఆధ్యాత్మిక అంతర్లోకాలను అలంకరించుకునేందుకు ‘దీక్ష’ పట్టారు. సాధ్వి అవడం కోసం సకల విలాసాలను, సదుపాయాలను, ఆఖరికి... కనీస అవసరాలను సైతం పరిత్యజించిన ఈ సంపన్న యువతి, నిష్ఠతో కూడిన ఇంత కఠిన జీవనశైలిని ఎందుకు ఎన్నుకున్నట్లు? మనాలిలా, ఇప్పటికే భక్తిపారవశ్యపు దారిలో తదాత్మ్యతతో ప్రయాణిస్తున్న యువతరానికి ప్రేరణనిస్తున్నది ఏమిటి?! విలాసవంతమైన జీవితంలోని ఉరుకులూ పరుగులా? సాధుజీవనంలో వారు వీక్షిస్తున్న పరలోకపు సిరిసంపదలా? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’లో. ఆమె పేరు మనాలి రాథోడ్. సంపన్న జైన్ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసింది. కోయంబత్తూరులోని వస్త్రవ్యాపారి మోతీలాల్ రాథోడ్ కుమార్తె ఆమె. మోతీలాల్... పిల్లల్ని కాలు కిందపెట్టనివ్వకుండా, ఎండకు కందకుండా పెంచాడు. నాలుగేళ్ల క్రితం ఒక రోజు ఉన్నట్లుండి ‘తాను సాధ్విగా మారాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది మనాలి. ఈ మాట ఏ తల్లిదండ్రులకైనా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే ఇటీవల మనాలిలాగానే తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్న యువతీయువకులు ఎక్కువగానే ఉంటున్నారు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న వారిలో వజ్రాల వ్యాపార కుటుంబాలకు చెందిన పిల్లలు, కోట్లాదిరూపాయల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు కూడా ఉంటున్నారు. సేవామార్గాన్ని ఎంచుకుంటున్న వీరందరూ దైవత్వానికి దగ్గరగా జీవించాలనుకుంటున్నారు. జీవితాన్ని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సేవకు అంకితం చేసిన అన్నాచెల్లెళ్లు వంశీ, సుమలత. వీరిద్దరూ హైదరాబాద్‌లో పెరిగిన ఉన్నత విద్యావంతులు. ఇద్దరూ డబుల్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఈశ్వరీయ మార్గంలో నడవాలనుకునే వారికి మార్గదర్శనం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ అన్నాచెల్లెళ్లు. క్రైస్తవ సన్యాసినులదీ దాదాపుగా ఇదే దారి. జీవితాన్ని ప్రభువు సేవకు అంకితం చేయాలనుకునే వాళ్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. సాటి మానవునికి సేవ చేయడం అంటే ప్రభువుని సేవించడమే అనేటంత విశాల దృక్పథం వీరిది. సేవ చేయాలంటే సన్యసించాల్సిందేనా? ఆశ్రమ జీవనం, గృహస్థ జీవనం... ఉన్నట్లే సాధు జీవనం కూడా ఒక రకమైన జీవనశైలి అంటారు వంశీ. ‘జీవితం అంటే ఇప్పుడు గడుపుతున్నది కాదు, సమాజం కోసం ఏదైనా చేయాలి, ముందుగా ‘నేనెవరు’ అనేది తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవంతుడి గురించి తెలుసుకోవాలి, దానిని పదిమందికి తెలియచెప్పాలనే ఆలోచనలే వీరిని సాధు జీవనం వైపు మళ్లిస్తున్నాయి. కొన్ని మతాల్లో సన్యాసి జీవనం కఠోరంగా ఉంటుంది. ఇటీవల సాధ్విగా మారిన మనాలి రాథోడ్ సాధ్విగా మారడానికి ముందే ఇంట్లో జైనసన్యాసులు ఆచరించాల్సిన నియమాలను ఏడాదికి పైగా ఆచరించింది. రావలసిన చోటుకే వచ్చాను..! ‘బ్రదర్ వంశీ’ గచ్చిబౌలి శాంతిసరోవర్ (ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చురుకైన నిర్వహకుడు. ‘‘ఆధ్యాత్మికంగా పయనించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. క్రమంగా పెద్దయ్యే కొద్దీ సృష్టిలో ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనిపించేది. నా తోటి విద్యార్థులలో చాలామంది పరీక్షల ముందు గుడికి వెళ్లి పూజలు చేసేవాళ్లు. అలాంటి సంఘటన కంటపడిన ప్రతిసారీ ‘ఇంత స్వార్థం ఎందుకు, దేవుని మీద భక్తి ఉంటే ఎల్లప్పుడూ పూజించవచ్చు కదా!’ అనిపించేది. నాకు నేనుగా ధ్యానంలో నిమగ్నం కావడాన్ని గమనించిన మా అమ్మానాన్నలు నన్నోసారి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సంస్థకు తీసుకెళ్లారు. ధ్యానంలో ఒక్కోదశ దాటుతూ ఉంటే క్రమంగా నాకు ‘నేను రావల్సిన చోటుకే వచ్చాను’ అనిపించసాగింది. నాకు తెలియకుండానే నేను దేని గురించో పరిశోధిస్తున్నానని కూడా తెలిసింది. నాకు దేవతలంటే ఇష్టం. దైవత్వగుణాన్ని గౌరవిస్తాను. అయితే దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికంటూ చేసే క్రతువులను విశ్వసించను. ప్రతి మనిషీ ఎదుటి మనిషిని గౌరవించాలి, అంతే తప్ప పూజించకూడదు. మా జీవనశైలి భిన్నంగా ఉంటుంది. తెల్లవారు జామున మూడున్నరకు లేస్తాం. ధ్యానం ఇత్యాదివన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సంస్థ నిర్వహణ పనుల్లో నిమగ్నం అవుతాం. ధ్యానసాధన కోసం వచ్చిన వారికి మేము విలువల ఆధారిత ఆధ్యాత్మిక చింతన గురించి వివరిస్తాం. ఉద్యోగం చేస్తూనే... ఆధ్యాత్మికత మార్గంలో..! ‘సాధుజీవనం మీద సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. ఏమీ సాధించలేని అసమర్థులే ఆధ్యాత్మిక చింతన, సమాజ సేవ అంటూ ఈ రకమైన జీవనశైలికి ఆకర్షితమవుతారనే అపోహ కూడా ఉంది. నేను 22 ఏళ్ల వయసులో ఈశ్వరీయ సేవకు అంకితం అయ్యాను. ఆ సమయంలో మా తల్లిదండ్రులు కొంత ఇబ్బందికి లోనయ్యారు. నీ మీద అలాంటి ముద్ర పడితే మాకది కష్టంగా ఉంటుంది. ముందు నువ్వు ఏదైనా సాధించు, నీ నైపుణ్యాన్ని ప్రదర్శించు. అప్పుడు నీకు నచ్చిన మార్గంలో నడిస్తే అది మాతోపాటు నీకూ సంతృప్తినిస్తుంది’ అని చెప్పారు. వారు చెప్పినట్లే... నేను ఎంఎస్సీ కంప్యూటర్స్, పీజీ డిప్లమో ఇన్ మల్టీమీడియా వంటి కోర్సులు చేసి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూనే ఆధ్యాత్మిక బాటను కొనసాగించాను. మనసులో స్పిరిచ్యువల్ థాట్ బలంగా ఉంటే ఇతర కారణాలేవీ మనల్ని అడ్డుకోలేవు. మనిషి వికారాలకు అతీతంగా జీవించినప్పుడు, వికారాలను జయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అప్పుడే మనిషి భగవంతుడు కోరుకున్న విధానంలో వెళ్లగలుగుతాడు. నేను దీనిని విశ్వసిస్తాను, కాబట్టి ఈ జీవనాన్ని ఎంచుకున్నాను’’ అన్నారు. ధ్యానంతో పరిష్కారం..! సిస్టర్ సుమలత... ‘‘చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతో కలిసి సత్సంగాలకు వెళ్లేదాన్ని. అప్పట్లో మతానికి, ఆధ్యాత్మిక చింతనకీ మధ్య ఉన్న తేడా తెలిసేది కాదు. స్కూల్లో ఇతర మతాల వాళ్లు చెప్పిన విషయాలతో ఏర్పడిన సందేహాలకు సమాధానం నాకు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ధ్యానం ద్వారా ఏకత్వ భావన, ప్రశాంతత వంటివి అనుభవంలోకి వచ్చాయి నాకు చిన్నప్పుడు వెన్నునొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండేవి. రోజూ స్కూలుకెళ్లడం కూడా నా వల్ల అయ్యేది కాదు. అలాంటి సందర్భంలో ధ్యానం చేసుకుంటూ ఇంట్లోనే ఉండి చదువుకుని సెవెన్త్, టెన్త్ క్లాసులను డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆ తర్వాత ఎం.ఎ, ఎం.ఎస్సీ పూర్తి చేశాను. భగవంతుని మీద విశ్వాసం ఉంచి ధ్యానం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని నేను చాలా గట్టిగా విశ్వసించాను. అందుకే శారీరక, మానసిక బాధలతో జీవిస్తున్న వారిని చైతన్యవంతం చేయడానికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను. నేనలా అంకితం అయ్యి 15 ఏళ్లయింది’’ అని చెప్పారు. ప్రార్థనలోనే అనిర్వచనీయమైన సంతృప్తి! మానవ సేవకే జీవితాన్ని అంకితం చేసిన క్రైస్తవ సన్యాసిని సిస్టర్ శోభ... దేవుని ప్రార్థనలో అసలైన సంతోషం ఉందంటారు. ‘అసలైన సంతోషాన్ని సన్యసించిన తర్వాత మాత్రమే పొందుతున్నాను’ అంటున్నారామె. ‘‘ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, ఎవరి పట్లా ఈర్ష్యాసూయలు ఉండకూడదు. డబ్బు, సుఖాలు ఇవ్వలేని ఆత్మసంతృప్తి సృష్టికర్తను ప్రార్థించినప్పుడు కలుగుతుంది. దేవుని బోధనలకు ప్రభావితం అయిన తర్వాత ప్రార్థన చేసిన ప్రతిసారీ అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది. దానిని మళ్లీ మళ్లీ పొందాలనే కాంక్ష కూడా పెరిగింది. సృష్టికర్త మీద ప్రేమను పెంచుకోవడంలో ఆత్మసంతృప్తి ఉంటుంది. మనిషి మరణిస్తాడు, ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మను దేవుని మార్గంలో నడిపించే పనిని మనిషి చేయాలి. అందుకోసమే నా జీవితాన్ని దేవుని కోసం, దేవుని మాటలను బోధించడానికే అంకితం చేశాను’’ అంటారామె. ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి సాధువులుగా మారిన వాళ్లు ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచి సృష్టికి మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బుద్ధుడు, ఆదినాథ్ జైన తీర్థంకరుడు, జీసస్, ప్రజాపిత బ్రహ్మ... వంటి పరమాత్మస్వరూపులు చెప్పిన మాటల ప్రభావం ప్రతి తరం మీద ఉంటుంది. అయితే ఈ తరం మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉందేమో అనిపిస్తోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి యువతలో చాలామంది చదువు, పరీక్షలు, ఇతర ఆనందాల్లో మునిగిపోతున్నారు. మత విశ్వాసాల ఆచరణ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. నేను లౌకికంగా నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. ఇక నుంచి సాధ్విగా జీవించాలనుకుంటున్నాను. - మనాలి రాథోడ్, జైనసాధ్వి సాధ్వి నియమాలు ఇలా ఉంటాయి! తొలి భోజనం సూర్యోదయానికి ముందు, మలి భోజనం సూర్యాస్తమయానికి ముందు తీసుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత పురుషులతో సంభాషించరాదు సంవత్సరానికి రెండుసార్లు ఎవరి తలవెంట్రుకలను వారే తీసివేసుకోవాలి చాప లేదా బల్ల మీద నిద్రించాలి కాలి నడకనే పయనించాలి భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని మాత్రమే ఆరగించాలి కూర్చునే ముందు ఆ ప్రదేశాన్ని నెమలి పింఛాలతో తుడవాలి. మా అమ్మాయి మూడేళ్ల క్రితం ఒకరోజు తాను సాధ్విగా మారాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆ మాట వినగానే హతాశులయ్యాం. సాధ్విగా జీవించడం కష్టం అనీ, నియమాలు కఠినంగా ఉంటాయనీ నచ్చచెప్పే ప్రయత్నం చేశాం. కానీ గడచిన ఏడాది కాలంగా మనాలి ఇంట్లోనే సాధ్విగా జీవించింది. దాంతో ఆమె నిర్ణయం ఎంత గట్టిదో తెలిసి, ఆమెను ప్రోత్సహించాం. మనాలి ఇక మా ఇంటికి రాదు, తనని చూడాలంటే మేమే ఆమె ఉన్న చోటకు వెళ్లాలి. -మోతీలాల్ రాథోడ్, మనాలి తండ్రి తరిగిపోతున్న మానవ సంబంధాలే కారణం ఆధునిక కాలంలో తరిగిపోతున్న మానవసంబంధాలు యువత ఆధ్యాత్మిక చింతనవైపు ఆకర్షితం కావడానికి కారణమవుతున్నాయి. సన్యసిస్తున్న చాలామంది విషయంలో... వారికి బిఎండబ్ల్యుకార్లు ఉంటున్నాయి, చేతి నిండా డబ్బు ఉంటోంది, కానీ ప్రశాంతత కరువవుతోంది. డబ్బుతో దేనినైనా కొనవచ్చు, కానీ ప్రశాంతతను కాదు అని తెలుసుకుంటున్నారు. దాంతో వేదాంత ధోరణి అలవడి, హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. - డాక్టర్ కల్యాణ్,సైకియాట్రి్స్ట్


