breaking news
The interim secretariat
-
తాత్కాలిక సచివాలయంలో ‘ఎత్తిపోతలు’
- కొద్దిపాటి వర్షానికే చుట్టూ చేరిన నీరు.. మోటార్లతో తోడకం - సీఎం చంద్రబాబు పర్యటన మళ్లీ వాయిదా - రేపు ఐదో భవనం మొదటి అంతస్తు ప్రారంభం సాక్షి, అమరావతి వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం చుట్టూ వర్షపు నీరు చేరింది. ఆ నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా భూముల్లోకి పంపింగ్ చేయిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం బురుదమయంగా మారడంతో మంగళవారం ఉండాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వాయిదా వేశారు. వర్షం కారణంగా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు రెండ్రోజులుగా మందగించాయి. సోమవారం కురిసిన కొద్దిపాటి వర్షానికే ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. పల్లపు ప్రాంతం కావటం... నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని మెరక చేసిన దాఖలాలు లేకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఇంజనీర్లు చెబుతున్నారు. హడావుడి పనులతో సౌకర్యాలు సమకూర్చటంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లతో తోడిస్తున్నారు. ఆ నీటిని చిన్న సైజు కాలువల ద్వారా చేలల్లోకి మళ్లిస్తున్నారు. నీటిని తోడిన కొంత సమయానికి అదే గుంతల్లోకి మళ్లీ నీరు వచ్చి చేరుతోంది. వర్షం వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక సచివాలయం మురికి గుంతను తలపిస్తుంటే.. భారీ వర్షం వస్తే ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతనెల 29న పలువురు మంత్రులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రారంభించారు. ఆరోజు కూడా ఇక్కడ బురదగుంతను తలిపించింది. హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదో భవనం మొదటి అంతస్తు ప్రారంభం కోసం గురువారం ముహూర్తం ఖరారు చేశారు. అందులో భాగంగా ఐదవ భవనం మొదటి అంతస్తు, అసంపూర్తిగా ఉన్న గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం వెలగపూడి వస్తున్నారని అధికారులు ప్రకటించారు. మొత్తం బురదమయంగా మారటంతో పర్యటనను వాయిదా వేశారు. గతంలోనూ రెండు పర్యాయాలు సీఎం పర్యటన వాయిదా పడింది. -
హడావుడి దోపిడీ
మంత్రిగారి తంత్రం... సబ్ కాంట్రాక్టర్ అవతారం తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో రూ.50 కోట్ల దోపిడీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి అధికారులు, కూలీల తరలింపు మున్సిపాలిటీల జేసీబీలు, ట్రాక్టర్లు, వాహనాలన్నీ వెలగపూడిలోనే.. హడావుడిగా పనులు ప్రారంభించడం.. తక్కువ గడువు ఉన్నందున వేగంగా పూర్తి చేయడానికి అధిక మొత్తం చెల్లించడానికి సిద్ధం కావడం.. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు కంటే ముందుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందంటూ మళ్లీ హడావుడి చేయడం.. కాంట్రాక్టర్‌ను పక్కనబెట్టి సాక్షాత్తూ ఒక మంత్రి ఉప కాంట్రాక్టర్ అవతారం ఎత్తడం.. ఇదీ... ఇప్పుడు తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో సాగుతున్న తంతు.. గుంటూరు :హడావుడి డ్రామాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకూ పాత్ర ఉంది. పనుల పరిశీలనకు వెళ్లి.. పనులు వేగవంతం చేయాలంటూ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఆదేశాలిచ్చేస్తారు. ఉప కాంట్రాక్టర్ అవతారంలో అప్పుడు ప్రవేశిస్తారు మంత్రి గారు. ఇప్పుడు సచివాలయ నిర్మాణ పనుల్లోనూ ఒక మంత్రిగారు ఉప కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. కమీషన్ల రూపంలో రూ.50 కోట్లు కొట్టేసినట్లు అధికారులే చెబుతున్నారు. ‘ఎల్ అండ్ టీ’ నుంచి ఉప కాంట్రాక్టు సచివాలయ నిర్మాణ పనులకు ఎల్ అండ్ టీ సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి మంత్రి అండ్ కో-ఉప కాంట్రాక్టు తీసుకున్నారు. అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న ఉద్యోగులు మొత్తం మంత్రికి చెందిన ప్రయివేటు సంస్థలకు చెందిన వారే కావడం విశేషం. సచివాలయ నిర్మాణ పనులకు ఆరు నెలల గడువిచ్చారు. అంతకంటే ముందుగానే పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇదే సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. జూన్ 27వ తేదీలోపు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీంతో ఆయన పలుమార్లు పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వేగవంతం చేయాలని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మంత్రి ఉప కాంట్రాక్టర్‌గా మారారు. జిల్లాలోని పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల నుంచి ట్రాక్టర్లు, మిషనరీ, జేసీబీలు, కూలీలను తరలించే బాధ్యతలను ఆయా కమిషనర్లకు అప్పగించారు. అడ్డాల వద్ద అధికారుల కాపలా! విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలు, తాడేపల్లి, మంగళగిరి, నరసరావుపేట, తెనాలి తదితర పురపాలక సంఘాల అధికారులు వారివారి ప్రాంతాల్లోని కూలీలను వెలగపూడికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులకు కూలీలను పంపిన అధికారులు రెండు రోజులగా టైల్స్ వేసే కార్మికులను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి రోజూ వంద మంది వరకూ కూలీలను తరలిస్తున్నారు. వీరి కోసం నగరపాలక సంస్థకు చెందిన అక్రమ కట్టడాల నిర్మూలనా దళం వాహనం, ట్రాక్టర్లను వినియోగించడం గమనార్హం. రోజూ ఉదయాన్నే నగరంలో ప్రధాన అడ్డాల వద్ద ఉన్నతాధికారులు కాపలా కాయడం, వచ్చిన కూలీలను తరలించడం చేస్తున్నారు. అయితే అక్కడ పనులు చేస్తున్న కూలీలకు కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆ భారం అధికారులపై పడుతోందంటున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు చెందిన జేసీబీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు, సిబ్బంది అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల నుంచి భారీ ఎత్తున యంత్రాలు, భవన నిర్మాణ సామగ్రి, కూలీలను తరలించి కాంట్రాక్టర్‌కు భారీగా లబ్ధిచేకూర్చారు. ఇలా మిగిలిన సొమ్మును పెద్దలు కమీషన్ల రూపంలో దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల రూపంలో దండుకున్న మొత్తం సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.