breaking news
Integrated Child Development Service Scheme
-
పేద మహిళలకు ప్రయోజనం
కొయ్యలగూడెం : పేద, మధ్యతరగతి మహిళల అభివృద్ధికి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ద్వారా ప్రయోజనం కలుగుతుందని పీవో గొర్రె వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఈ పథకంలోని అంశాలపై అవగాహన కల్పించుకుని తమ సేవలను వినియోగించుకుంటే గర్భిణులు, బాలింతలకు సమస్యలు ఉత్పన్నం కావని, ఈ విషయంలో కార్యకర్తల, వైద్యారోగ్య సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మండలంలోని కొయ్యలగూడెంలోని పరింపూడి వీధిలో ఐసీడీఎస్ ద్వారా అమలవుతున్న అంశాలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ దినపత్రిక నిర్వహిస్తున్న వీఐపీ రిపోర్టర్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వయంగా రిపోర్టర్ అవతారం ఎత్తిన ఆమె మహిళలను , గర్భిణులను , బాలింతలను, పౌష్టికాహారం తీసుకునే చిన్నారులను ప్రశ్నించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. కొయ్యలగూడెం ప్రాజెక్టు పరిధిలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మండలాలకు చెందిన 162 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1622 గర్భవతులకు, 1218 బాలింతలకు, 12724 మంది ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు, 2326 మంది 11 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలకు పౌష్టికాహారం, విద్య, పలు ప్రభుత్వ పథకాలు, వైద్య, ఆరోగ్య సేవలు అందజేస్తున్నామన్నారు. కొయ్యలగూడెంలోని పరింపూడిలో ఆమె తన రిపోర్టింగ్ ఇలా ప్రారంభించారు.. పీవో : ఏమ్మా, పౌష్టికాహారం ఎలా అందుతోంది. పూలపల్లి సంధ్యారాణి (గర్భిణి) : ఈ ఎండల వల్ల అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నాం, ఇళ్ల వద్దకే పౌష్టికాహారం అందజేసే ఏర్పాటు చేస్తే బాగుటుంది మేడమ్. పీవో : ఇంటి వద్దకే పౌష్టికాహారం అందజేస్తే గర్భిణి లేదా బాలింతకు సమృద్ధిగా అందకపోవచ్చు. మరో వారం రోజుల్లో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత విధానాన్నే కేంద్రాల్లో కొనసాగించి, అమలు చేయడం లబ్ధిదారులకే ప్రయోజనం పీవో : కేంద్రాలకు సరఫరా అయ్యే కోడిగుడ్లపై మీరేమనుకుంటున్నారు. పత్తిపాటి సత్యవతి (బాలింత) : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయి. కొన్నిసార్లు నిల్వ ఉన్న గుడ్డు సరఫరా అవుతున్నాయి. రెండు గుడ్లు పంపిణీ చేస్తే ప్రయోజనంగా ఉంటుంది. పీవో : గుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశాం. నాణ్యతలేని గుడ్లు సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దు చేస్తాం. రెండుగుడ్ల సరఫరా విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం. పీవో : అంగన్వాడీ కేంద్రాల పనితీరు ఎలా ఉంటోంది? కట్టా లక్ష్మి (సోషల్ వర్కర్) : కన్నాపురం పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల వల్ల గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి పౌష్టికాహారం లభించడం లేదు. కేంద్రాల ద్వారా విద్యార్థులకు అందజేయాల్సిన ఆహారం కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. కేంద్రాల పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలి. పీవో : ఈ విషయంలో మండలంలోని కొన్ని సెంటర్లపై పలు ఫిర్యాదులు అందాయి. నేను స్వయంగా వాటిపై విచారణ జరిపి , అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటా. అలసత్వం వహించే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తా. పీవో : అంగన్వాడీ కార్యకర్తగా వృత్తిపరంగా మీరు సంతోషంగా ప్రజలకు సేవలు అందించ గలుగుతున్నారా? ఎస్ఎన్వీడీఈ శ్రీదేవి (అంగన్వాడీ వర్కర్) : ప్రభుత్వం పనిభారం పెంచింది. మా దీర్ఘకాలిక డిమాండ్లైన పర్మినెంట్ చేయడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర విషయాలపై మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. పీవో : దీర్ఘకాలికంగా ఉన్న పై రెండు సమస్యలపై ఐసీడీఎస్ ఉన్నతాధికారులు సైతం ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పనిభారం కార్యకర్తలకు తప్పనిసరి అవుతుందన్న విషయం గ్రహించాం. అందుకు తగ్గట్టుగా వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేసేందుకు సహకారం అందిస్తాం. పీవో : అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు ఎలా ఉంటున్నాయి? ఆవల గొల్లమ్మ (బాలింత) : అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మించి, వసతులు కల్పిస్తే పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది. అద్దె భవనాల్లో లేదా కమ్యూనిటీ హాల్, రామాలయాల్లో నిర్వహించడం వల్ల మూత్రవిసర్జన సమయాల్లో ఇబ్బందులు పడుతున్నాం. పీవో : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పథకాల పరిస్థితి ఏమిటి? పత్తిపాటి జ్యోతి (గర్భిణి) : ఇందిరాగాంధీ మాతృత్వ సహయోజన ద్వారా మా బ్యాంకు అకౌంట్లలో పలు దఫాలుగా సొమ్ములు జమ చేయాల్సి ఉంది. అయితే ఇందులో కొంతమందికి రెండుదఫాలుగా, మరికొంత మందికి 3 దఫాలుగా సొమ్ములు జమ అయినా ప్రభుత్వం ప్రకటించిన రూ.6వేలకు గాను రూ.3వేలే అందాయి. పీవో : 2103 జూలై నుంచి 3,508 మందికి రూ.6వేల చొప్పున రూ.1,05,24,000 పలు దఫాలుగా జమచేస్తూ వస్తున్నాం. సాంకేతిక కారణాల వల్ల జాప్యం అవుతున్నా, అకౌంట్లలో పూర్తి సొమ్ము జమ చేస్తాం. పీవో : అంగన్వాడీ కేంద్రాల్లో రక్షణ ఏవిధంగా ఉంది? జె.నాగవేణి (అంగన్వాడీ కార్యకర్త) : అంగన్వాడీ కేంద్రాలో పిల్లల సంరక్షణ బాగానే ఉంది. కేంద్రాల వద్ద కొందరు ఆకతాయిల వల్ల మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ప్రత్యేకించి కార్యకర్తలతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. పీవో : ఫోన్ ద్వారా నాకు ఫిర్యాదు చేయండి. వెంటనే చర్యలు తీసుకుంటాం. పరిస్థితి చేయదాటకుండా పోలీసుల సహకారం తీసుకుని రక్షణ కల్పించేందుకు కృషిచేస్తాం. -
అవస్థల కేంద్రాలు
అంగన్వాడీ కేంద్రాలు అవస్థలకు ఆవాసాలుగా వర్థిల్లుతున్నాయి. తిండిపెట్టేవి అన్న వాదన అతిశయోక్తి కాదు. అదీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 25 సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో 3587 ప్రధాన, 1365 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. శిథిలావస్థలో భవనాలు.. కార్యకర్తలు, ఆయాలకు చాలీచాలని జీతాలు. ఓటరు నమోదు బాధ్యతలు అప్పగించి వారితో వెట్టిచాకిరీ...నిత్యావసరాలకు నోచుకోని కిశోరబాలికలు..ప్రతి నెలా సక్రమంగా అందని పౌష్టికాహారం. ఇలా అన్నింటా సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాల పరిస్థితిని పరిశీలించడానికి సోమవారం విజిట్‌కు వెళ్లిన ‘సాక్షి’కి కఠిన వాస్తవాలెన్నో కనిపించాయి. వెంకోజీపాలెం(విశాఖపట్నం): జిల్లా మహిళా,శిశు అభివద్ధిసంస్థ ఆధ్వర్యంలోని అంగన్వాడీ కేంద్రాలు అవస్థలతో అల్లాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 25 సమగ్ర శిశు అభివద్ధి సేవా పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టుల పరిధిలో 3587 ప్రధాన, 1365 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలకు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలలో ఇందిరమ్మ అమతహస్తం పథకం కింద లబ్ధిదారులకు మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుజరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ భోజనాలలో నాణ్యత నామమాత్రం. ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో భోజనాలకు బదులుగా టేక్‌హోమ్ రేషన్ కింద పాతవిధానంలోనే సరకులు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. పలుకేంద్రాలకు 15 రోజులుగా గుడ్లు సరఫరా కాలేదు. పలు కేంద్రాల భవనాలు శిథిలావస్థలో ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. యలమంచిలి పరిధిలో మధ్యాహ్న భోజనాల తరువాత కేంద్రాలు మూతపడుతున్నాయి. కార్యకర్తలకు అదనపు విధుల భారంతో ఆయాలే వాటిని చూసుకోవాల్సి వస్తోంది. నర్సీపట్నం పరిధిలో రోజూ పిల్లల హాజరు తక్కువగానే ఉంటోంది. అద్దెభవనాలలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది. జిల్లాలోని సిబ్బంది చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారు. దీనికితోడు ఓటర్లనమోదు, పల్స్‌పోలియో, బోదకాలు నివారణ మాత్రల పంపిణీ వంటి అదనపు బాధ్యతలు తడిసిమోపెడవుతున్నాయి. దీంతో కార్యకర్తలు అంకితభావంతో పనిచేయలేని పరిస్థితి నెలకొంది. పని ఒత్తిడి కారణంగా కార్యకర్తలు రోజూ సక్రమంగా పిల్లలకు పాఠాలు బోధించలేకపోతున్నారు. జిల్లాలో 389 కార్యకర్త,ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో కొన్ని సింగిల్హ్యాండ్తోనే నిర్వహిస్తున్నారు. ఇలా ఇవి చాలావరకు తిండిపెట్టే కేంద్రాలుగానే వర్థిల్లుతున్నాయనడంలో అతిశయోక్తి కాదు. పలు గ్రామీణ నియోజకవర్గాల పరిధిలో కార్యకర్తలే ఆహార దినుసుల రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో తూకంలో యథేచ్ఛగా అవకవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం విద్యుత్ బిల్లులకు నిధులివ్వకపోవడంతో కార్యకర్తల చేతిచమురు వదులుతోంది.గ్రామీణ అంగన్వాడీలలో పరిశుభ్రత గురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది.