Indirapuram
-
రాహుల్.. సర్వెంట్ గా పనిచేస్తున్నారా?
ఘజియాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ వదిలి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అద్దెకు ఉంటున్నారా? ఒక ఇంట్లో సహాయకుడిగా పనిచేస్తున్నారా? అంటే కచ్చితంగా కాదనే చెప్పగలం. కానీ ఘజియాబాద్ ప్రాంతంలోని ఇందిరాపురానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో రాహుల్ ఉంటూ తమకు హెల్పర్‌గా పనిచేస్తున్నాడని పోలీసుల వెరిఫికేషన్ ఫారమ్‌లో నింపి ఇచ్చాడు. దానిలో రాహుల్ గాంధీ ఫొటో కూడా అతికించి ఇచ్చాడు. ఆ ఫారమ్‌పై రాహుల్ చిరునామాను ఇంటినంబర్ 12, తుగ్లక్ లేన్, న్యూఢిల్లీగా పేర్కొన్నాడు. వృత్తి అనే కాలమ్ వద్ద రాజకీయాలు అని, పెళ్లి వివరం వద్ద పెళ్లి కాలేదని రాశాడు. అయితే విశేషమేమిటంటే ఆ ఫారమ్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు స్టాంప్ వేసి ఆమోదించడం. ఇదంతా ఇందిరాపురం రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ పరిశీలనలో బయటపడింది. దీంతో ఉలిక్కపడ్డ పోలీసులు.. దీనిపై వివరణ ఇచ్చారు. ఇది ఎవరో ఆకతాయిగా చేసిన పనిలా ఉందని, ఆ వ్యక్తి నింపి ఇచ్చిన ఫారమ్ కూడా పాతదన్నారు. -
ఘనంగా విలక్కు పూజ
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పుఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లోగల సంకటహరణ గణపతి ఆలయంలో నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదిరోజులపాటు జరగనున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలతోపాటు ప్రతిరోజూ ఉదయం అభిషేకాలు చేస్తున్నారు. ప్రతి రోజూ భక్తులతో శ్రీలలితా సహస్ర పారాయణం చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన విలక్కు (దీప) పూజలో వసుంధర ఎన్క్లేవ్, నోయిడా, ఇంద్రపురం, గాజీపుర్, వైశాలితోపాటు ఇతర ప్రాంతాల నుంచి రెండు వందల మంది మహిళలు పాల్గొననున్నట్టు సంకటహరణ గణపతి ఆలయ ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్ తెలిపారు. ఎప్పటిమాదిరిగానే ఆలయ ప్రాంగణంలో దాదాపు వంద దేవతామూర్తుల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేశారు. 13వ తేదీన సరస్వతీ పూజ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆలయ పూజాకమిటీ ఆధ్వర్యంలో చేపడతారు.