Indira Kranti Path
-
ఇంకెంతకాలం ఈ ఆకలి కేకలు!
వీవోఏల నిరసనలు 15నెలలుగా అందని గౌరవ వేతనం పట్టించుకోని అధికారులు నూజివీడు : ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ (యాని మేటర్లు)పరిస్థితి దారుణంగా తయారైంది. నెలనెలా చెల్లించాల్సిన గౌరవ వేతనాలను సంవత్సరాల తరబడి చెల్లించకుండా జాప్యం చేస్తుండటంతో వారు పడరాని పాట్లు పడుతున్నారు. 15 నెలలుగా గౌరవ వేతనాల కోసం ఎదురుచూస్తూ అప్పులు చేసి జీవనాన్ని సాగిస్తున్నా... పాలకులు మాత్రం దయచూపడం లేదు. జిల్లాలో దాదాపు 2165మంది వీవోఏలు ఐకేపీలో పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.2వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తామని గతేడాది ప్రభుత్వం జీవో విడుదల చేసి, అదే ఏడాది జూన్, జూలై నెలకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించింది. 2013 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు గౌరవ వేతనాలను చెల్లించలేదు. దీంతో నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వీవోఏలు సమ్మెకు దిగి మండలాల్లోని ఐకేపీ కార్యాలయాల వద్ద రిలేదీక్షలు నిర్వహిస్తున్నారు. 30నుంచి 40డ్వాక్రా సంఘాలకొక వీవోఏను నియమించారు. వీరు ఆయా గ్రూపులకు సంబంధించిన పొదుపు వివరాలను, తీసుకున్న రుణాల వివరాలను మొబైల్ ద్వారా సెర్ఫ్‌కు పంపుతారు. అంతేగాకుండా ‘బంగారుతల్లి’ పథకానికి వివరాల సేకరణ, అభయహస్తం, ఆమ్‌ఆద్మీబీమాయోజన, జనశ్రీబీమా యోజన, వికలాంగుల గ్రూపు వివరాలు తదితర బాధ్యతలన్నీ వీవోఏలే నిర్వహిస్తుంటారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన పుస్తకాలు రాస్తున్నందున ప్రతి గ్రూపు నెలకు రూ.50 చొప్పున వీవోఏలకు చెల్లించాలని సెర్ఫ్ ఉన్నతాధికారులు సూచించినా... ఇదీ అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారమంతా వీవోఏలపైనే ఏ పథకం ప్రవేశపెట్టినా సమస్త సమాచారమంతా సేకరించాలని వీవోఏలకే అప్పగిస్తున్నారు. బాధ్యతలు అప్పగించినంతగా గౌరవ వేతనాన్ని చెల్లించడం లేదు. గ్రామంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా వివరాలు పంపాల్సి వస్తోంది. స్కాలర్‌షిప్పులనూ మేమే పంపిణీ చేస్తున్నాం. - వజ్జా వీణ, సీతారామపురం రాజకీయ వేధింపులు ఆపాలి వీవోఏలపై ఇటీవల కాలంలో రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. ఈ వేధింపులను నిలువరించాలి. వీవోఏల బాధ్యతల నుంచి ఇప్పుడు పనిచేస్తున్న వారిని తొలగిం చాలని కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఇలాంటివి రాకుండా చూడాలి. - తులిమెల్లి టారీస్, పాతరావిచర్ల నెలనెలా ఇవ్వాలి నెలానెలా గౌరవ వేతనాన్ని చెల్లించాలి. ఇన్ని నెలలు గౌరవ వేతనం చెల్లించకపోతే ఎలా. ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని నెలల పాటు జీతాలు లేకుండా పనిచేస్తారా? ఒకవైపు ధరలు పెరిగి ఖర్చులు పెరుగుతున్నందున మాకు రావాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. - బండి నాగమణి, యనమదల -
ఐకేపీ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తాం
అధికారంలోకి రాగానే నిర్ణయం ఐకేపీ ఉద్యోగ సంఘాల నేతలకు జగన్ అభయం డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని పునరుద్ఘాటన సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) కింద పనిచేస్తోన్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. శనివారం విశాఖ జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చోడవరం బహిరంగ సభకు వెళుతున్న జగన్‌ను.. కొత్తూరు జంక్షన్ వద్ద సీమాంధ్ర ఐకేపీ ఉద్యోగ సంఘాల తరఫున 30 మంది ఉద్యోగులు కలిశారు. సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2008లో ముఖ్యమంత్రి వైఎస్‌ను కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 42వేల మంది ఐకేపీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరామని, ఎన్నికల తర్వాత పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఆయన మరణం తర్వాత తమను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కష్టాలు విన్న జగన్ స్పందిస్తూ.. ‘‘మహిళలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభాలు.. వారి మొహాల్లో చిరునవ్వు చూడాలన్నదే మా లక్ష్యం. అందుకోసం దేశంలో ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకు వస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దీనిపై సంతకం చేస్తాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపాలి.. ఆ పిల్లలు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి తల్లిదండ్రులకు అన్నంపెట్టే పరిస్థితిలోకి రావాలి. ఆ అక్క చెల్లెమ్మలు పిల్లల్ని ఇలా బడికి పంపినందుకు.. ఒక్కో చిన్నారికీ నెలకు రూ. 500 చొప్పున అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ఒక్కో కుటుంబంలో ఇలా చదువుకునే ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తింపజేస్తాం. అంతేకాదు మహిళల జీవితంలో కొత్తదనం తెచ్చే దిశగా అక్క, చెల్లెళ్ల డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తాం. ఈ మాఫీ చేసే కార్యక్రమంలో ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే వీవోఏలు, సంఘమిత్రలు, సీసీలందరినీ కచ్చితంగా క్రమబద్ధీకరించి వారికి అండగా నిలుస్తాం’’ అని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం తమ పార్టీ అధికారంలోకి వస్తూనే ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇందిర క్రాంతి పథం ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. దశాబ్దాలుగా అరకొర వేతనంలో అత్తెసరు జీవితాలు గడుపుతున్న ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీ ద్వారా జగన్ తమ జీవితాల్లో వెలుగు నింపారని సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.ధనంజయ, డి.వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు కె.ఎస్.గురురాజు సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత కిందిస్థాయి ఉద్యోగుల కష్టాలను తొలగించాలనే జగనన్న ఉదాత్త ఆశయానికి ఆయన హామీనే నిదర్శనం. ఐకేపీ ఉద్యోగుల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకున్న జగనన్నకు మా ఐకేపీ సిబ్బంది, సభ్యులంతా అండగా ఉంటాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కలసికట్టుగా కృషిచేస్తాం’’ అని సంఘం నేతలు ‘సాక్షి’తో చెప్పారు.