breaking news
Indias progress
-
భారత్లో మధ్యతరగతి పురోభివృద్ధి ఎంతో
న్యూఢిల్లీ : భారత్లో మధ్య తరగతి జనాభాపరంగానే కాకుండా ఆర్థికపరంగా కూడా ఎంతో పురోభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో 120 కోట్ల మంది జనాభాతో రెండో స్థానంలో వున్న భారత్ 2022 నాటికి చైనాను అధిగమించి మొదటి స్థానాన్ని చేరుకుంటుంది. అలాగే 2027 నాటికి మధ్య తరగతి జనాభా కూడా ప్రపంచ రికార్డును సాధిస్తుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. 2004 నాటి గణాంకాల ప్రకారం భారత్లో మధ్య తరగతి ప్రజల సంఖ్య 30 కోట్లు ఉండగా, అది కేవలం ఎనిమిది ఏళ్లలోనే, అంటే 2012 నాటికి 60 కోట్లకు చేరుకుందని, మొత్తం దేశ జనాభాలోనే సగానికి చేరకుందని ఆ నివేదిక తెలియజేసింది. మధ్యతరగతి ఆదాయం 1990 దశకంలో 25లక్షల డాలర్లు ఉండగా అది 2015 సంవత్సరం నాటికి ఐదు కోట్ల డాలర్లకు చేరుకుందని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. అలాగే వారి రోజువారి తలసరి సగటు ఖర్చు రెండు డాలర్ల నుంచి 10 డాలర్ల మధ్యనుందని నివేదిక తెలిపింది. వారి దిగువ మధ్య తరగతి తలసరి రోజువారి ఖర్చు 4 నుంచి 6 డాలర్ల వరకు ఉందని పేర్కొంది. 2027 నాటికి భారత్లోని మధ్య తరగతి జనాభా అమెరికా, యూరప్, చైనాలను అధిగమించి ప్రపంచ రికార్డును సాధిస్తుంది. 2005 నాటి నుంచి గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే 2014 వరకు మధ్య తరగతి ఇంటి పొదుపు మొత్తాలు మూడింతలు పెరిగాయి. అంటే నాడు ఆరువేల డాలర్లు ఉండగా, అవి నేడు 24వేల డాలర్లకు చేరుకున్నాయి. మధ్యతరగతిలోకి మరిన్ని వృత్తులు, వ్యాపారులు చేరడంతో ఈ తరగతి గణనీయంగా పెరుగుతోంది. వెండర్లు, ఫుడ్ ఇండస్ట్రీ, లెదర్ వర్క్, పెయింటర్లు, కార్పెంటర్లు, కన్స్ట్రక్షన్, క్లాత్షాప్, వాషింగ్, సెక్యురిటీ సర్వీసెస్, వెల్డింగ్, రిపేరింగ్, కేబుల్, ఎలక్ట్రికల్ వర్క్స్, డ్రైవర్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, డాటా ఎంట్రీ, జరీ మేకర్స్, బ్యాంగిల్ మేకర్స్ మధ్య తరగతి పరిధిలోకి వచ్చేశారు. -
దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్లు కీలకం: వెంకయ్య
న్యూఢిల్లీ: భారత దేశ ప్రగతి కథను తిరిగి లిఖించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వచ్చే పదేళ్ల కాలం కీలకం కానుందని చెప్పారు. మంగళవారం ఇక్కడ అఖిల భారత మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) 41వ వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘మారుతున్న కాలం-భారత ప్రగతి పునరుద్ధరణ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. దేశ పూర్వపు వైభవం తిరిగి తెచ్చేందుకు వాణిజ్య దృక్పథంలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. పట్టణాభివృద్ధికి జపాన్ సాయం: దేశంలో పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి జపాన్ ఆసక్తి చూపుతున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. దేశంలోని వివిధ నగరాల్లో మల్టీమోడల్ రవాణా వ్యవస్థ పరిష్కారాలను చూపేందుకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. జపాన్ మౌలిక వసతులు, రవాణా, పర్యాటక శాఖ మంత్రి అకిహిరో ఓతా సహా 20 మంది ఉన్నతాధికారుల బృందం మంగళవారం వెంకయ్యనాయుడితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయవాడ మెట్రో రైలు మార్గాలకు జపాన్ సాయాన్ని కోరారు.