breaking news
indian children
-
భారతీయ బాలల మేధస్సుకు లెడ్ ముప్పు
మెల్బోర్న్: లెడ్.. దీనినే మనం సీసం అంటాం. ఇది ఒక రసాయన మూలకమని మనందరికీ తెలుసు. లెడ్ మానవ శరీరంలోకి వెళ్తే అనేక దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన రసాయనం భారతీయ విద్యార్థులపై చెడు ప్రభావం చూపుతోందని తాజా అధ్యాయనల్లో వెల్లడైంది. రక్తంలో అధికంగా ఉన్న లెడ్ పరిమాణం భారతీయ చిన్నారుల మేధోసంపత్తిని, వారి ఐక్యూ స్థాయిలను హరిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. భారతీయ చిన్నారుల రక్తంలోని లెడ్ స్థాయిలను తొలిసారి విశ్లేషించారు. అధ్యయన వివరాలు ప్రకారం... గత అధ్యయనాల్లో తేలిన దాని కంటే తాజా పరిశోధనలో లెడ్ పరిమాణం గణనీయంగా పెరిగింది. అది పిల్లల్లో మేధో వైకల్యానికి కారణమవుతోంది. ఈ విషయమై మాక్యూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రెట్ ఎరిక్సన్ మాట్లాడుతూ... ‘చిన్నారుల 100 మిల్లీ లీటర్ల రక్తంలో 7 మైక్రోగ్రామ్‌ల పరిమాణంలో లెడ్ ఉంటే వారి ఐక్యూపై ప్రతికూల ప్రభావం పడుతోందని మా పరిశోధనలో తేలింది. బ్యాటరీలను కరిగించడం (బ్యాటరీ స్మెల్టింగ్) వల్ల భారత్‌లో అధిక స్థాయిలో లెడ్ విడుదలవుతోంది. దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. వాహనాలు వాడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం, వాటిలో ఉపయోగించే బ్యాటరీల జీవిత కాలం రెండేళ్లే కావడంతో... బ్యాటరీలను అధికంగా రీసైక్లింగ్ చేస్తున్నారు. దీని కారణంగా ముఖ్యంగా పట్టణ ప్రాంత్లాలో వాయుకాలుష్యం బాగా పెరుగుతోంది. దీంతో లెడ్ వాతావరణంలోకి అధిక స్థాయిలో చేరుతోంది. ఇది పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంద’న్నారు. కేవలం లెడ్ మాత్రమే కాకుండా కొన్ని అయుర్వేద ఔషధాలతోపాటు, నూడుల్స్, సుగంధద్రవ్యాల వల్ల కూడా రక్తంలో లెడ్ పరిమాణం పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టి లెడ్ తాలూకు దుష్ఫలితాలను నియంత్రించాలని సూచిస్తున్నారు. -
ఆకలి భారతం పట్టదా మోదీ?
ప్రపంచంలో 2020 నాటికి భారతదేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందని మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కలగన్నారు. సూపర్ పవర్ మాట ఏమోగానీ, 2020 నాటికి ఆకలితో అలమటిస్తున్న బాలభారతం అసువులు బాయకపోతే అదే పదివేలని ప్రార్థించాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఆకలిని అధిగమించడంలో భారత్ బాగా వెనకబడి పోయిందని, ఆకలిపై పోరాడుతున్న దేశాల్లో భారత్ 97 స్థానంలో నిలిచిందని 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' తాజా నివేదికలో వెల్లడించింది. ఆకలి పోరాటంలో కెన్యా, మలావి లాంటి వెనకబడిన దేశాలకన్నా, యుద్ధాలతో రగిలిపోతున్న ఇరాక్ కన్నా భారత్ వెనకబడిపోవడం అవమానకర విషయం. నేపాల్, బంగ్లా, చైనా, శ్రీలంక, మయన్మార్ లాంటి పొరుగుదేశాలకన్నా వెనకబడిపోయామంటే మింగుడుపడని అంశమే. ఈ విషయంలో మనం శ్రీలంక కన్నా ఒక్క శాతమైనా ముందుకు వెళ్లాలంటే 2016లో పుట్టిన 9 లక్షల మంది పిల్లల్లో ఒక్కరు కూడా చనిపోకుండా వారిని 2021 నాటి వరకు కాపాడుకోవాలి. భారత్‌లో ప్రస్తుతం 35 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో 15 శాతం మంది పిల్లలు కనీస ఆహారం అందక ఆకలితో అల్లాడిపోతున్నారు. వారిలో ప్రతి 20 మందిలో ఒకరు ఐదేళ్లలోపు మరణించే ప్రమాదం ఉంది. రోజురోజుకు భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మురిసిపోయే నాయకులు ఆహారం, ఆకలి, పౌష్టికాహార లోపం అంశాల గురించి ఎన్నడూ మాట్లాడరు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, దేశ భద్రత, కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి, ఉద్యోగాలు, మార్పు అన్న అంశాలను ప్రస్తావించారు తప్ప ఆకలి, ఆహారం గురించి మాట వరుసకు కూడా మాట్లాడలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రపంచ దేశాలు పర్యటిస్తున్నారు తప్ప బాలభారతం ఎదుర్కొంటున్న ఆకలి సమస్య గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. మధ్యతరగతి, అగ్రవర్ణాల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ నాయకులకు ఆకలి సమస్య ఎందుకు పట్టడం లేదు? ఆకలి, పౌష్టికాహార లోపం వల్ల మరణిస్తున్న పిల్లలు ఎక్కువ మంది దళితులు, ఆదిమవాసులే కావడమే అందుకు కారణమేమో! 2011 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలు లేదా ప్రశ్నలు కేవలం 3 శాతం మాత్రమే పిల్లలకు సంబంధించినవంటే వారికిస్తున్న ప్రాధాన్యమెంతో అర్థం చేసుకోవచ్చు. పౌష్టికాహార లోపంతో మరణిస్తున్న పిల్లల సంఖ్య అగ్రవర్ణాల కన్నా దళితుల్లో 53 శాతం ఎక్కువగా ఉండగా, ఆదివాసీల్లో 35 శాతం ఎక్కువగా ఉంది. పేద, దళితవర్గాల సమస్యను రాజకీయ పెద్దలతోపాటు మీడియా కూడా పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. 300 మీడియా సంస్థల నిర్ణేతల్లో ఒక్క శాతానికి మంచి దళితులు గానీ ఆదివాసీలుగా నీ లేకపోవడమే అందుకు కారణమా? ఏదేమైనా మరో ఐదేళ్ల వరకు, అంటే 2021 సంవత్సరం వరకు ఆకలిపై పోరాటంలో భారత్ అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా కనిపించడం లేదని 'ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్' అభిప్రాయపడింది.