breaking news
Indiafirst
-
ఐపీవోకు ఇండియాఫస్ట్ లైఫ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000–2,500 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థ బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయనుంది. కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.30 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్‌లో బీవోబీ వాటా 65 శాతంకాగా.. కార్మెల్ పాయింట్(వార్బర్గ్ పింకస్)కు 26 శాతం, యూనియన్ బ్యాంక్‌కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఇండియాఫస్ట్ లైఫ్ పేర్కొంది. -
బీమా మార్కెట్ సెంటిమెంట్‌కు దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ- పాలసీల వల్ల బీమా కంపెనీలకు పాలసీల నిర్వహణ వ్యయం సగానికి సగం తగ్గుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి మొత్తం పాలసీల్లో కనీసం 20 శాతం ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఇండియా ఫస్ట్ లైఫ్ ఎండీ, సీఈవో డాక్టర్ పి.నందగోపాల్ తెలిపారు. ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, లీగల్ అండ్ జనరల్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన ఇండియా ఫస్ట్ లైఫ్ ఎండీ నందగోపాల్ హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు....ఈ-పాలసీలపై... ఎలక్ట్రానిక్ రూపంలో బీమా పాలసీలను అందించడం వల్ల ఇటు బీమా కంపెనీలకూ, అటు పాలసీదారులకూ ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఒక పాలసీ డాక్యుమెంట్‌ను కాగితం రూపంలో భద్రపర్చడానికి ఏటా రూ.150-200 వరకు ఖర్చవుతోంది. అదే ఎలక్ట్రానిక్ రూపంలో అయితే ఈ వ్యయం ప్రారంభంలో రూ.75-100కి తగ్గి, ఆ తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. పాత పథకాలను కూడా ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవచ్చు. బీమా పాలసీల కోసం ఎలక్ట్రానిక్ అకౌంట్ ప్రారంభిస్తే ఇక ప్రతి పాలసీకీ కేవైసీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పాలసీ డాక్యుమెంట్లు అన్నీ ఆన్లైన్లో పూర్తి భద్రంగా ఉంటాయి. ప్రస్తుతం ఇండియా ఫస్ట్‌లో 14 లక్షల మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 15 నుంచి 20% ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుత మార్కెట్ గురించి.. వ్యక్తిగత జీవిత బీమాతో పోలిస్తే కార్పొరేట్ బీమా రంగం ఆశాజనకంగా ఉంది. వ్యక్తిగత బీమాలో వ్యాపార అవకాశాలున్నా మార్కెట్ సెంటిమెంట్ బాగా దెబ్బతింది. వృద్ధిరేటు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం వంటి ప్రభావాలు జీవిత బీమా వ్యాపారంపై కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిరేటును నమోదు చేయగలం. కొత్త నిబంధనలకు రెడీనా... అక్టోబర్ నుంచి అమల్లోకి రానున్న కొత్త జీవిత బీమా మార్గదర్శకాలను అమలు చేయడానికి మేం పూర్తి సిద్ధంగా ఉన్నాం. కాని ఈ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన అన్ని కంపెనీలకు చెందిన 300 పథకాలు అనుమతి కోసం నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పది రోజుల్లో ఇన్ని పథకాలకు అనుమతి మంజూరు చేయడమనేది ఐఆర్డీఏకి సాధ్యమయ్యే పనికాదని అనుకుంటున్నా. మా కంపెనీ విషయానికి వస్తే 15 పథకాలకు సంబంధించి అనుమతులు రావాల్సి ఉంది. వచ్చే 15 రోజుల్లో వీటికి అనుమతులు వస్తాయని భావిస్తున్నా. మొత్తం మీద చూస్తే అక్టోబర్ నుంచి అమలు చేయాలన్న నిబంధనలను మరికొంత కాలం వాయిదా వేయడం ద్వారా వీటిని అమలు చేయడానికి కంపెనీలు సిద్ధం కావడానికి తగినంత సమయం దొరుకుతుంది.