వీవీఐపీ భద్రత కోసం..!
సిద్ధమవుతున్న ఇండో, అమెరికన్ బలగాలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన దగ్గర పడుతుండటంతో.. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు రెండు దేశాల అధికారులు, భద్రతా బలగాలు కాలంతో పోటీ పడుతూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో రాజ్‌పథ్ దగ్గర్లోని 71 ఆకాశ హర్మ్యాలను పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ మూసేస్తున్నారు. జనవరి 26 ఉదయం నుంచి అన్ని మెట్రో స్టేషన్లను మూసేస్తారు. పరేడ్ రోజు 40 వేల మంది భద్రతాబలగాలు విధుల్లో ఉంటాయి. రాజ్‌పథ్‌లోని పరేడ్ జరిగే 3కి.మీల ప్రాంతంలో 160 సీసీ కెమెరాలను, ముఖాలను గుర్తించగల మరో 80 కెమెరాలను ఏర్పాటు చేశారు. పరేడ్ జరిగే సమయంలో ఢిల్లీపై 35 వేల అడుగుల ఎత్తు వరకు నోఫ్లై జోన్‌గా ప్రకటిస్తారు.అలాగే, 400 కి.మీ.ల పరిధిలో విమానాల ప్రయాణాలను నిషేధించారు. జనవరి 27న ఒబామా కుటుంబం తాజ్‌మహల్‌ను సందర్శిస్తున్న సమయంలో ఆయనకు రక్షణగా 100 మంది అమెరికా సెక్యూరిటీ సిబ్బంది, 4 వేల మంది భారతీయ భద్రత సిబ్బంది విధుల్లో ఉంటారు.
అణు ఒప్పందం అమలు కోసం: రెండు దేశాల మధ్య 2005లో కుదిరిన పౌర అణు ఒప్పందం అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇరుదేశాల అధికారులు బుధవారం లండన్‌లో సమావేశమయ్యారు. ఒప్పందం అమలులో ప్రధాన అడ్డంకిగా మారిన పరిహారం అంశంపై ఈ భేటీలో ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలై, 2020 నాటికి భారతీయులందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్న మోదీ లక్ష్యం నిజం కావాలని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. రక్షణ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బుధవారం అమెరికా ప్రకటించింది. ఆసియాలోను, అంతర్జాతీయంగానూ భారత్‌ను బలమైన భాగస్వామిగా గుర్తించడాన్ని ఒబామా పర్యటన ప్రతిబింబిస్తుందని పేర్కొంది.