breaking news
India Ratings Financial Services Section
-
బ్యాంకింగ్ అవుట్‌లుక్... స్టేబుల్
ముంబై: భారత బ్యాంకింగ్ రంగానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ ప్రకటించింది. అయితే రిటైల్, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పేర్కొంది. బ్యాంకింగ్‌పై దేశీయ రేటింగ్ సంస్థ విడుదల చేసిన అర్థవార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్‌పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది. - కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్ పటిష్టంగా ఉండడం అవుట్‌లుక్ యథాతథ కొనసాగింపునకు కారణం. - బ్యాంకులకు తగిన మూలధనం అందే అవకాశం ఉంది. అందువల్ల వాటి ఫైనాన్షియల్ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. - మొండిబకాయిలకు సంబంధించి కూడా గత నాలుగు సంవత్సరంల్లో తగిన ప్రొవిజన్స్ (కేటాయింపులు) జరుగుతున్నాయి. - రుణాలు, డిపాజిట్ల విషయంలో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ షేర్ పెరుగుతుందని వాటికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్‌లుక్ సూచిస్తోంది. దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గట్టి పోటీని ఇవ్వగలుగుతాయి. ఆయా బ్యాంకులు మూలధన నిల్వలను పెంచుకోగలుగుతున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోను సానుకూలంగా, క్రియాశీలంగా నిర్వహించుకోగలుగుతున్నాయి. - భారీ మూలధన కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాం. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.2.8 లక్షల కోట్ల మూలధనం అందించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. - బ్యాంకింగ్ వ్యవస్థ డిపాజిట్లలో 6.5 శాతం వాటా కలిగిన ఐదు బ్యాంకుల విషయంలో ఇండియా రేటింగ్స్ ‘నెగిటివ్ అవుట్‌లుక్’ను కలిగిఉంది. బలహీన మూలధనం, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల విషయంలో బలహీనతలు దీనికి కారణం. - రిటైల్ రంగంలో రుణ నాణ్యత విషయానికి వస్తే, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఈ విలువ 2020–21తో పోల్చితే 2021–22లో 100 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇది 45 శాతానికి పరిమితం కావచ్చు. - గృహ రుణాలుసహా రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తక్షణం డిఫాల్డ్లకు అవకాశం ఉండదు. ఈ విభాగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు, పునర్వ్యవస్థీకరణలో ఉన్న రుణాలు కలిపి 2021–22 ముగిసే నాటికి 5.8 శాతానికి (మొత్తం రుణాల్లో) చేరవచ్చు. - ఎంఎస్ఎంఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దు నుంచీ ఈ సమస్య తలెత్తింది. దీనికితోడు జీఎస్టీ, ఆర్ఈఆర్ఏలూ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పడు కోవిడ్–19తో సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. అయితే సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. ఇందులో అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద తగిన లిక్విడిటీ లభ్యం అవుతుండడం గమనార్హం. రుణ పునర్వ్యవస్థీకరణ కూడా ఆయా రంగాలకు ప్రయోజనం కలిగిస్తోంది. - ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్‌పీఏ) 2021–22 ముగిసేనాటికి 13.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2020–21 ముగిసే నాటికి ఈ రేటు 9.9 శాతం. ఇక ఇదే సమయంలో ఒత్తిడిలో ఉన్న రుణాల శాతం 11.7 శాతం నుంచి 15.6 శాతానికి చేరవచ్చు. కార్పొరేట్ రుణాల విషయంలో ఇది జీఎన్‌పీఏ 10.2 శాతానికి, ఒత్తిడి ఉన్న రుణాలు 11.3 శాతానికి ఎగసే వీలుంది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణ వృద్ధి 8.9 శాతం 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. స్టేబుల్ టూ ఇంప్రూవింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి 2021–22 అవుట్‌లుక్‌ను గత వారమే ఇండియా రేటింగ్స్ ‘‘స్టేబుల్’’ నుంచి ‘‘ఇంప్రూవింగ్’’కు మార్చింది. నిర్వహణా పరమైన, తక్కువ వడ్డీరేటు చర్యల వల్ల నాన్ బ్యాంకింగ్ తగిన లిక్విడిటీ, మూలధన నిల్వలు, స్థిర మార్జిన్లు కలిగి ఉందని కూడా ఇండియా రేటింగ్స్ తెలిపింది. సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిన స్థాయిలో నాన్స్ బ్యాంక్ ఉన్నాయని విశ్లేషించింది. చదవండి : టీప్లస్1 సెటిల్మెంట్కు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఎకానమీ వృద్ధిరేటు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) ఇటీవలే 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్‌గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్‌వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. -
అప్పుల ఊబిలో... కార్పొరేట్ ఇండియా!
భారీ రుణాల్లో 250 పైచిలుకు సంస్థలు - భారం తగ్గించుకునేందుకు రూ. 7 లక్షల కోట్లు కావాలి - ఇండియా రేటింగ్స్ నివేదిక ముంబై: దేశీయంగా భారీగా అప్పులు తీసుకున్న టాప్ 500 కంపెనీల్లో సగభాగం పైగా సంస్థలు గట్టెక్కాలంటే ఏకంగా రూ. 7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. భారాన్ని తగ్గించుకునేందుకు వాటాల విక్రయం బాట పడితే 262 సంస్థలు కనీసం రూ. 7,04,300 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని, బైటపడేందుకు మూడేళ్లు అవసరమవుతుందని వివరించింది. అయితే, ఇంత పెద్ద మొత్తాన్ని వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోవడం అంత సులువు కాకపోవచ్చని ఇండియా రేటింగ్స్ సీనియర్ డెరైక్టర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం) దీప్ ఎన్ ముఖర్జీ నివేదికలో పేర్కొన్నారు. 2007-08, 2013-14 మధ్యకాలంలో ఈ మొత్తంలో సుమారు సగభాగం ఈ 500 కంపెనీల్లోకి వచ్చేసిందని వివరించారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా ఉండి, ఈ కంపెనీలు తమ రుణభారాన్ని ఒక మోస్తరు స్థాయికి తగ్గించుకోవాలంటే ఈ ప్రక్రియకు కనీసం మూడేళ్లు పట్టేస్తుందని తెలిపారు. అయితే, రుణాలు ఇప్పుడున్న స్థాయిలోనే ఉండాలని, పెరగకూడదని పేర్కొన్నారు. ఒకవేళ వృద్ధి అత్యంత స్వల్పంగా ఉన్న పక్షంలో ఈ ప్రక్రియకు అయిదారేళ్లు పట్టేస్తుందన్నారు. సీడీఆర్లో 96 కంపెనీలు.. దాదాపు 96 కంపెనీలు ఇప్పటికే కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ (సీడీఆర్) ప్రక్రియలో ఉండటమో లేదా నిరర్థక ఆస్తుల జాబితాకి ఎక్కడమో జరిగిందని ఇండియా రేటింగ్స్ వివరించింది. ఇవి తమ రుణాలను ఒక మోస్తరు స్థాయికి తగ్గించుకునేందుకు 5-10 సంవత్సరాలు పడుతుందని తెలిపింది. ఈ 96 కంపెనీల్లో 62 సంస్థలు మనుగడ సాగించాలంటే కనీసం రూ. 2,41,000 కోట్లు అవసరమవుతాయి. ఈ జాబితాలోని చాలామటుకు కంపెనీల మార్కెట్ విలువ కన్నా కూడా ఇది అధికం. కొత్త ఈక్విటీ అయినా ఆయా కంపెనీల ప్రమోటర్లు మారితేనే వస్తుందని, లేకపోతే మరింత కాలం అప్పుల భారం మోయాల్సి వస్తుందని ఇండియా రేటింగ్స్ వివరించింది. దన్నుగా నిల్చే మాతృసంస్థలు గానీ ఇతరత్రా వనరులు గానీ లేకపోవడం వల్ల 96 కంపెనీల జాబితాలోని 87 సంస్థల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరించింది. ఇక, ఈ 87 సంస్థల్లో 71 కార్పొరేట్లు మరింత సంక్షోభంలోకి జారకుండా ఉండాలంటే రాబోయే ఆరు నుంచి పన్నెండు నెలల్లో వాటాల విక్రయం ద్వారా కనీసం రూ. 89,200 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. అలా జరగని పక్షంలో అవి ఒక మోస్తరుగా కోలుకోవడానికి అయిదు నుంచి ఎనిమిదేళ్లు పడుతుందని నివేదికలో ముఖర్జీ వివరించారు. తక్షణమే ప్రమాదం లేని 317 కార్పొరేట్లలో 128 సంస్థలకు సుమారు రూ. 3.7 లక్షల కోట్లు అవసరమవుతాయని పేర్కొన్నారు.