breaking news
India Development Foundation
-
అన్ని లక్షల కోట్లు ఉంటేనా..!!!
ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెట్టండి... లక్ష కోట్లు అవుతుంది. జూన్ పదమూడున ఒక డాలర్ మారకం విలువ రూ. 95.1 అంటే.. లక్ష కోట్ల డాలర్లు 95,20,990,00,00,000 రూపాయలకు సమానం! కళ్లు చెదిరే అంకె ఇది. స్పేస్–ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తొలి ఐపీఓతో... దీనికంటే రెండు రెట్ల కంటే ఎక్కువే సంపాదించాడు. ఇంత డబ్బుతో భారత్‌లో ఎన్ని గొప్ప గొప్ప పనులు చేయవచ్చునంటే...రహదారులు... దేశంలోని జాతీయ రహదారుల విస్తరణకు ఉద్దేశించిన భారత్‌మాలా పరియోజనకు సుమారు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఐపీఓ ద్వారా 2.1 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు 199 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయనుకుంటే.. దేశంలో ఉన్న జాతీయ రహదారులన్నింటినీ మళ్లీ తాజాగా నిర్మించడమే కాదు.. ఏకంగా ఆరేళ్లపాటు ఏటికేడాదీ తాజాగా కొత్త రోడ్లు వేస్తూనే ఉండవచ్చు. 2025 నాటి అంచనాల ప్రకారం దేశంలో సుమారు 145,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉన్నాయి. నాలుగు లేన్ల రహదారి కిలోమీటర్ మేర నిర్మించేందుకు దాదాపు రూ.20 కోట్లు అవుతుందని అంచనా. స్మార్ట్ సిటీలు... నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. స్పేస్–ఎక్స్ ఐపీఓ డబ్బులతో వీటిల్లో 65 నగరాలను అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లతో అభివృద్ధి చేయవచ్చు. ఐదు కోట్ల మందికి ‘న్యాయ్’... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ న్యాయ్. దేశంలోని మొత్తం ఐదు కోట్ల కుటుంబాలకు నెలకు ఆరువేల రూపాయల చొప్పున నగదు సాయం అందించాలన్నది దీని ఉద్దేశం. అంటే ఒక్కో కుటుంబానికి ఏటా రూ.72 వేలు, మొత్తం రూ.3.6 లక్షల కోట్లు ప్రభుత్వం వద్ద స్పేస్–ఎక్స్ ఐపీఓకు వచ్చినంత సొమ్ము ఉంటే... ఎలాంటి అవాంతరాలు లేకుండా 48 ఏళ్లపాటు పేద కుటుంబాలకు ‘న్యాయ్’అందించవచ్చు. వేల ఏళ్లు ‘ఆయుష్మాన్’... కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కలి్పస్తోంది. ఈ పథకాన్ని స్పేస్–ఎక్స్ సొమ్ముతో ఎంత కాలం నడపవచ్చో తెలుసా? 23,000 ఏళ్లు! ఫుల్ సబ్సిడీతో ఈవీలు... సౌర విద్యుత్తుతో పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రస్తుతం ఒక గిగావాట్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ లెక్కన రూ.199 లక్షల కోట్లతో 21,750 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఇది ప్రస్తుతం దేశ విద్యుదుత్పత్తి సామర్థ్యానికి ఇరవై రెట్లు ఎక్కువ. కోట్లాది విద్యుత్తు వాహనాలను ఫుల్ సబ్సిడీతో నడిపించవచ్చు. పెట్రోల్, డీజిళ్ల దిగుమతులు దాదాపు శూన్యం చేయవచ్చు. అందరికీ చింతలేని చదువు... స్పేస్ ఎక్స్ ఐపీఓతో వచ్చిన రూ.199 లక్షల కోట్లతో మస్క్ భారత్‌లో 70 ఏళ్లపాటు అందరికీ ఉచితంగా చదువులు చెప్పవచ్చు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యకు సుమారు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. ప్రపంచానికి అత్యుత్తమ ఇంజనీర్లను ఇచ్చే ఐఐటీలపై ఖర్చు పెట్టాలనుకుంటే జిల్లాకు ఒకటి చొప్పున ఏకంగా 17,400 ఐఐటీలు ఏర్పాటు చేసేందుకు తగిన సొమ్ము ఐపీఓ ద్వారా మస్క్ చెంతకు చేరింది. – సాక్షి, నేషనల్ డెస్క్రూ. 199 లక్షల కోట్లతో... ⇒ భూమి నుంచి చంద్రుడికి రెండుసార్లు 4 లేన్ హైవే నిర్మించవచ్చు. ⇒ దేశంలోని రోడ్లు (63 లక్షల కిలోమీటర్లని అంచనా) అత్యాధునిక హంగులతో కట్టేయవచ్చు. ⇒ స్వర్ణ చతుర్భుజి (ఢిల్లీ–ముంబై–చెన్నై– కోల్‌కతా) రహదారిని ఎకాఎకిన 300 సార్లు కట్టవచ్చు. ⇒ బోయింగ్ 737లు నాలుగు వేల కంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. ఎయిరిండియా, ఇండిగో, స్పైస్జెట్ల వద్ద ఉన్న వాటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విమానాలు అన్నమాట. ⇒ ఐపీఎల్ టీమ్స్ అన్నింటినీ ఓ యాభై సార్లు కొనేయవచ్చు. ⇒ రోజుకో రూ.కోటి ఖర్చు పెడితే మొత్తం ఖాళీ అయ్యేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. -
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
'దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి'
న్యూఢిల్లీ: భారత్‌లో అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళన, ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) కార్యక్రమం కింద ప్రవాస భారతీయులు తమ ఆర్థిక సహాయం అందజేయవచ్చని, వీటిని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్నా పుట్టిన దేశంతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎన్‌ఐఆర్‌ఐలకు ఇదో చక్కని అవకాశమని ఆమె తెలిపారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు చాలామంది ఎన్ఆర్ఐలు ఎదురుచూస్తున్నారని, అలాంటి వారి కోసమే ఈ ఐడీఎఫ్ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్‌లోని వివిధ పథకాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేసేందుకు గాను ఐడీఎఫ్ కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


