ఆ సైనికుడి పరిస్థితి ఏంటి?
న్యూఢిల్లీ: ‘పీవోకేలో సర్జికల్ దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చాం. మన సైనికుడు ఒక్కరు కూడా మరణించలేదు.. అక్కడ మన వారిని ఎవరినీ వదిలిపెట్టి రాలేదు’ గురువారం దాడుల అనంతరం భారత్ చేసిన ప్రకటన ఇది. అయితే దీన్ని ఖండించిన పాక్.. ఎలాంటి సర్జికల్ దాడులుు జరగలేదని తెలిపింది. కాని పీవోకేలో ఓ భారత సైనికుడిని బందీగా పట్టుకున్నట్లు వెల్లడించింది. భారత్ మాత్రం ఎల్వోసీ దాటాడని మాత్రమే చెబుతోంది. మరి ఆ సైనికుడు.. పీవోకేలో ఉగ్రస్థావరాలపై దాడుల సందర్భంగా పట్టుబడ్డాడా, లేక నియంత్రణ రేఖ దాటి దొరికిపోయాడా.. ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ ఆ సైనికుడిని వదులుతుందా...?
సైనికుడి బందీ..
గతాన్ని ఓ సారి పరిశీలిస్తే.. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో.. ఎల్వోసీని తాము దాటలేదని పాకిస్తాన్ వాదించింది. అయితే దాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉందని నిరూపిస్తూ ఆ దేశ సైనికుల మృతదేహాలను భారత్ ప్రపంచానికి చూపింది. 1999లో జరిగినదే ఇప్పుడూ జరగొచ్చని ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. గత గురువారం సర్జికల్ దాడులు జరిపామని భారత్ ప్రకటించగానే.. దాన్ని ఖండించిన పాక్.. భారత్ ఎల్వోసీ దాటలేదని వాదించింది. అయితే చందు బాబూలాల్ చవాన్ అనే భారత సైనికుడిని పీవోకేలో పట్టుకున్నామని ఎప్పుడైతే వెల్లడించిందో.. ఆ తర్వాతి నుంచి ఆ వాదన ఆపేసింది. నిజానికి పాకిస్తాన్ మీడియా కూడా అయోమయంలో పడిపోయింది. కొన్ని మీడియా సంస్థలైతే.. అసలు ఏ సైనికుడినీ బందీగా పట్టుకోలేదని అంటున్నాయి. అయితే బందీ విషయాన్ని మాత్రం ఇరు దేశాలు అధికారికంగా నిర్ధారించాయి.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
సర్జికల్ దాడులు సందర్భంగా సైనికులెవరూ చనిపోలేదని, అక్కడ ఎవరినీ వదిలి రాలేదని భారత్ వెల్లడించింది. పాక్ బందీగా పట్టుకున్న సైనికుడు అందులో పాల్గొనలేదని స్పష్టం చేసింది. చవాన్‌కు తన పై అధికారితో చిన్న వాగ్వాదం జరిగి, ఆ కోపంతో నియంత్రణ రేఖ దాటి వెళ్లాడని ఆర్మీ తెలిపింది. ఈ ప్రకటన వల్ల ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్‌లోనైనా చవాన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే పాక్ మాత్రం దీన్ని కొట్టి పారేసింది. చవాన్‌ను దోషిగా చూపిస్తూ.. భారత్ నియంత్రణ రేఖ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ‘పాక్ భూ భాగంలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా పట్టుకున్నాం’.. అంటూ ఐక్యరాజ్యసమితిలో పాక్ రాయబారి మలీలా లోధి వ్యాఖ్యానించారు. తొలుత సర్జికల్ దాడులు చేశామని భారత్ చెబితే.. పాక్ ఖండించింది. తర్వాత సైనికుడు చవాన్‌ను చూపిస్తూ.. ఎల్వోసీ నిబంధలను భారత్ ఉల్లంఘిస్తోందని పాక్ వాదిస్తే.. భారత్ ఖండించింది. ఈ నేపథ్యంలో సైనికుడి పరిస్థితి విచిత్రంగా మారింది. అసలు అతడు పీవోకేలో ఉగ్రస్థావరాలపై దాడుల సందర్భంగా పట్టుబడ్డాడా, లేక నియంత్రణ రేఖ దాటి దొరికిపోయాడా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్.. సైనికుడిని విడిచిపెడుతుందా..? అంటే సమాధానం లేదు.