breaking news
implementation of GST
-
30న కాంగ్రెస్ ‘భారత్ బచావో’ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘భారత్ బచావో ర్యాలీ’ని చేపట్టనుంది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జీఎస్టీ అమలులో వైఫల్యాలు, ఎన్డీయే సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని వార్‌రూమ్‌లో ఏఐసీసీ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలపైనా చర్చించారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టని రాష్ట్రాల్లో ఆందోళనలను 25 తేదీలోగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 30న ఢిల్లీలో ‘భారత్ బచావో ర్యాలీ’ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, అసెంబ్లీలో కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‡రెడ్డి, సంపత్‌కుమార్, ఏపీ నుంచి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 1200 మందిని తరలించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
జైట్లీకి విషమ పరీక్షే!
నోట్ల రద్దు నేపథ్యంలో ఈసారి బడ్జెట్ రూపకల్పన క్లిష్టతరం ► జీఎస్టీ అమలు ప్రభావంపై దృష్టిపెట్టాలి ► చిన్న పరిశ్రమలు, గ్రామీణ రంగాలూ కీలకమే... అసోచామ్ ప్రీ–బడ్జెట్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోరెండు రోజుల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అటు కార్పొరేట్లు, ఇటు వేతన జీవులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను(ఐటీ), కార్పొరేట్ పన్నుల్లో కోత ఉండొచ్చన్న అంచనాలు చాలానే ఉన్నాయి. అయితే, పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్ ) నేపథ్యంలో ఈసారి బడ్జెట్ కూర్పు ఆర్థిక మంత్రి జైట్లీకి కత్తిమీద సామేనని పారిశ్రామిక మండలి అసోచామ్ అంటోంది. ప్రధానంగా నోట్ల రద్దు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలు, గ్రామీణ రంగాలను గాడినపెట్టడంపై బడ్జెట్లో కచ్చితంగా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతేకాదు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు కారణంగా వివిధ వర్గాలపై పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కూడా చాలా కీలకమని ఆదివారం విడుదల చేసిన ప్రీ–బడ్జెట్ నివేదికలో తెలిపింది. వినియోగ డిమాండ్ పునరుద్ధరణ పెద్ద సవాల్... ‘డీమోనిటైజేషన్ పరిణామం తర్వాత ప్రతిఒక్కరూ తమ సమస్యలను బడ్జెట్లో పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఈ భారీ అంచనాల నేపథ్యంలో ఆర్థిక మంత్రికి బడ్జెట్ రూపకల్పన అనేది సవాలుతో కూడుకున్నదే. ముఖ్యంగా జీఎస్టీ అమలుకు రంగం సిద్ధం అవుతుండటం, నోట్ల రద్దుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, చిన్న తరహా పరిశ్రమలు–వ్యాపారాలపై నెలకొన్న తీవ్ర ఒత్తిడి దీనికి ప్రధాన కారణం’ అని అసోచామ్ పేర్కొంది. పట్టణ వినియోగ డిమాండ్‌ను మళ్లీ పునరుద్ధరించడం ప్రభుత్వానికి అతిపెద్ద సవాలని అభిప్రాయపడింది. నోట్ల రద్దు కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థేనని.. దీనికి భారీ ఉద్దీపన చర్యలను ప్రకటించడం కూడా ముఖ్యమేనని వివరించింది. ‘ద్రవ్యోల్బణం తగ్గుదలను వాస్తవికంగా భావించకూడదు. ఎందుకంటే చాలా పంటలకు సంబంధించి ఉత్పత్తుల అధిక సరఫరా.. ముఖ్యంగా కూరగాయల దిగుబడి అధికం కావడం దీనికి ప్రధాన కారణం. నవంబర్‌లో నోట్ల రద్దు అంశం కూడా ద్రవ్యోల్బణం తగ్గుదలకు దారితీసింది’ అని పేర్కొంది. డబ్బులున్నా.. రుణాలివ్వలేని పరిస్థితి! ‘పారిశ్రామిక రంగం కార్పొరేట్ ట్యాక్స్‌ను ఇప్పుడున్న 30 శాతం స్థాయి నుంచి 25 శాతానికి తగ్గించాలని కోరుతోంది. మరోపక్క, వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కూడా మినహాయింపు పరిమితిని రూ.10,000–20,000 మాత్రమే పెంచితే కుదరదని.. నోట్ల రద్దు ప్రభావం కారణంగా భారీగా పెంచాలని కోరుతున్నారు. స్టాక్ మార్కెట్ వర్గాల అంచనాలూ ఇదే స్థాయిలో ఉన్నాయి. వీటిని అందుకోవడం ఆర్థిక మంత్రికి కష్టమే’ అని అసోచామ్ పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత డిపాజిట్ల వెల్లువతో బ్యాంకుల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. రుణాలిచ్చే విషయంలో అచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొందని అసోచామ్ వెల్లడించింది. ఒకపక్క, మొండిబకాయిల సమస్య.. మరోపక్క, దర్తాప్తు సంస్థలు బ్యాంకింగ్ కార్యకలాపాలపై మరింతగా దృష్టిపెట్టడమే దీనికి కారణమని పేర్కొంది. పన్నులను తగ్గించాలి: ఫిక్కీ, సీఐఐ బడ్జెట్లో కార్పొరేట్ పన్ను తగ్గింపును వేగవంతం చేయాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నారు. అదేవిధంగా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం అందించాలని.. లిటిగేషన్ , వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని పటిష్టం చేసేదిశగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి. ‘వడ్డీరేట్లను మరింత తగ్గించడంతోపాటు హౌసింగ్ వంటి రంగాలకు రుణ లభ్యత పెరిగేలా చేయాలి. ఈ చర్యలతో వ్యాపారవర్గాల్లో విశ్వాసం పెరగడమేకాకుండా పెట్టుబడులకు డిమాండ్ పెంచేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ వ్యాఖ్యానించారు. పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, వినియోగ వ్యయాన్ని పెంచాలంటే వ్యక్తిగత ఆదాయపన్ను(ఐటీ) రేట్లను తగ్గించడం చాలా కీలకమని ఆయన సూచించారు. ముఖ్యంగా డీమోనిటైజేషన్ తర్వాత వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది కొంత పరిష్కారం చూపుతుందన్నారు. కాగా, నోట్ల రద్దు తర్వాత మరిన్ని ఆర్థిక కార్యకలాపాలు పన్ను పరిధిలోకి వస్తుండటంతో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. భారీ సంస్కరణలు ఉండొచ్చు: బ్యాంకులు న్యూఢిల్లీ: ఈ బడ్జెట్లో భారీ సంస్కరణలు ఉండొచ్చని బ్యాంకింగ్ రంగం భావిస్తోంది. ఎఫ్‌డీఐ పరిమితి పెంపు, అదనపు మూలధనం కేటాయింపులు వీటిలో కొన్ని. 17 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులపై చేపట్టిన ఫిక్కీ, ఐబీఏ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత రుణ డిమాండ్ క్షీణించింది. రుణ డిమాండ్ 3–6 నెలల్లో మెరుగవుతుందని సర్వేలో పాల్గొన్న అధిక బ్యాంకులు భావిస్తున్నాయి. డిపాజిట్ నిధులు భారీగా వచ్చిపడ్డాయని బ్యాంకులు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితి ప్రస్తుతమున్న 20% నుంచి 49%కి పెంచితే మూలధన సమీకరణకు మార్గం సులభం అవుతుంది. తద్వారా బాసెల్–3 నిబంధన ప్రకారం మూలధన అవసరాలను పూర్తి చేసుకోవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. ఆదాయపు పన్ను తగ్గిం పు, 80సి, గృహ రుణాల వడ్డీపై అదనపు తగ్గింపుల ద్వారా రుణాల స్వీకరణ, పెట్టుబడులను పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాయి. టెర్మ్ డిపాజిట్లపై అదనపు పన్ను మినహాయింపులు ఇవ్వాలని బ్యాంకులు ఆశిస్తున్నాయి. సేవల పన్ను 16–18 శాతానికి పెంపు! విమానయానం, హోటల్ తిండి, ఫోన్ బిల్లులు ఇతరత్రా అనేక సేవలపై వినియోగదారులు ఏప్రిల్ 1 నుంచి మరింతగా చేతిచమురును వదిలించుకోవాల్సిందేనా? జీఎస్టీని ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానుండటంతో.. ఈ బడ్జెట్లో సేవల పన్ను రేటును జైట్లీ ఇప్పుడున్న 15 శాతం నుంచి 16–18 శాతానికి పెంచే అవకాశాలున్నాయని ట్యాక్స్ నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీలో 5%, 12%, 18%, 28 శాతం ఇలా విభిన్న పన్ను శ్లాబ్‌లను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందులో ఏదోఒక పన్ను శ్లాబ్‌కు(జీఎస్టీలో సేవలపై పన్ను 18 శాతంగా ఖరారు చేయొచ్చని అంచనా) దగ్గరగా బడ్జెట్లో సేవల పన్నును పెంచొచ్చనేది వారి అం చనా. గత బడ్జెట్లో సేవల పన్నును అర శాతం పెంచి 15%కి చేర్చిన జైట్లీ... ఈసారి దీన్ని కనీసం 1% పెంచి 16 శాతానికి చేరుస్తారని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కొన్ని ప్రాథమిక సేవలకు తక్కువ సేవల పన్ను రేటు(12 శాతం), మిగతావాటికి 18 శాతం చొప్పున పన్ను రేటును నిరే్ధశించే అవకాశాలున్నాయని మరికొందరు లెక్కలేస్తున్నారు. డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం కోసం బడ్జెట్లో సామాజిక పథకాలపై వ్యయాన్ని ప్రభుత్వం పెంచే అవకాశాలున్నాయని.. దీనికి తగిన నిధులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా బడ్జెట్లో పన్నుల పెంపుపై జైట్లీ దృష్టిపెట్టొచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఒకేసారి ప్రజలపై అధిక సేవల పన్నును మోపేకంటే.. నెమ్మదిగా కొత్త రేటుకు అలవాటుపడేలా చేయడం మంచిదనేది నిపుణుల మాట. ప్రస్తుతం సేవల పన్ను కేంద్రానికి చెందినది. జీఎస్టీ అమల్లోకివస్తే.. రాష్ట్రాలు, కేంద్రం సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్యం, విద్య వంటి నిత్యావసరాలను మినహాయిస్తే.. చాలావరకూ సేవలు జీఎస్టీ కిందికి వస్తాయి.