breaking news
IKP CA
-
రుణాల రికవరీలో గోల్మాల్
బోధన్ రూరల్ : స్త్రీనిధి రుణాల రికవరీలో చేతివాటం ప్రదర్శించిందో ఐకేపీ కమ్యూనిటీ యాక్టివిస్ట్(సీఏ). వసూలు చేసిన సొమ్ములో రూ. 3.12 లక్షలను కాజేసింది. ఐకేపీ అధికారుల విచారణలో ఈ విషయం బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. హున్సా గ్రామంలో 37 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 27 మహిళా సంఘాలకు 2012 నుంచి రుణాలు మంజూరు చేస్తున్నారు. స్త్రీనిధి ద్వారా సుమారు రూ. 45 లక్షలకుపైగా రుణాలను అందించారు. ఈ సంఘాలకు సీఏగా సునీత పనిచేస్తోంది. ఆమె రుణాలను రికవరీ చేసి బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఆమె చేతివాటాన్ని ప్రదర్శించింది. నకిలీ బిల్లు బుక్కులను సృష్టించి.. రికవరీ చేసిన సొమ్మున కాజేసింది. వెలుగు చూసిందిలా.. గ్రామానికి చెందిన యోగేశ్వర మహిళా సంఘం సభ్యురాలు శోభ భర్త ఇటీవల బ్యాంకు పాస్‌బుక్కులను పరిశీలించాడు. రుణం సక్రమంగా చెల్లిస్తున్నా.. తీసుకున్న రుణం మొత్తం తగ్గకపోవడంతో గత నెల 27వ తేదీన ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం) సూదం వెంకటేశంను కలిసి ఫిర్యాదు చేశాడు. ఆయన ఈ విషయమై విచారణ జరిపారు. 23 మహిళా సంఘాలకు సంబంధించి 3,16,412 రూపాయలు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. గురువారం స్త్రీనిధి ఏజీఎం శ్రీనివాస్, మేనేజర్ సతీశ్ పట్టణంలోని స్త్రీనిధి కార్యాలయం, హున్సా గ్రామాలలో విచారణ జరిపారు. సొమ్మును సీఏనుంచి రికవరీ చేసి, సంబంధిత మహిళా సంఘాల సభ్యులకు అందించారు. అవకతవకలకు పాల్పడిన సీఏ సునీతను విధుల నుంచి తొలగించారు. కాగా రుణాలు మంజూరు చేయించడంలోనూ అవకతవకలు జరిగి ఉంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలోనూ విచారణ జరపాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. నివేదికను ఐకేపీ పీడీకి అందిస్తాం హున్సా గ్రామంలో స్త్రీనిధి రుణాల రికవరీలో అవకతవకలు జరిగాయి. ఈ విషయమై విచారణ జరిపాం. సీఏ సునీత రుణాల రికవరీలో అవకతవకలకు పాల్పడి, రూ. 3,16,412 కాజేసినట్లు గుర్తించాం. ఆమెనుంచి సొమ్మును రికవరీ చేసి, విధులనుంచి తొలగించాం. విచారణ నివేదికను ఐకేపీ పీడీకి అందిస్తాం. – శ్రీనివాస్, స్త్రీనిధి ఏజీఎం, నిజామాబాద్ -
రూ.15లక్షలు స్వాహా
సారంగాపూర్ : మహిళల నిరక్షరాస్యత, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని రూ.15లక్షలు స్వాహా చేశాడో ఐకేపీ సీఏ.మండలంలోని ఆలూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో సీఏ దండు హన్మాండ్లు అక్రమాలు వెలుగుచూశాయి. గ్రామంలోని స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలను మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి బినామీల పేరిట రూ.15లక్షలు దుర్వినియోగం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో 60 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి ఒకే గ్రామైక్య సంఘం ఉండడంతో ఖాతాల నిర్వహణ భారం, రుణాల చెల్లింపు, బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించడంలో ఆసల్యం జరుగుతోందని, మరో వీవో ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. దీంతో వీవో అధ్యక్షురాలు పెంటల లక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మరో సంఘం ప్రతిపాదన తీసుకొచ్చారు. ఖాతాల నిర్వహణను అధికారులకు వివరించగా అవినీతి జరిగిందని, నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించారు. అక్రమాలు బయటపడుతాయనే ఉద్దేశంతో సీఏ దండు హన్మాండ్లు వారం రోజులపాటు కనిపించకుండాపోయాడు. ఈ విషయమై బంధువులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అతడిని తీసుకొచ్చారు. ఇటీవల నిధుల దుర్వినియోగంపై సమావేశం ఏర్పాటు చేసి రూ.6లక్షలు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ఐకేపీ ఏపీఎం నాగజ్యోతి ఆధ్వర్యంలో రిసోర్స్పర్సన్లు ఇంటింటా విచారణ చేపట్టారు. వారం రోజుల విచారణలో మరో రూ.8లక్షల వరకు దుర్వినియోగమైనట్లు గుర్తించిన అధికారులు సోమవారం గ్రామసభలో వివరాలు వెల్లడించారు. వీఓ రుణాల తాలూకు రూ.8,13,900, దీనికి వడ్డీ రూ.2,12,970, స్త్రీనిధి పథకం కింద మహిళలకు చెల్లించే రుణాలు రూ.2,25,410, దీనికి వడ్డీ రూ.1,88,985, స్త్రీనిధి డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు వారు విధించిన రూ.లక్ష పెనాల్టీ, రూ.1.37లక్షలు వరి ధాన్యం కొనుగోలు కమీషన్, మరో రూ.10వేల మ్యాచింగ్ గ్రాంటు, రూ.24వేలు బీమా డబ్బులు కాజేసినట్లు స్పష్టం చేశారు. అధికారులు సీఏ హన్మాండ్లును సంజాయిషీ కోరగా.. తనకు ఎలాంటి సంబంధం లేదని, ఏటా ఆడిట్ చేసే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడం గమనార్హం. సదరమ్ సర్టిఫికెట్లకు డబ్బులు వసూలు చేశాడని వికలాంగులు ఆరోపించారు. మొత్తంగా రూ.15,23,280 స్వాహా చేశాడని వెల్లడైంది. వీటిని మూడు వారాల్లో చెల్లించాలని ఏపీడీ గజ్జారాం ఆదేశించారు. మొదటి వారం 50శాతం, రెండు వారాల్లో మరో 50శాతం చెల్లించాలని సీఏకు సూచించారు. లేనిపక్షంలో ఆర్‌ఆర్‌యాక్టు కింద క్రిమినల్ కేసు నమోదు చేసి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఏ బదులిస్తూ తనపై అనవసరంగా రికవరీ విధించారని, న్యాయపోరాటం చేస్తానని అధికారులకు రాసిచ్చాడు. దీంతో సదరు సీఏను పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీహెచ్.రాజమణి, ఎంపీటీసీ సభ్యురాలు భూలక్ష్మి, ఏపీడీ గజ్జారాం, ఏరియా కోఆర్డినేటర్ రవికుమార్, డీపీఎం ఐబీ లత, ఏపీఎం ఐబీ సునందన్, ఫైనాన్స్ ఏపీఎం సుజాత, ఏపీఎం నాగజ్యోతి, డీఎంజీ శ్రీనివాస్, సమాఖ్య అధ్యక్షురాలు లలిత, సమాఖ్య కార్యదర్శి లత, సీసీలు మల్లేష్, నర్సయ్య, గోపాల్, ఆడిట్ సీఆర్పిలు పద్మ, భూమ, మాజీ సర్పంచ్ జీవన్‌రావు పాల్గొన్నారు.