breaking news
iert
-
నమ్మించి..ముంచారు
ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు (ఐఈఆర్టీ) ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తూనే ఉన్నారు. తమను రెగ్యులర్ చేస్తారని ఆశగా ఎదురు చూసిన వారంతా టీడీపీ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జీతాలు పెరగక, ఉద్యోగ భద్రత లేక సతమతమవుతున్న తమకు న్యాయం చేయాలని ఐఈఆర్టీలువేడుకొంటున్నారు. ప్రకాశం, కారంచేడు: అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి’ అనే లక్ష్యంతో సాధారణ విద్యార్థులతో కలిసి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో 2012వ సంవత్సరంలో జీఓ నంబర్ 1476 ద్వారా ఇంక్లుజివ్ ఎడ్యుకేషన్ ఫర్ ది డిజేబుల్డ్ ఎట్ సెకండరీ స్టేజ్ (ఐఈడీఎస్‌ఎస్) స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసి ఎంపిక చేసింది. ‘‘మీకెందుకు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దశల వారీగా రెగ్యులర్ చేస్తాం, అవసరమైన మేరకు జీతాలు పెంచుతాం, మీకు అన్ని విధాలుగా మీకు తోడుగా ఉంటాం, మీకందరికీ తగిన న్యాయం చేస్తామని’’ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు ఇచ్చారు. అమలుకు సాధ్యంకాని హామీలను జనం గుడ్డిగా నమ్మి ఓట్లు వేశారు.. గెలిపించారు. అందలమెక్కిన చంద్రబాబు ఎన్నికల హామీలను, ఉపన్యాసాల్లో చేసిన వాగ్దానాలను తుంగలోతొక్కాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసింది లేదు. జీతాలు పెరగడం లేదు, ఆదుకున్నది లేదు, న్యాయం చేసింది లేదు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి సర్వీసు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1320 మంది, జిల్లాలో 111 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 17 సంవత్సరాల వెట్టి చాకిరీ చేస్తూనే ఉన్నాం.. ‘‘2001వ సంవత్సరంలో సర్వశిక్షాభియాన్‌లో అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలతో నియమించబడిన ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ)లు గత 17 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం. ఇంత సర్వీసు చేస్తున్నా ప్రభుత్వానికి మా మీద కనికరం లేదా’’ అని వారు ప్రశ్నిస్తున్నారు. వీరంతా బీఈడీ ఉపాధ్యాయుల మాదిరి చదివినా ప్రత్యేకంగా స్పెషల్ బీఈడీ అర్హత కలిగి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్సీఐ)లో కూడా నమోదై ఉన్నారు. జీఓ ఎంఎస్ 39 ప్రకారం మంజూరైన 860 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ పోస్టులను ప్రభుత్వం డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నందున తమకు వయస్సుతో సంబంధం లేకుండా డీఎస్సీ రాసుకోవడానికి, వెయిటేజీ మార్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్లో వీరి ఊసే లేదు.. 2017 డిసెంబర్ 7వ తేదీన మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్ ప్రకటిస్తూ ఐఈడీఎస్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టులను కూడా డీఎస్సీలో భర్తీ చేస్తామని ప్రకటించారని వారు తెలిపారు. ఆ తరువాత కమిషనర్ సంధ్యారాణి కూడా ప్రత్యేక డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ సాక్షిగా ప్రకటించిన విషయం వారు గుర్తు చేస్తున్నారు. 860 పోస్టులను 70:30 నిష్పత్తిలో ప్రత్యక్ష నియామకం, పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు సర్వీస్ రూల్స్‌ను రూపొందించి ఆగమేఘాల మేద 2018 సెప్టెంబర్ 28న జీఓ నంబర్ 65ను విడుదల చేశారని వారు తెలిపారు. అయితే ఈ పోస్టులను డీఎస్సీలో చేర్చకపోవడం విడ్డూరంగా ఉందని వారు వాపోతున్నారు. ఐఈఆర్టీల ప్రధాన డిమాండ్లు.. ♦ ఏపీ ప్రభుత్వం మొదటిసారిగా ఐఈడీఎస్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ టీచర్ పోస్టులను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేయనున్నందున సర్వశిక్షాభియాన్‌లో విధులు నిర్వహిస్తున్న తమకు కూడా ఐఈడీఎస్‌ఎస్ పోస్టులకు అర్హత కల్పించాలని వారు కోరుతున్నారు. ♦ తక్షణమే ఐఈడీఎస్‌ఎస్ ప్రత్యేక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి. ♦ ప్రస్తుతం ఎస్ఎస్ఏలో పని చేస్తున్న ఐఈఆర్టీలకు వయస్సుతో సంబంధం లేకుండా డీఎస్సీ పరీక్షలకు అనుమతించాలి. ♦ ఐఈఆర్టీ ఉద్యోగులందరికీ తప్పకుండా వెయిటేజీ మార్కులు ఇవ్వాలి. -
ఐఈఆర్టీ పరీక్షకు 144 మంది హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేయనున్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 144 మంది హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్లానింగ్ కోఆర్డినేటర్ గురుమూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ దశరథరామయ్య, ఐఈడీ కోఆర్డినేటర్ పాండురంగ పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. మూడో అంతస్తుకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కొందరు దివ్యాంగులు వాపోయారు. కేటాయింపు తమపరిధిలో లేదని రాష్ట్ర స్థాయిలో జరిగిందని ఎస్ఎస్ఏ అధికారులు తెలిపారు. -
నేడు ఐఈఆర్టీ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియా¯న్ ద్వారా భర్తీ చేయనున్న ఇన్ క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ పోస్టులకు ఆదివారం ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని పీఓ దశరథరామయ్య, ఐఈడీ కోఆర్డినేటర్ పాండురంగ శనివారం పరిశీలించారు. అభ్యర్థులు 9 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని పీఓ సూచించారు. -
ఐఈఆర్టీల నియామకాలకు దరఖాస్తులు
ఏలూరు సిటీ : సర్వశిక్షాభియాన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై ఐఈఆర్టీల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎస్ఎస్ఓ పీఓ వీ.బ్రహ్మానందరెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 27 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఎంఆర్ 21, హెచ్ఐ 5, వీఐ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నేటి నుంచి ఏలూరులోని ఎస్ఎస్ఎ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు ఉచితంగా అందచేస్తామని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 12వ తేది సాయంత్రం 5 గంటలలోగా స్వయంగా సమర్పించాలని కోరారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిడమనూరు : ప్రత్యేకావసరాలుగల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను తల్లిదండ్రులు వారికి వినియోగించాలని ఐఈఆర్టీ కో–ఆర్డినేటర్ రవినాయక్ అన్నారు. నిడమనూరు ఎమ్మార్సీలో శనివారం ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారంలో ఒక రోజు ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీల్లో అలాంటి పిల్లలకు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తుందన్నారు. వైకల్యాన్ని బట్టి వారికి కావలసిన పరికరాలను అందిస్తుందని, అవసరమైన వారికి ఉన్నత స్థాయిలో ఉచిత చికిత్స సైతం చేయిస్తున్నారని తెలిపారు. ఎంఈఓ బాలునాయక్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఐఈఆర్టీలు అనంతరాములు, వెంకటేశ్వర్లు, డాక్టర్ రమణారెడ్డి, 50మంది ప్రత్యేకావసరాలు గల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.