breaking news
IDBI Bank officials
-
ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపు
న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్ అధికారులు కొందరు జులై 16 నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు నోటీసులను ఐడీబీఐ బ్యాంక్‌కు అందించారు. తమకు నోటీసులు అందినట్లు రెగ్యులేటరీ సంస్థలకు ఐడీబీఐ బ్యాంకు సమాచారం అందించింది. జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు, వేతనానికి సంబంధించిన సమస్యలపై నిరసనగా కొందరు ఐడీబీఐ అధికారులు సమ్మెచేస్తున్నట్టు తెలిసింది. 2018 జూలై 16 నుంచి 2018 జూలై 21 వరకు కొందరు అధికారులు సమ్మెకు దిగబోతున్న నోటీసులను తాము అందుకున్నామని ఐడీబీఐ బ్యాంక్, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2012 నవంబరు నుంచి ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించలేదు. వేతన సవరణ విషయంలో గత ఏడాదే ఓ సారి సమ్మె నోటీసు ఇచ్చినా మేనేజ్మెంట్ ఇచ్చిన హామీతో విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ‘ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్’ ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం అందించింది. ఐడీబీఐ అధికారులు, ఉద్యోగుల దగ్గర సమ్మెకు దిగడమే తప్ప మరో ఆప్షన్‌ను లేదని పేర్కొంది. -
కింగ్‌ఫిషర్ కేసులో సీబీఐ చార్జిషీట్
ఐడీబీఐ అధికారులుసహా తొమ్మిదిమంది పేర్లు ముంబై: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా, ఆయన నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధమున్న ఐడీబీఐ రుణం కేసులో మంగళవారంనాడు సీబీఐ ఒక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో సోమవారం అరెస్టయిన తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. వీరిలో ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్ఓ ఏ రఘునాథన్, ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్‌లు ఓవీ బుండేలు, ఎస్కేవీ శ్రీనివాసన్, ఆర్ఎస్ శ్రీధర్, బీకే బాత్రా, కింగ్‌ఫిషర్ ఎగ్జిక్యూటివ్‌లు శైలేష్ బోర్కీ, ఏసీ షా, అమిత్ నంద్కర్ణిలు ఉన్నారు. కేసులో కీలక వ్యక్తి మాల్యాను అరెస్ట్ చేయాల్సి ఉంది. రుణం పక్కదారి..: కేఎఫ్‌ఏకు రూ.1,300 కోట్ల రుణం మంజూరు, పంపిణీ ప్రక్రియలో పలు అవకతవకలు చోటుచేసుకున్నటు తన ప్రత్యేక విచారణ బృందం కనుగొన్నట్లు చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. రుణంలో రూ.260 కోట్లను కేఎఫ్ఏ పక్కదోవ పట్టించింది. రూ.263 కోట్లు వేతనాల చెల్లింపులు, టీడీఎస్, ఆదాయపు పన్ను, రుణ ఇన్స్టాల్మెంట్లకు వెచ్చించింది. రుణంలో కొంత ‘‘తన వ్యక్తిగత అవసరాలకు’’ మాల్యా వినియోగించుకున్నట్లు చార్జిషీట్ వివరించింది. మాల్యా, కింగ్ఫిషర్కు సంబంధించిన అకౌంట్ల వివరాలను తెలియజేయాలని కోరుతూ ఇప్పటికే ట్యాక్స్ హెవెన్స్‌గా పేరొందిన బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్, సింగపూర్‌లకు సీబీఐ లేఖలు రాసినట్లు చార్జ్‌షీట్ వివరించింది. తొమ్మిది మందికి రిమాండ్... మరోవైపు సోమవారం అరెస్టయిన తొమ్మిది మందికి ఇక్కడి సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఫిబ్రవరి 7వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరి బెయిల్ దరఖాస్తులను జనవరి 30న కోర్టు విచారిస్తుంది.