breaking news
hyderabad- amaravathi
-
హైదరాబాద్–అమరావతి కొత్త రైలు మార్గం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–అమరావతి మధ్య కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికానుండటంతో టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై నిర్మించాల్సిన భారీ వంతెనకు విడిగా టెండర్లు పిలుస్తారు. డిసెంబర్లో కొత్త లైన్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు. నాలుగేళ్లలో ఇది పూర్తికానుందని సమాచారం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. హైదరాబాద్–అమరావతి మధ్య తొలుత పిడుగురాళ్ల మార్గంలో కొత్తలైన్ నిర్మించాలని ప్రతిపాదించినా, తర్వాత దాన్ని ఉపసంహరించుకుని కాజీపేట–విజయవాడ లైన్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. ⇒ కాజీపేట–విజయవాడ లైన్లో మధిర సమీపంలోని ఎర్రుపాలెం స్టేషన్ నుంచి కొత్త లైన్ ప్రారంభమవుతుంది. ⇒ ఎర్రుపాలెం–పెద్దాపురం–చెన్నారావుపాలెం–పరిటాల–అమరావతి–కొప్పురావూరు–నంబూరు వరకు ఈ లైన్ కొనసాగుతుంది. ⇒ గుంటూరు–విజయవాడ లైన్లో ఉన్న నంబూరు స్టేషన్‌తో ఇది అనుసంధానమవుతుంది. ఈ నిడివి 56.53 కి.మీ.గా ఉంటుంది. ⇒ ఇటు కాజీపేట–విజయవాడ లైన్, అటు గుంటూరు–విజయవాడ లైన్.. ఈ రెండింటిని అనుసంధానిస్తూ మధ్యలో ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్ లైన్ నిర్మితమవుతుందన్నమాట. ⇒ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు వెళ్లాలంటే.. సికింద్రాబాద్ స్టేషన్లో బయలు దేరే రైలు కాజీపేట మీదుగా ఖమ్మం, మధిర, ఎర్రుపాలెం వరకు ప్రస్తుతం ఉన్న లైనులో వెళ్లి అక్కడి నుంచి కొత్త మార్గంలోకి మళ్లి పెద్దాపురం, పరిటాల మీదుగా అమరావతి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముందుకు సాగి ప్రస్తుతం ఉన్న గుంటూరు–విజయవాడ లైనుతో అనుసంధానమై విజయవాడ చేరుకుంటుంది. ఈ రెండు పాత లైన్లను అనుసంధానించటం వల్ల చాలా రైళ్లను ఎటునుంచైనా దారి మళ్లించొచ్చు. ⇒ ప్రస్తుత మార్గాల్లో సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నందున, ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రయాణికుల రైళ్లకే కాకుండా సరుకు రవాణా రైళ్లకు కూడా ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భారీ వంతెన ప్రత్యేకం.. ఈ మార్గంలో కృష్ణానదిపై భారీ వంతెనను నిర్మించనున్నారు. అమరావతి–పరిటాల సెక్షన్ల మధ్య వడ్డమాను–కొత్తపల్లి గ్రామాలను అనుసంధానిస్తూ కృష్ణానదిపై 3.3 కి.మీ. నిడివితో ఈ వంతెన నిర్మిస్తారు. 55 స్పాన్స్‌తో ఉండే ఈ వంతెన నిర్మాణానికి రూ.550 కోట్లు ఖర్చు కానుంది. విజయవాడలో కృష్ణానదిపై ఉన్న రైల్వే వంతెనకంటే ఇది చాలా పెద్దది కావటం విశేషం. భారీ వ్యయం.. ఈ లైన్ నిర్మాణానికి రూ.2300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పనులు జరిగేకొద్దీ ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈ పనులను రెండు దశల్లో నిర్మిస్తారు. ఫేజ్–1: ⇒ నంబూరు–కొప్పురవూరు (5.5 కి.మీ.) ⇒ కొప్పురువూరు– అమరావతి (12.75 కి.మీ) ఫేజ్–2: ⇒ ఎర్రుపాలెం–పెద్దాపురం (5.1 కి.మీ) ⇒ పెద్దాపురం–చెన్నారావుపాలెం (4.7 కి.మీ.) ⇒ చెన్నారావుపాలెం–పరిటాల (8.65కి.మీ) ⇒ పరిటాల–అమరావతి (20.29 కి.మీ.) ⇒ ఈ ప్రాజెక్టు కోసం 361 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ తుదిదశలో ఉంది. ⇒ కృష్ణానదిపై భారీ వంతెనతోపాటు ఈ మార్గంలో 32 పెద్ద వంతెనలు, 92 చిన్న వంతెనలు, రెండు ఆర్ఓబీలు, 10 ఆర్‌యూబీలు ఉంటాయి. ఎక్కడా వాహనాలు రైలు పట్టాల మీదుగా దాటి పోవాల్సిన పని ఉండదు. దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్స్ లేకుండా ప్రత్యామ్నాయంగా వంతెనలు నిర్మిస్తున్నందున, కొత్తగా నిర్మించబోయే మార్గాల్లో లెవల్ క్రాసింగ్స్ లేకుండా చూడాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి కొత్త మార్గంలో ఎక్కడా లెవల్ క్రాసింగ్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఇన్ని వంతెనలకు ప్రణాళికలు రూపొందించారు. ⇒ అమరలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ విగ్రహం, ఉండవల్లి గుహలు.. తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైలు అందుబాటులోకి వస్తుంది. ⇒ మచిలీపట్నం పోర్టు, కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టులకు మరిన్ని రైళ్లు వచ్చేందుకు వీలు కలుగుతుంది. -
హైదరాబాద్-అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు!
చౌటుప్పల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇంకా నిర్మించని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసు నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. సోమవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో విలేకరులతో మాట్లాడిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జురుగుతున్నాయని, దానితోపాటే 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా అభివృద్ధి చేసేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారని ఎంపీ తెలిపారు. వచ్చే వారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ 65వ నెంబర్ జాతీయ రహదారిని పరిశీలించేందుకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంటనగరాల నుంచి విజయవాడకు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లే తప్ప హైస్పీడ్ రైళ్లేవీ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. కొత్త నెట్ వర్క్ ఏర్పాటుతో ఆ లోటు పూడే అవకాశం ఉంది.