breaking news
Houston woman
-
డ్రెస్ సరిగాలేదని ఫ్లైట్ దింపేశారు..!
జమైకా : కుమారుడితో కలిసి విమానప్రయాణం చేస్తున్న ఓ మహిళా డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉక్కపోత కారణంగా ఆమె సౌకర్యవంతమైన దుస్తులు ధరించడంతో ఫ్లైట్ ఎక్కేదిలేదంటూ విమాన సిబ్బంది అడ్డుచెప్పారు. హోస్టన్‌లో నివాసముండే డాక్టర్ తిషా రోయి స్వదేశం జమైకాలో వారంరోజులు పర్యటించి తన ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి అమెరికాకు తిరుగుపయనమయ్యారు. వేడి వాతావరణం కారణంగా ఒళ్లంతా చెమటపట్టడంతో ఆమె సౌకర్యవంతంగా డ్రెస్సింగ్ చేసుకుని విమానం ఎక్కేందుకు వెళ్లారు. అయితే, ఆమె డ్రెస్ అభ్యంతరకరంగా ఉందని, పైన జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ సిబ్బంది తెగేసి చెప్పారు. అప్పటికే ఫ్లైట్ టేకాఫ్‌కు సమయం దగ్గర పడటంతో.. తన దగ్గర జాకెట్ లేదని.. కనీసం ఓ దుప్పటైనా ఇవ్వండని తిషా సిబ్బందిని కోరింది. ఫ్లైట్ సిబ్బంది ఎలాంటి సాయం చేయకపోగా మరింత కటువుగా మాట్లాడారు. దాంతో చేసేదేంలేక తిషా, ఆమె కుమారుడు వెనుదిరిగారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని... డాక్టర్‌కు ఫ్లైట్ చార్జీలు రిఫండ్ చేస్తామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెప్పింది. తనకెలాంటి రిఫండ్ ఇవ్వలేదని, నల్లజాతీయురాలిని కాబట్టే తన దుస్తులపై అనవసర రాద్దాంతం చేశారని తిషా ఆరోపించారు. తనలాగే డ్రెస్ చేసుకున్న మరో మహిళను ప్రయాణానికి అనుమతించారని విమర్శించారు. తనపట్ల జాతి, లింగ వ్యతిరేకత చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఫ్లైట్ ఎక్కేముందు దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. -
ఒబామాను బెదిరించిన మహిళ అరెస్ట్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను చంపేస్తానంటూ బెదిరించిన మహిళ డినైస్ ఓ నీల్ (57)ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా బుధవారం ఇక్కడ వెల్లడించింది. దేశాధ్యక్షుడు ఒబామాను హతం చేస్తానంటూ 2012, నవంబర్ 28న ఆయనకు యూఎస్ మెయిల్ ద్వారా ఓ లేఖను అందుకున్నారు. అయితే బెదిరింపు లేఖపై ఎక్కడ ఎటువంటి చిరునామా లభించలేదు. లేఖలో సంతకం కూడా టెడ్డీ బేర్ అని మాత్రమే సంతకం చేసి ఉంది. దాంతో యూఎస్ భద్రత సిబ్బంది కొంత అయోమయానికి గురయ్యారు. దాంతో అసలు విషయం తేల్చమని ఆ లేఖ దర్యాప్తు బాధ్యతను సీక్రెట్ సర్వీస్‌కు భద్రత సిబ్బంది బదిలీ చేశారు. దాంతో ఆ కేసు దర్యాప్తును సీక్రెట్ సర్వీసెస్ అధికారులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా గతేడాది డిసెంబర్లో బెదిరింపులకు పాల్పడిన మహిళ హ్యూస్టన్ కు చెందిన డినైస్ ఓ నీల్గా గుర్తించి, 26న అరెస్ట్ చేశారు. ఆమె ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉందని మీడియా పేర్కొంది. అయితే డినైస్ ఓ నీల్ చాలా కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతుందని పోలీసులు వెల్లడించారు.