breaking news
house surgen
-
గుట్టుగా రికార్డుల తరలింపు
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్న్‌షిప్ (హౌస్‌సర్జన్) సర్టిఫికెట్ల జారీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా హౌస్సర్జన్లకు సంబంధించిన లాగ్‌బుక్‌లను తారుమారు చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా సృష్టించింది. అయితే ఆస్పత్రి అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడం ఒక ఎత్తయితే, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడం మరో ఎత్తు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ సహా ఓపీ, ఐపీ ఇలా ఒక్కో విభాగంలో ఒక్కో నెల చొప్పున అన్ని విభాగాల్లోనూ పని చేయాల్సి ఉంది. కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులే కాకుండా దేశ, విదేశాల్లోని వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు సైతం గాంధీ, ఉస్మానియా జనరల్ ఆస్పత్రుల్లో హౌస్సర్జన్లుగా చేరుతుంటారు. ఆయా ఆస్పత్రుల్లో ఏటా 500 మందికిపైగా చేరుతున్నట్లు సమాచారం. అయితే వీరిలో పలువురు విధులకు గైర్హాజరవుతున్నారు. గత నాలుగేళ్లలో సుమారు 350 మంది ఇలా గైర్హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో చాలా మంది హౌస్‌సర్జన్‌గా పని చేయకుండానే సర్టిఫికెట్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు ఆయా విభాగాల అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టోర్‌రూమ్ నుంచి ఫైళ్లు తెప్పించి... ఆస్పత్రి వైద్యుల మధ్య అంతర్గత విబేధాలు తారా స్థాయికి చేరుకోవడం, ఇటీవల ఒకరిపై మరొకరు బహిరంగ ఆరోపణలు చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కరోనా బాధితుల వివరాలను బహిర్గతం చేశారనే సాకుతో సీఎంఓ డాక్టర్ వసంత్‌కుమార్‌పై ఆస్పత్రి పాలనా యంత్రాంగం ఐదురోజుల క్రితం క్రమశిక్షణా చర్యలకు పూనుకోవడం, అతడిని డీహెచ్‌కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం ఉదయం ఆస్పత్రి ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం, శానిటేషన్, హౌస్‌సర్జన్ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, ఇందులో సూపరింటిండెంట్ సహా ఆర్ఎంఓ, మరో క్లర్కు పాత్ర ఉందని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆస్పత్రిలో హౌస్‌సర్జన్‌గా పని చేసేందుకు చేరిన విద్యార్థుల పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆస్పత్రి అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆగమేఘాలపై ఆయా ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించిన హాజరు పట్టిక సహా లాగ్‌బుక్, ఇతర ఫైళ్లను స్టోర్‌రూమ్ నుంచి తెప్పించి, గుట్టుచప్పుడు కాకుండా ఓ గదిలోకి తరలించారు. రికార్డుల్లోని కొన్ని కాలమ్స్‌ను కొట్టివేసి, కొత్తగా మరికొన్ని వివరాలు నమోదు చేస్తూ మీడియాకు దొరికిపోవడం సంచలనంగా మారింది. అయితే ఈ అంశాన్ని ఆస్పత్రి పాలనా యంత్రంగా కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐరీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలులో ఉందని, హౌస్సర్జన్లకు సంబంధించి రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఆరోపణలు అవాస్తవం: సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ గాంధీఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ప్రభుత్వం కోరిన అంశాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో జరుగుతున్న ప్రతి ఘటనపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారం ఉందన్నారు. తన ఛాంబర్లో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు తనకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఆస్పత్రిలో 250 మంది ట్రాన్స్ఫర్ ఇంటర్నీస్, హౌస్సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారని, 2019 మార్చి నుంచి వారికి బయోమెట్రిక్, ఐరిస్ విధానంలో హాజరు నమోదు చేస్తున్నామన్నారు. ఇంటర్నీస్, హౌస్సర్జన్ల నుంచి డబ్బులు తీసుకుని హాజరు వేసే విధానం గతంలో ఉండేదేమో కానీ, ప్రస్తుతం లేదన్నారు. విధులకు గైర్హాజరైన 60 మంది ఇంటర్నీస్, హౌస్‌సర్జన్లను ఎక్స్టెన్షన్ చేసినట్లు తెలిపారు. హౌస్సర్జన్లు, ఇంటర్నీస్ లాగ్ బుక్‌లు, బయోమెట్రిక్ హాజరు పట్టికలకు సంబంధించిన రికార్డులను డీఎంఈ రమేష్‌రెడ్డికి అందజేసేందుకు వరుస క్రమంలో సర్దుతుండగా వీడియోలు తీసి, అవకతవకలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మీడియాను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. అ సాంఘిక శక్తులు ఆస్పత్రిలో హల్చల్ చేస్తాయనే సమాచారంతోనే ప్రధాన గేటుకు తాళం వేశామే కానీ మీడియాను అడ్డుకోవడానికి కాదని ఆయన వివరించారు. పోలీసులకు ఫిర్యాదు... తనపై దుష్ప్రచారం చేసేందుకు వినియోగించిన తప్పుడు ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను అందించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ వసంత్‌కుమార్ శుక్రవారం చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మీడియా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని చట్టప్రకారం శిక్షించాలని కోరారు. ఫిర్యాదు స్వీకరించామని న్యాయనిపుణుల సలహా మేరకు తదుపరి చర్యలు చేపడతామని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. -
‘నీట్’లో హౌస్సర్జన్లకు అవకాశం
కడప అర్బన్ : నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో అర్హత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు చేపడుతున్న ఆందోళనలో భాగంగా కడప రిమ్స్‌లో గురువారం హౌస్ సర్జన్లు ఐపీ విభాగం ముందు ఆందోళన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మూడు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలంటూ హౌస్ సర్జన్లు ఆందోళనకు దిగారు. 2016–17 బ్యాచ్‌లో హౌస్ సర్జన్లుగా ఉన్న తమకు వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు ఉంటేనే నీట్లో అర్హత కల్పిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడం సమంజసంగా లేదన్నారు. తమకు ఎన్టీఆర్ యూనివర్శిటీ పరిధిలో 2017 ఏప్రిల్ 11వ తేది వరకు హౌస్ సర్జన్ల కోర్సు ముగుస్తుందని, 11 రోజులు తమకు అర్హతలో తక్కువగా ఉందని, ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించి సవరించాలన్నారు. ఆర్టికల్ 371ను సవరించి ఒకే రాష్ట్రంలో కనీసం 15 సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఓ నెం. 287 ప్రకారం హౌస్ సర్జన్ల స్టయిఫండ్‌ను తెలంగాణ రాష్ట్రంలో 15 శాతం పెంచారని, మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదన్నారు. వైద్యులకు వైద్యానికి ఉపయోగపడే పనులు చేయించకుండా నర్సులు, ఎంఎన్ఓలు చేసే పనులను చేయిస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి నీట్లో అర్హత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమకు న్యాయం చేసేవరకు పోరాడతాం. ఆందోళనలో ఉ«ధతంగా పాల్గొని దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం! – డాక్టర్ మహేంద్ర, హౌస్ సర్జన్, రిమ్స్, కడప నీట్లో అర్హత కల్పించాలి దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో 11 రోజులు మాత్రమే తక్కువగా ఉందని తెలిపారు. ఈ ఆలస్యానికి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీనే కారణం. ఆ విషయాన్ని గుర్తించి న్యాయం చేయాలి. – డాక్టర్ శ్రీధర్, హౌస్ సర్జన్, రిమ్స్, కడప ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితి తమతో వైద్యానికి ఉపయోగపడే ట్రీట్మెంట్ పనులు చేయిస్తే అందరికీ బాగుంటుంది. కానీ నర్సులు, ఎంఎన్ఓలు చేసే పనులను చేయిస్తున్నారు. దీనివల్ల తాము డ్యూటీలకు వచ్చినప్పటి నుంచి కే షీట్లు చూడడం వరకే తప్ప రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది. – డాక్టర్ నరేష్, హౌస్ సర్జన్ల అసోసియేషన్ అధ్యక్షులు, రిమ్స్, కడప స్టయిఫండ్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలి హౌస్ సర్జన్లకు ఇచ్చే స్టయిఫండ్‌ను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జీఓ నెం. 287 ప్రకారం రెన్యూవల్ చేసి 15 శాతం పెంచాలి. అలాంటి చర్యలు ్ర’పభుత్వం చేపడితేనే తమకు న్యాయం జరుగుతుంది. – డాక్టర్ బబిత, హౌస్ సర్జన్, రిమ్స్, కడప నీట్లో అర్హత సాధించేంత వరకు పోరాటం గుంటూరులో జూనియర్ డాక్టర్లు వారం రోజులుగా సమ్మె చేస్తున్నారని, వారి బాటలోనే తాము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం తమకు నీట్లో అర్హత సాధించేలా లిఖిత పూర్వక హామి ఇచ్చేంతవరకు పోరాడుతాం! – డాక్టర్ సరయు, హౌస్ సర్జన్, రిమ్స్, కడప సౌకర్యాలు కల్పించాలి వైద్య సిబ్బందితోపాటు తాము విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఒక్కొ సమయంలో కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేకపోవడం దారుణం. అలాగే హాస్టల్ నుంచి విధులకు రావాల్సిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం! – డాక్టర్ ప్రియాంక, హౌస్ సర్జన్, రిమ్స్, కడప