breaking news
house documents to poor
-
AP:రాజధానిలో పేదలు ఉండొద్దంటే ఎలా?
సాక్షి, అమరావతి: ‘‘రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా?’’ అని హైకోర్టు ధర్మాసనం రాజధాని పిటిషనర్లను ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమని వ్యాఖ్యానించింది. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పజాలరని స్పష్టం చేసింది. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవేనని, అంతేకానీ భూములిచ్చిన వారివి కాదని పేర్కొంది. రాజధాని వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అందుకు సంబంధించిన వ్యవహారంలో తాము జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తెలిపింది. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా రాజధాని ప్రాంతంలో 1,134 ఎకరాలను ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తెలిపింది. ప్రస్తుత దశలో స్టే విధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే ప్రభుత్వం చెప్పిందని, అందువల్ల కేటాయింపులను ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజధాని విషయంలో కొన్ని అంశాలను హైకోర్టులో, కొన్నింటిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారని ప్రస్తావిస్తూ జీవో 45పై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేమని, అవి ప్రభుత్వ విధుల్లో భాగమని తేల్చి చెబుతూ జీవో 45పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పురపాలక శాఖ, సీఆర్డీఏలను న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తరువాతే మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలపై పిటిషన్లు.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దామా శేషాద్రినాయుడు, ఉన్నం మురళీధరరావు, దేవ్‌దత్ కామత్, వీఎస్ఆర్ ఆంజనేయులు తదితరులు వాదించారు. ఇళ్ల స్థలాల నిమిత్తం గతంలో జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసిందని మురళీధరరావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తరువాత సీఆర్డీఏ చట్టానికి సవరణలు చేసి ఆర్ 5 జోన్ తెచ్చారన్నారు. తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలిస్తాం.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉండేలా ఆదేశాలు ఇస్తామని పేర్కొనగా దీన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. రాజధాని భూములను అన్యాక్రాంతం చేయడం, బదలాయించడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయరాదని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 అంశాలపైనే స్టే విధించిందన్నారు. మిగిలిన అంశాల విషయంలో హైకోర్టు తీర్పు అమల్లోనే ఉందని నివేదించారు. పరిస్థితిని జఠిలం చేయలేం.. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రజలందరిదని, అది ఏ వ్యక్తిదో, వర్గానిదో కాదని స్పష్టం చేసింది. రాజధానిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో జీవో 45 విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితిని జఠిలం చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను జఠిలం చేస్తోందంటూ పిటిషనర్ల న్యాయవాది దేవ్‌దత్ కామత్ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చదివి వినిపించడంతో... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తమను భాష్యం చెప్పమని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కావాలంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొనగా దానిపై ఇప్పటికే కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందని ధర్మాసనం తెలిపింది. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలేమిటి? ఈ వ్యాజ్యాలను ఇప్పటికిప్పుడు విచారించాల్సినంత అత్యవసరం ఏముందో చెప్పాలని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిదీ అత్యవసరమంటూ పిటిషన్లు దాఖలు చేయడాన్ని తాము ఎంతమాత్రం హర్షించబోమని, తమను ఒత్తిడి చేయవద్దని తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపులు తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని, ఈ దశగా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి ఓ సమావేశం నిర్వహించి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారని, అందువల్లే జీవోపై స్టే కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాదులు నివేదించారు. ‘ప్రభుత్వం పని చేయాల్సిందే కదా. నిర్ణయాలు తీసుకోకుండా ఎలా నిరోధించగలం? అసలు ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి. ప్రభుత్వం భూములను కలెక్టర్లకు బదలాయించాలని మాత్రమే చెప్పింది. కేటాయింపులు ఇంకా జరగలేదు. జరగని కేటాయింపులపై వ్యాజ్యాలు దాఖలు చేయడం ఏమిటి? ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయనివ్వండి. ఆ తరువాత ఏం చేయాలో చూద్దాం...’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరు.. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు స్పందిస్తూ థర్డ్ పార్టీలకు భూములు కేటాయిస్తే విషయం జఠిలం అవుతుందన్నారు. తదుపరి దాఖలు చేసే వ్యాజ్యాల్లో వారందరినీ ప్రతివాదులుగా చేయాల్సి ఉంటుందని, ఆది అచరణ సాధ్యం కాదన్నారు. పిటిషనర్లు రైతులని, ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల వారి హక్కులు ప్రభావితం అవుతాయన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావని, అందరి తరఫున వ్యాజ్యాలు వేసి జీవో మొత్తాన్ని నిలుపుదల చేయాలని కోరలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసింది. ప్రస్తుత దశలో జీవో 45 విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. అపరిపక్వమైన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. ఒత్తిడి చేసి మధ్యంతర ఉత్తర్వులు పొందలేరని వ్యాఖ్యానించింది. రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతరులకు ఇళ్ల స్థలాలివ్వడం చట్ట విరుద్ధమని మరో సీనియర్ న్యాయవాది వీఎస్ఆర్ ఆంజనేయులు వాదించారు. ఇన్సైడర్స్.. అవుట్ సైడర్స్ ఏమిటి? సీనియర్ న్యాయవాది మురళీధరరావు వాదనలు వినిపిస్తూ మే మొదటి వారంలో ఇళ్ల స్థలాలివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు. అవుట్‌సైడర్స్‌కు (రాజధానేతరులు) ఇళ్ల స్థలాలిస్తూ వివాదాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. రాజధాని ప్రజలందరిదీ, కేవలం పూలింగ్ కింద భూములిచ్చిన వారిది మాత్రమే కాదని పేర్కొంది. అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్ అంటూ మాట్లాడొద్దని సూచించింది. రాజధాని భూములను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా అదే జరుగుతోందని తెలిపింది. -
ప్రజా సంక్షేమం ఆగదు: సీఎం వైఎస్ జగన్
కొంత మంది అడ్డంకులు, కోర్టు కేసుల వల్ల విశాఖలో ఇళ్ల స్థలాల పంపిణీ 489 రోజులు ఆలస్యమైంది. కోర్టు వ్యవహారాలు ఎప్పుడు క్లియర్ అవుతాయి.. ఎప్పుడు నా అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇళ్ల పట్టాలిస్తామా అని వారానికోసారి అడ్వకేట్ జనరల్‌తో చర్చిస్తూ వచ్చాను. దేవుడి దయతో ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. ఒక్క విశాఖలోనే అక్కచెల్లెమ్మల చేతిలో రూ.10 వేల కోట్ల విలువైన ఆస్తిని పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎవరు అడ్డుపడినా సంక్షేమం ఆగదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు జరిగే మంచి పనులను అడ్డుకునేందుకు దుష్ట చతుష్టయం (చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5) ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జగన్‌కు ప్రజల మద్దతు పెరిగిపోతోందనే కడుపు మంట వారికి ఎక్కువైందని అన్నారు. గురువారం ఆయన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 1,24,581 మంది పేద మహిళలకు ఇంటి పట్టాలు, రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కింద 3,03,581 మందికి గృహ మంజూరు పత్రాల పంపిణీ ప్రారంభించారు. అంతకు ముందు ఆయన మొత్తం లే అవుట్‌ను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, వైఎస్సార్ పార్కును ప్రారంభించారు. అనంతరం లే అవుట్లో అభివృద్ధి చేసిన మోడల్ ఇంటిని పరిశీలించారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం విశాఖపట్నం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 2 జగనన్న స్మార్ట్టౌన్షిప్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సబ్బవరం మండలం పైడివాడ సభలో ఇళ్ల లబ్ధిదారులనుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్ అక్క చెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ► అడ్డంకులన్నింటినీ అధిగమించి ఇవాళ పైడివాడ అగ్రహారంలోని ఒక్క కాలనీలోనే 10,228 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఈ కాలనీలో విలేజ్ క్లినిక్స్, సబ్‌సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, అంగన్వాడీలు, హైస్కూల్స్, సచివాలయం, మార్కెట్ యార్డు, మూడు పార్కులు రాబోతున్నాయి. ► ఇక్కడ గజం స్థలం విలువ రూ.12 వేల చొప్పున మొత్తంగా ప్లాట్ రూ.6 లక్షలవుతుంది. దీనికి తోడు రూ.2 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రోడ్లు, డ్రైనేజ్, కరెంట్.. ఇలా మౌలిక వసతులతో కలిపి మొత్తం రూ.10 లక్షల ఇంటిని ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతుల్లో పెడుతున్నాం. తద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు శాశ్వత చిరునామా, సామాజిక హోదా కల్పించినట్లు అవుతుంది. పాదయాత్ర సమయంలో 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చాను. దానికి మించి 30.70 లక్షల మందికి అందిస్తున్నాను. 2 – 3 లక్షల కోట్ల ఆస్తి ► గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒకటి నుంచి ఒకటిన్నర సెంట్ల స్థలం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాం. రాష్ట్రంలో 13 వేల పంచాయతీలుంటే 17 వేల జగనన్న కాలనీలే రాబోతున్నాయి. ► విశాఖలో 1.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు రెండో దశ కింద ఇళ్లు కట్టేందుకు మంజూరు పత్రాలు కూడా అందజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మరో 1.79 లక్షల ఇళ్లకు శ్రీకారం చుడుతున్నాం. మొత్తం ఈ ప్రాంగణంలో 3.03 లక్షల మందికి ఇళ్లు కట్టుకునే మంజూరు పత్రాలు అందిస్తున్నాం. ► మొత్తంగా 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు మరో 3.03 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం. వీటితో పాటు 2.60 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అంటే రాష్ట్రం మొత్తంమీద 21.27 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ► రాష్ట్రం మొత్తంలో నిర్మిస్తున్న ఇళ్ల కోసం 71,811 ఎకరాల్ని (పూలింగ్తో కలిపి) కేటాయించాం. రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.35 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు అందిస్తున్నాం. కనీస సౌకర్యాల కల్పనకు మరో రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. విశాఖలో అందిస్తున్న 1.25 లక్షల ఇళ్ల విలువ దాదాపు 10 వేల కోట్లు ఉంటుంది. మొత్తం 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందిస్తే.. వారి చేతిలో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని చేతిలో పెట్టినట్టు అవుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టా లేదనే బెంగొద్దు.. ► అర్హులందరికీ ఇళ్ల పట్టాలిస్తాం. ఎవరికైనా రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే 2.12 లక్షల ఇళ్లకు దరఖాస్తులు రాగా.. 1.12 లక్షల మందికి మంజూరు చేశాం. మిగిలిన వారికి రాబోయే రోజుల్లో మంజూరు చేస్తాం. గతంలో 225 అడుగుల ఇళ్ల బదులు ఇప్పుడు 340 అడుగుల ఇంటిని నిర్మిస్తున్నాం. ► ఇళ్ల కోసం 3 ఆప్షన్లు ఇస్తున్నాం. ఆప్షన్–1 కింద అక్క చెల్లెమ్మలు సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే పనుల పురోగతి మేరకు రూ.1.20 లక్షలు నేరుగా వారి ఖాతాలో జమ చేస్తాం. ఆప్షన్–2 కింద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణ పనులు వాళ్లే చేసుకుంటామంటే.. వారికి కావాల్సిన ఇంటి నిర్మాణ సామగ్రి సబ్సీడీపై తక్కువ ధరకే ఇస్తున్నాం. కూలి మొత్తాన్ని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తాం. ఆప్షన్–3 కింద ఎవరైనా అక్క చెల్లెమ్మలు ఇల్లు కట్టుకోలేమని అనుకుంటే.. ప్రభుత్వమే నిర్మించనుంది. ► ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు రూ.1.80 లక్షలతో పాటు మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణంగా అందించనున్నాం. ఈ మేరకు ఇప్పటికే బ్యాంకులతో మాట్లాడాం. వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర జనాభా పరంగా రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇల్లు కట్టించి ఇస్తున్న మహా యజ్ఞం సాగుతోంది. పైడివాడలోని లేఅవుట్ లో మోడల్ హౌస్ లబ్ధిదారు రమణమ్మకి పట్టా అందిస్తున్న సీఎం రెండు ఫ్యాన్లు... 4 బల్బులూ ఉచితం ► ప్రతి ఇంట్లో ఒక బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉండేలా ప్లాన్ చేసి కడుతున్నాం. ప్రతి ఇంటికి రెండు ఫ్యాన్లు, 4 ఎల్ఈడీ బల్బులు ఉచితంగా అందిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతుంది. జిల్లాల జీడీపీ కూడా పెరుగుతుంది. ► ఒక్కో ఇంటికి కనీసం 25 టన్నుల ఇసుక ఉచితంగా, సిమెంట్, స్టీల్ మొదలైనవి సబ్సీడీ కింద అందిస్తున్నాం. 500 కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో నిర్మాణ సామగ్రి ఉంచేందుకు తాత్కాలిక గోడౌన్స్ నిర్మిస్తున్నాం. ► తొలి దశలో ఈ నెల 26 నాటికి 28,072 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. తొలిదశ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటి వరకు 83.84 లక్షల టన్నుల సిమెంట్, 8.94 లక్షల టన్నుల స్టీల్, 3.72 కోట్ల టన్నుల ఇసుక, 294 కోట్ల ఇటుకలు, 269 లక్షల టన్నుల మెటల్ వినియోగం జరిగింది. ► కార్మికులకు 25.92 కోట్ల పని దినాలు కల్పిస్తున్నాం. దాదాపు 30 రకాల వృత్తి పని వారికి ఉపాధి దొరుకుతోంది. అప్పుడు, ఇప్పుడు తేడా మీరే గమనించండి ► 2014 – 2019 మధ్యా ప్రభుత్వం ఉంది.. అప్పుడూ ముఖ్యమంత్రి ఉన్నారు. స్థలాలివ్వలేదు. ఇళ్ల నిర్మాణం జరగలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి ఉన్నారు. మార్పు ఏమిటంటే 30 లక్షల మంది అక్కచెల్లెమ్మల ముఖంలో ఇవాళ చిరునవ్వు కనిపిస్తోంది. ► గత ప్రభుత్వంలో ఊడ్చి.. ఊడ్చి.. 5 లక్షల ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. తాను మాత్రం హైదరాబాద్‌లో ప్యాలెస్ కట్టుకొని సంతోషంగా ఉన్నాడు. అదే సమయంలో ప్రతిపక్ష నేతగా నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను. తేడా మీరే గమనించాలి. ► ఇవాళ ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. కులం మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ అనేది చూడకుండా.. అర్హత ప్రాతిపదికగా ఈ సోదరుడు అడుగులు ముందుకు వేశాడు. అన్నింటా దుష్టచతుష్టయం అడ్డంకులు ► దుష్ట చతుష్టయం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మంచి పనులకు ప్రతి రోజూ ఎలా అడ్డుపడుతోందో మీరంతా చూస్తున్నారు. ► ఉత్తరాంధ్ర ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు మూడు రాజధానుల్లో విశాఖని ఒకటి చెయ్యాలనుకుంటే అడ్డుకున్నారు. అమరావతిలో అక్కచెల్లెమ్మలు 54 వేల మందికి ఇళ్ల పట్టాలిస్తామనుకుంటే.. కులాల మధ్య సమతుల్యం (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) దెబ్బతింటుందనీ, పేదలు వారి మధ్య ఉండకూడదని దౌర్భాగ్యంగా కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. ఆ 54 వేల మంది పేదలకు కూడా త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తాం. ► రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి.. ఒకప్పటి రాజధానిగా ఉన్న కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తే.. దాన్ని కూడా అడ్డుకున్నారు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలకు నాణ్యమైన విద్య కోసం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చేశాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ ప్రవేశపెడుతున్నాం. దానినీ అడ్డుకోజూస్తున్నారు. ► బ్యాంకుల నుంచి రుణాలు రాకుండా, ఎక్కడ నుంచి ఎలాంటి సహాయం రాష్ట్రానికి అందకూడదని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం డబ్బులు ఇచ్చినా జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగినా.. ఓర్చుకోలేకపోతున్నారు. పేదలకు ఏ మంచి జరిగినా ఈ దుష్ట చతుష్టయానికి కడుపుమంట. కళ్లల్లో పచ్చకామెర్లు, బీపీ, ఒళ్లంతా పైత్యంతో బాధ పడుతున్నారు. ► అడ్డంకులను అధిగమించి ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెబుతూ వలంటీర్లు సంక్షేమ పథకాలందిస్తున్నారు. రూ.లక్షా 37 వేల కోట్లు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించాం. శ్రీకాకుళం జిల్లాకు పోలవరం నీళ్లు తెస్తాం. నాన్న స్వప్నం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చరిత్రపుటల్లో నిలిచిపోయే రోజిది విశాఖ నగరంలో 1.24 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించడం చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి జీవనం కోసం విశాఖ వచ్చిన అనేక మంది అద్దె ఇళ్లల్లో ఇబ్బందులు పడుతున్నారు. వారందరి సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు లబ్ధిదారులందరి తరఫున ధన్యవాదాలు. ఇక్కడ నిర్మాణమవుతున్నది జగనన్న కాలనీ కాదు.. జగనన్న పట్టణం. పేదలకు లబ్ధి చేకూరకుండా కుట్రలతో చంద్రబాబు కోర్టులకు వెళ్లినా..న్యాయమే గెలిచింది. బీసీ, బడుగు, బలహీన, దళిత వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ద్వారానే న్యాయం జరుగుతుంది. – జోగి రమేష్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరు మహిళా పక్షపాతి అన్నా.. మాది పేద కుటుంబం. మీరు మా సొంతింటి కలను నెరవేర్చినందుకు మీకు ధన్యవాదాలు. నాలాంటి పేద వారికి ఇల్లు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. మేం అద్దెలు కట్టలేక కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నాకు మీరు భరోసానిచ్చారు. నా ఇంట్లో నేను ధైర్యంగా బతికే ఆధారం కల్పించారు. నేనున్నానంటూ తోడుగా నిలిచారన్నా. నాకు వివిధ పథకాల ద్వారా సాయం అందుతోంది. మీ అన్న మహిళా పక్షపాతి అంటారు. అవును నేను ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటాను. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. – నవమణి, లబ్ధిదారు, గాజువాక -
పేదింటికి పట్టా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వనున్నట్టు సర్కారు ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 1.01 లక్షల (అధికారిక లెక్కల ప్రకారం) కట్టడాలు క్రమబద్ధీకరణకు నోచుకోనున్నాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై ప్రభుత్వం తుది కసరత్తు పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో విధివిధానాలపై ఏక్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సర్కారు స్థలాల్లో ఇళ్లను నిర్మించుకున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 125 గజాల్లోపు గృహాలను ఉచితంగా క్రమబద్ధీకరించనుంది. దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు మాత్రమే ఇది వర్తించనుంది. ఆదాయపరిమితిని రూ.2లక్షలుగా నిర్ధారించిన సర్కారు.. విలువైన స్థలాలు అక్రమార్కులు వశంకాకుండా జాగ్రత్త పడుతోంది. ఆహారభద్రత, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డును ప్రామాణికంగా తీసుకొని అర్హుల స్థితిగతులను నిర్ణయించనుంది. జిల్లావ్యాప్తంగా 18,130 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాగా, దీంట్లో వ్యవసాయ 11,922, వ్యవసాయేతర 6,207 ఎకరాలు ఉన్నట్లు అధికార యంత్రాంగం లెక్క తేల్చింది. ఈ క్రమంలోనే జిల్లాలో 1.01 లక్షల తాత్కాలిక నిర్మాణాలు, 6,040 పక్కా కట్టడాలు ప్రభుత్వ స్థలాల్లో వెలిసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో వీటన్నింటిని క్రమబద్ధీకరించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం.. లోటు నుంచి గట్టెక్కాలంటే స్థలాల క్రమబద్ధీకరణే శరణ్యమని భావిస్తోంది. ఈ క్రమంలోనే క్రమబద్ధీకరణవైపు వడివడిగా అడుగులు వేస్తోంది. కటాఫ్ తేదీని గత జూన్2ను నిర్ణయించిన ప్రభుత్వం.. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. 126 -250 గజాల్లోపు స్థలాలకు 50% ధర మధ్యతరగతి ప్రజలపై కాసింత కరుణచూపిన సర్కారు.. ఆయావర్గాలు నివసిస్తున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ ధర వర్తింపులో కొంత ఊరటనిచ్చింది. 126- 250 చదరపు గజాల్లోపు నిర్మాణ దారుల నుంచి 50శాతం రిజిస్ట్రేషన్ రేటును వ సూలు చేయాలని నిర్ణయించింది. ఆపై 256- 500 గజాల వరకు 75శాతం, ఆపై నిర్మాణాలకు 100 రుసుము తీసుకొని చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. కాగా, ఏ సంవత్సరం ధరలను వర్తింపజేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధరలను అమలు చేస్తారని తెలుస్తోంది. ఇది వాస్తవమైతే మాత్రం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో క్రమబద్ధీకరణలు జరిగే అవకాశాల్లేవు. ఇప్పటికే కొన్ని చోట్ల మార్కెట్ ధరకంటే రిజిస్ట్రేషన్ విలువలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రెగ్యులరైజ్‌కు వీలు కల్పించినా వినియోగించుకునేందుకు దరఖాస్తుదారులు ముందుకొచ్చే అవకాశాలు స్వల్పమేనని చెప్పవచ్చు. అఖిల పక్షం సిఫార్సులు, జిల్లా యంత్రాంగం సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం అందుకనుగుణంగా జీఓలో నిబంధనలను పొందుపరచాలని నిర్ణయించింది.