breaking news
House Crop
-
ఈ కుండీలో నాచు ఎందుకుందో తెలుసా?
మిద్దె తోటలు, ఇంటి పంటలు, పెరటి తోటల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుండీల్లో పెంచే మొక్కలకు నీటిని అందించేటప్పుడు అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీల్లో మొక్కలకు నీరిచ్చే ఉత్తమ పద్ధతేమిటో తెలుసుకుందాం.మొక్కలకు నీటిని ఎప్పుడూ ఉదయం ఎండ రాకముందే లేదా సాయంత్రం వేళల్లో అందించాలి. దీనివల్ల నీరు ఆవిరి కాకుండా వేర్లకు చేరుతుంది.మొక్కలకు అవసరానికి మించి నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, దీనివల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.వేసవిలో కుండీల్లో లేదా నేల పైభాగంలో ఎండుటాకులు, గడ్డి లేదా పాత గోనె సంచులను కప్పటం ద్వారా మట్టిలోని తేమను ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు.కుండీల్లో అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నీరు నిలిచిపోతే మొక్కలు వ్యాధుల బారిన పడతాయి.ఆకుకూరలు, పూల మొక్కలపై నీటిని తుంపర్లలా చల్లడం వల్ల ఆకులపై ఉన్న దుమ్ము పోవడమే కాకుండా మొక్కలు తాజాగా ఉంటాయి.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది.ఆకులు రంగు మారి, వాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొక్కకు నీరు ఎక్కువైందని చెప్పే ప్రాథమిక సంకేతం.ఎక్కువ నీరు పోయటం వల్ల మట్టిలోని ముఖ్యమైన పోషకాలు కొట్టుకుపోతాయి, ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.తడిగా ఉన్న నేల బ్యాక్టీరియా, ఫంగస్ పెరగటానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మొక్కల మొదళ్లు, ఆకులపై తెగుళ్లు వస్తాయి.నిరంతరం నీటితో నిండి ఉండటం వల్ల మట్టిలోని రంధ్రాలు మూసుకుపోయి మట్టి గట్టిగా మారుతుంది, ఇది వేర్ల విస్తరణను అడ్డుకుంటుంది.కుండీలోని మట్టి నుంచి దుర్వాసన రావటం, మట్టి పైన పాచి పట్టటం, కొత్తగా వచ్చే ఆకులు లేదా చిగుర్లు నల్లగా మారి రాలిపోతుంటే.. ఈ మూడు సమస్యలకు కారణం ఒక్కటే కావచ్చు. అదేమిటంటే.. మొక్కల కుండీల్లో నీరు బయటకు సరిగ్గా వెళ్లటం లేదని. నీరు వెళ్లడానికి తగినంత రంధ్రం ఉందో లేదో ఒకసారి తనిఖీ చేయండి.మట్టిలో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే వేర్లు ఊపిరి తీసుకోలేవు. ఈ ఒత్తిడి వల్ల మొక్క తనపై ఉన్న భారాన్ని తగ్గించుకోవటానికి పువ్వులు, మొగ్గలు, కాయలను రాల్చేస్తుంది.అధిక నీరు పోయడం వల్ల మట్టిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. పూత నిలబడటానికి అవసరమైన కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందక పిందెలు రాలిపోతాయి.మట్టిలో నీరు ఎక్కువ ఉంటే శిలీంధ్రాలు చేరి వేర్లు కుళ్ళిపోతాయి. దీనివల్ల మొక్క బలహీనపడి పిందెలను పోషించలేక వాటిని రాల్చేస్తుంది.నీరు ఎక్కువవటం వల్ల మొక్కలో ఎథిలిన్ వంటి హార్మోన్లు పెరిగి, పూలు, కాయలు కాండం నుంచి∙విడిపోయేలా చేస్తాయి.మట్టి పై పొర 1–2 అంగుళాల వరకు ఆరితేనే నీరు పోయాలి, వేలితో తాకి చూస్తే ఇది తెలుస్తుంది.మొక్క పూత మీద ఉన్నప్పుడు నీటిని తగ్గించి, నేల తేమగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి.మొక్క కాయను పెంచడానికి చాలా శక్తి కావాలి. నీరు ఎక్కువగా ఉండి వేర్లు సరిగ్గా పని చేయకపోతే, మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.కొన్నిసార్లు మట్టి బాగా ఎండిపోయినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీరు పోస్తే, ఆ తేమలో వచ్చే మార్పును భరించలేక మొక్క కాయలను రాల్చుతుంది.కాయలు ఎదుగుతున్న దశలో నీరు సమానంగా అందాలి. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఇవ్వకూడదు.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. నీరు కుండీలో నిల్వ వుంటే మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఇంటిపంటలే ఆరోగ్యదాయకం
హైదరాబాద్ కుషాయగూడలో లత, కృష్ణమూర్తి వృద్ధ దంపతులు రెండేళ్ల నుంచి తాము నివాసం ఉంటున్న బంధువుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటూ ఆరోగ్యంగా, సంతోషంగా గడుపుతున్నారు. కృష్ణమూర్తి ప్రభుత్వ రంగ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా రిటైరైన తర్వాత కుషాయగూడలోని బావ గారి ఇంటి మొదటి అంతస్థులో నివాసం ఉంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలను కలుషిత జలాలతో పండిస్తున్నారన్న వార్తలు చదివిన తర్వాత తమ ఆరోగ్యం కోసం మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవాలని నిర్ణయించుకున్నామని లత కృష్ణమూర్తి తెలిపారు. బరువు తక్కువగా ఉంటుందని గ్రోబాగ్స్‌లోనే ఎక్కువ భాగం ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వారి మిద్దెపై 300–400 గ్రోబాగ్స్‌లో పచ్చని పంటలు పండుతున్నాయి. ఆకుకూరలు, కూరగాయలతోపాటు పండ్ల మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. బోరు లేదు. నీటి అవసరాలకు కుళాయి నీరే ఆధారం కాబట్టి డ్రిప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రోబాగ్స్‌లో కొయ్య తోటకూర, మెంతికూర, చుక్క కూరలతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టానని లత తెలిపారు. మొదట్లో చాలా సమస్యలు వచ్చినా అనుభవం నుంచి నేర్చుకున్నారు. చౌహన్ క్యు, పాలేకర్ బాటలో... ఎర్రమట్టి 20 శాతం, కొబ్బరిపొట్టు 25 శాతం, 55 శాతం పశువుల ఎరువు+వర్మీకంపోస్టుతోపాటు గుప్పెడు వేపపిండి కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకొని గ్రోబాగ్స్‌లో నింపి ఇంటిపంటలను దిగ్విజయంగా సాగు చేస్తున్నారు లత కృష్ణమూర్తి. సౌత్ కొరియా ప్రకృతి వ్యవసాయ నిపుణుడు చౌహన్‌క్యు చూపిన బాటలో ఇంటిలో లభించే ముడి సరుకులతోనే పోషకద్రావణాలను తయారు చేసుకొని పంటలకు ప్రతి వారం, పది రోజులకోసారి పిచికారీ చేయడం, మొక్కల మొదళ్లలో పోయడం ద్వారా మంచి దిగుబడులు సాధిస్తున్నారామె. జీవామృతం స్వయంగా తయారు చేసుకొని ప్రతి 15 రోజులకోసారి పంటలకు అందిస్తున్నారు. మునగాకు లేదా వేపాకు బరువుతో సమానంగా బెల్లం కలిపి 20 రోజుల తర్వాత లీటరుకు 1–2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం, మట్టిలో పోయడం ద్వారా అధిక దిగుబడి పొందుతున్నామని, చీడపీడల బెడద లేకుండా చక్కని ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండుతున్నాయని లత సంతృప్తిగా చెప్పారు. ఈ ఏడాది జూలై నుంచి గత వారం వరకు అసలు కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా పూర్తిగా తమకు ఇంటిపంటలే సరిపోయాయని ఆమె తెలిపారు. అందరూ ఇంటిపంటలు పండించాలి కలుషితనీరు, విషరసాయనాలతో పండించే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు బదులు నగరవాసులు అందరూ తమ ఇళ్లమీద పండించుకోవడం మంచిది. వారానికి కనీసం 3–4 రోజులైనా తాము పండించిన సేంద్రియ, తాజా కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. వాకింగ్‌కు వెళ్లేబదులు ఉదయం గంట, సాయంత్రం గంట పాటు ఇంటిపంటల్లో పనులు చేసుకుంటే మేలు. ఇంటిపంటల పనుల్లో నిమగ్నం అయితే టైం కూడా తెలవదు. మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మేము మంచి ఆహారం తీసుకోవడంతోపాటు విదేశాల్లో ఉన్న మా పిల్లలకు కూడా పొన్నగంటి కూర వంటి ముఖ్యమైన ఆకుకూరలను నీడలో ఆరబెట్టి పంపుతున్నందుకు ఆనందంగా ఉంది. – లత కృష్ణమూర్తి, ఇంటిపంటల సాగుదారు, కుషాయగూడ, హైదరాబాద్ కాకర కాయను చూపుతున్న లత కృష్ణమూర్తి లత కృష్ణమూర్తి మిద్దెతోటలో పండిన కూరగాయలు -
ఇంటి కంపోస్టు.. సొంత కూరగాయలు!
హైదరాబాద్ నగరంలో పుట్టిపెరిగిన ఈమని వెంకటకృష్ణ మెహదీపట్నం కాంతినగర్ కాలనీలోని తమ సొంత ఇంటి టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలు తింటూ ఇంటిల్లి పాదీ ఆరోగ్యంగా ఉన్నారు. వెంకటకృష్ణ బీటెక్ అనంతరం అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసి బహుళజాతి కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఫ్రీలాన్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. 7గురు పెద్దలు, ఇద్దరు పిల్లలున్న ఉమ్మడి కుటుంబం వారిది. 1500 ఎస్.ఎఫ్.టి. టెర్రస్‌పై 200 పైచిలుకు టబ్‌లు, గ్రోబాగ్స్‌లో ఇంటిపంటలు పండిస్తున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలు కొనలేదు. 200 లీటర్ల ప్లాస్టిక్ పీపాలను కొనుగోలు చేసి మధ్యకు కత్తిరించిన వందకుపైగా టబ్‌లు.. అడుగు ఎత్తు–2 అడుగుల వెడల్పు ఉండే వాష్ టబ్స్.. అడుగు ఎత్తుండే గ్రోబాగ్స్ వాడుతున్నారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల ఆకులు అలములతో సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టునే ఉపయోగిస్తున్నారు. ఏ టబ్‌లోనైనా.. కొబ్బరి పీచు+చెరకు గడల వ్యర్థాలను అడుగున 20% ఎత్తు మేరకు వేసి.. ఆ పైన 30% ఎర్రమట్టి వేసి.. ఆ పైన సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును 30% మేరకు వేస్తారు. తర్వాత అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా కంపోస్టు వేసుకుంటూ.. ఇంటిపంటలు పోషకాల లోపం, చీడపీడలకు గురికాకుండా మంచి ఉత్పాదకతను సాధిస్తున్నారు. తోటకూర, పాలకూర, పొన్నగంటి, బచ్చలి, గోంగూరలతోపాటు వంగ, బీర, నేతిబీర, చిక్కుడు, గోరుచిక్కుడు, పిచ్చుకపొట్ల, పచ్చిమిరప, కంద.. సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారానికి 3 రోజులపాటు ఇంటి కూరగాయలనే తింటున్నారు. త్వరలో వారానికి 5 రోజులు సరిపోయే అంతగా ఇంటిపంటల సాంద్రతను పెంచామని అంటూ.. నూటికి నూరు శాతం వీటికే పరిమితం కావడం సాధ్యం కాదని వెంకటకృష్ణ(90001 03046) అభిప్రాయపడుతున్నారు. చెత్తను బయటపడేయకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ.. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను ఇంటిపైనే పండించుకుంటున్న వెంకటకృష్ణ కుటుంబానికి జేజేలు! వెంకటకృష్ణ -
పాత దుపట్టాతో పండు ఈగకు చెక్!
ఇంటి పంటలను ఆశించే చీడపీడల్లో కొన్ని వాటంతటవే తగ్గుముఖం పడతాయి. మరికొన్నింటిని వేపనూనె వంటి వృక్ష సంబంధ క్రిమినాశనులను, కషాయాలను పిచికారీ చేసి అదుపులో ఉంచవచ్చు. కానీ కొన్ని మొండి జాతి పురుగుల నిర్మూలన మాత్రం ఒక పట్టాన సాధ్యం కాదు. ఇటువంటి వాటిలో ముఖ్యమైనది పండు ఈగ (ఫ్రూట్‌ఫ్లై) . దీనివల్ల ఇంటిపంటల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది ఆశించిన పండ్లు, కాయలు లోపలే కుళ్లి చెట్టు నుంచి రాలిపోతాయి. ఉద్యాన పంటల్లో దీన్ని నిర్మూలించేందుకు ఫిరమోన్ అనే రసాయనాన్ని వాడతారు. కానీ ఇంటిపంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల రసాయనాల పిచికారీ సాధ్యం కాదు. అయితే పాత దుపట్టా సంచితో పండు ఈగకు చెక్ చెప్పవచ్చంటున్నారు సీనియర్ ఇంటిపంటల పెంపకందారు వనమామళి నళిని (nalinivmw@gmail.com). హైదరాబాద్ మెహదీపట్నంలోని తమ మేడపై గత ఐదేళ్ల నుంచి వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలను సాగు చేస్తున్నారు. పాత దుపట్టాను కత్తిరించి కుట్టిన చిన్న సంచిలో కాయలను చేర్చి మూతి కడితే చాలు.. పండీగ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చుంటున్నారు. ఈ కవచాన్ని ఛేదించి పండు ఈగ కాయలను ఆశించలేదని నళిని చెపుతున్నారు. ఆలోచన బాగుంది.. కదా మరి ఆచరిద్దామా? దుపట్టా సంచుల తయారీ ఇలా... 1. దుపట్టా సంచిని కట్టిన పండ్లు.. 2. పాత దుపట్టాను సంచుల తయారీలో వాడాలి. 3. సంచిలో ఉంచే కాయల సంఖ్య, పరిమాణాన్ని బట్టి సరిపడా సైజులో దుపట్టాను కత్తిరించుకొని కుట్లు వేసుకోవాలి. దుపట్టాను మూడువైపులా మూసి ఒక వైపు తెరచి ఉండేలా దారంతో కుట్టుకోవాలి. 4. కాయల సంఖ్యను బట్టి అవసరమైనన్ని సంచులను తయారు చేసుకోవాలి. 5. సంచి మూతి వైపు ఒక బొందును కలిపి కుట్టాలి 6. దుపట్టా సంచులు సిద్ధం 7. కాయలు సంచిలోకి వచ్చేలా మూతిని బొందుతో బిగించి కట్టాలి. ఇంటిపంటల రక్షణలో కాంతిరేఖ లైట్ ట్రాప్‌ను వాడి చీడపీడల బారి నుంచి ఇంటి పంటలను కాపాడుకుంటున్నారు హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన వనమామళి నళిని. వినూత్న పద్ధతులను అవలంభించి ఇంటిపంటలను సాగు చేయటంలో ఆవిడది అందెవేసిన చేయి. ఇటీవలే చీడపీడలను నివారించేందుకు ఆమె రూపొందించిన లైట్ట్రాప్ను ప్రయోగాత్మకంగా పరీక్షించి మంచి ఫలితాలు రాబట్టారు. వివిధ రకాల రసం పీల్చే పురుగులను దీని ద్వారా సులభంగా అరికట్టవచ్చు. దీనికోసం ముందుగా బకెట్ లేదా వెడల్పాటి పాత్రను సబ్బునీటితో నింపుకోవాలి. మనం ఇళ్లలో వాడుకునే కరెంట్ బల్బ్‌ను బకెట్పైన ఏర్పాటు చే సి కనెక్షన్ ఇవ్వాలి. ఈ బకెట్‌ను ఇంటిపంటల్లో మొక్కల మధ్య ఉంచి పొద్దుగుంకేముందు లైట్‌ను ఆన్ చేయాలి. లైట్ రాత్రిమొత్తం వెలుగుతూనే ఉండాలి. ఇంటిపంటలను ఆశించిన పురుగులను ఈ వెలుతురు ఆకర్షిస్తుంది. లైట్ దగ్గరకు వచ్చిన పురుగులు బకెట్‌లోని సబ్బునీళ్లలో పడి చనిపోతాయి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే వీటి సంఖ్య తగ్గి ఇంటిపంటలకు ఎలాంటి హాని ఉండదని న ళిని చెపుతున్నారు. -
ముంబై డాబాలపై సామూహిక ఇంటిపంటలు!
నగరాల్లో విస్తరిస్తున్న ఇంటిపంటల సంస్కృతి కొత్త పోకడలను సంతరించుకుంటోంది. ఇంటి పంటల సాగులో ముంబైవాసులు మరో అడుగు ముందుకేశారు. ఎవరింటిపై వారే సేంద్రియ ఇంటిపంటలను సాగు చేసే ధోరణికి భిన్నంగా.. ముంబై వాసులు తోటి వారితో కలిసి సామూహిక ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ముంబైలోని అర్బన్ లీవ్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నగరంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, సేవా సంస్థల భవనాలపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొందరు ఔత్సాహికులు మాతుంగాలోని డాన్‌బాస్కో స్కూల్ భవనంపై గత రెండేళ్లుగా సామూహికంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు, ఔషధ మూలికలను సాగు చేస్తున్నారు. ప్రతి ఆదివారం సామూహిక ఇంటిపంటల క్షేత్రాల్లో అందరూ కూడి పనులు చేస్తారు. పిల్లలు, పెద్దలు వారాంతపు సెలవును ప్రకృతితో మమేకం అయ్యేందుకు ఉపయోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో ఇంటిపంటలకు అవసరమైన సేంద్రియ ఎరువు అమృత్‌మట్టిని భవనాలపైన మడుల్లోనే తయారు చేసుకుంటారు. ఆ తర్వాత అదే మడుల్లో నవధాన్యాలతో పచ్చిరొట్ట పెంచి.. మొక్కలను కత్తిరించి తిరిగి మట్టిలో కలిపేస్తారు. తదనంతరం పంటల సాగు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో చెరకు పిప్పిని విరివిగా వినియోగిస్తారు. ఇటుకలను అందమైన వివిధ ఆకృతుల్లో పేర్చి సమృద్ధంగా ఇంటిపంటలు పండిస్తారు. కేవలం కూరగాయలు, పండ్ల సాగు కోసమే కాక.. సామూహిక ఇంటిపంటలు పక్షులకూ ఆవాసాన్ని కల్పిస్తుండటం విశేషం. సామూహిక ఇంటిపంటల సాగు ద్వారా రసాయన రహిత ఆహారాన్ని పండిస్తున్న అర్బన్ లీవ్స్ ఇండియా బృందం ముంబైని ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది.


