బాలుడి అరెస్టు.. ఒబామా ఆహ్వానం
వాషింగ్టన్: సాధరణంగా ఓ కేసులో అరెస్టయిన కుర్రాడిని చిన్నతనంతో చూస్తాం. అతడిపట్ల ఏహ్య భావాన్ని కలిగి ఉంటాం. కానీ ఆ కుర్రాడికి ఏకంగా దేశ అధ్యక్షుడి నుంచి పిలుపు వస్తే.. అమెరికాలోని తొమ్మిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ అనే కుర్రాడు ఓ అలారం గడియారాన్ని స్వయంగా తయారు చేశాడు. దానిని ఒక పెట్టెలో పెట్టుకొని తమ టీచర్లకు చూపించాలని ఆత్రంతో పాఠశాలకు వచ్చాడు. కానీ దానిని తెరిచి చూసిన ఉపాధ్యాయులు బాంబ్ అనుకొని పొరబడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. ఈ వీడియో ఇంటర్ నెట్లో హల్ చేసింది.
కానీ, ఉపాధ్యాయులు, పోలీసులు చేసింది పొరపాటు అని తెలిసింది. ఈవిషయం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా తెలిసి ఆ బాలుడిని ఏకంగా తన ఇంటికి ఆహ్వానించాడు. పద్నాలుగేళ్ల వయసులో అతడు చేసిన నూతన ఆవిష్కరణకు ముగ్దుడైపోయారు. అతడిలాంటి శాస్త్రవేత్తలే అమెరికాకు కావాలని పొగుడుతూ ట్వీట్ చేశారు. నూతన ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని మరింత ప్రోత్సహించాలే తప్ప సంకెళ్లు వేయకూడదని అన్నారు. మరోపక్క, ఫేస్ బుక్ అధినేత కూడా ఆ కుర్రాడిని పొగడ్తల్లో ముంచెత్తడు. తన ఆవిష్కరణలు అలాగే కొనసాగించమని, ఆ బాలుడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి తనను నిరభ్యంతరంగా కలవొచ్చని ఆహ్వానించాడు.