breaking news
Hindu religious system
-
కుల విభజన ఇంకా అవసరమా?
కుల విభజన హిందూ సమాజంలో ఉన్న అతిపెద్ద దౌర్భాగ్యం. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనేది అందరి ధ్యేయం. సమాజం ఇప్పటికే, భాషలు, ఉపభాషల వంటి వైరుధ్యాలతో చీలిపోయి ఉంది. వీటన్నింటికీ తోడు కుల విభజన పెద్ద వికల్పంగా మారింది. మనువు కుల విభజన చేశాాడంటారు. చేస్తే దాని మనుగడను మనం ఇంకా ఇంకా పొడిగించాలా? మరొక దౌర్భాగ్యం ఏమిటంటే– హిందూ మతం నుంచి వేరుపడి ఇతర మతాలకు మారిన వారు కూడా తమతోపాటు, కులాలను తమ వెంట తీసుకువెళుతున్నారు. దాని ప్రకారం వివాహాది కార్యాలు జరుపుకొంటున్నారు. కొన్ని మతాలు దీనికి మినహాయింపు అని చెప్పవచ్చు. ఎంతోమంది యువతీ యువకులు ప్రేమించుకొని, కులం మతం తేడాలతో మానసిక హింసకు గురవుతున్నారు. సమాజంలో ఏకత్వ సాధనకు కులమతాలు పెద్ద అవరోధం. రాజ్యాంగంలో రాసుకున్న రిజర్వేషన్లు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఇంకా అవసరమా అనేది చర్చనీయాంశం. రిజర్వేషన్ల వల్ల ఏమి జరుగుతోంది? జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కులాల వారే అందులో కొన్ని కుటుంబాల వారే ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన ఉద్యోగాలను ఆక్రమిస్తున్నారు. ఇది మంచిదా? రాజకీయ నాయకులకు ఎలక్షన్లలో ఓట్లకై ఈ విభజన బాగా పనికివస్తోంది. ప్రజలను విభజించి పాలిస్తున్నారు. ఎస్.సి. హాస్టల్/గురుకులం, ఎస్.టి. హాస్టల్/గురుకులం, బి.సి.హాస్టల్/గురుకులం అని కులాల ప్రకారం వేరుగా స్థాపించారు. పిల్లవాడు పుట్టగానే వాడి ముఖంమీద ‘నీవు ఎస్సీ, ఎస్టీ, బీసీ’ అని ముద్రవేసి ఆయా హాస్టల్లలో, విద్యా సంస్థల్లో చేరుస్తున్నారు. ఆ లేత మనస్సులో ‘నేను వెనుకబడిన వాడిని’ అనే న్యూనతా భావం కల్పిస్తున్నారు. ఇది మంచిదా? ఇది అవసరమా? నిజానికి మనం వెనుకబడ్డామని చెప్పుకోవడానికి ఏ మాత్రం స్వాభిమానం కల వ్యక్తికైనా సిగ్గువేస్తుంది. ఒక సాధారణ బడిలో ఇద్దరు విద్యార్థులు పక్కపక్కన కూర్చుని ఒక టీచరు వద్ద ఒకే వాతావరణంలో చదివి, ఒకే ప్రశ్నపత్రానికి జవాబులు రాసి, ఒకరే పేపరు దిద్దాకా, ఒక విద్యార్థికి రిజర్వేషను ఉందని ఎంబీబీఎస్‌లో సీటు ఇచ్చి, పక్క విద్యార్థికి రెట్టింపు మార్కులు వచ్చినా ఓసీ అని సీటు నిరాకరిస్తే ఆ పిల్లవాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల్సి ఉంది. అతడు ఫలానా కులంలో జన్మించడం తన నేరమా? గ్రామాలలో దళిత వాడలు, గిరిజన వాడలు... ఇలా మనం ఎప్పటికీ వేరు వేరుగా ఉండిపోవలసినదేనా? మనమందరం కలిసి బతకకూడదా? దళిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే రూ.10 లక్షలు ఇస్తామంటుంది ఒక ప్రభుత్వం. ఎందుకు? దీనివల్ల ప్రజలలో ఐకమత్యం పెరుగుతుందా? అగ్రకులాలలో నిరుపేదలు లేరా? ఆ మధ్య బిహార్ ముఖ్యమంత్రి, అపోజిషన్ పార్టీలందరిని కలుపుకొని, కులాలవారీగా జనగణన/జనవిభజన జరగాలని ప్రధానమంత్రికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఇది ప్రజలను మానసికంగా ఎంతగా విభజిస్తుంది? ఇది అవసరమా? ఒక ఎస్టీ కులానికి చెందిన కలెక్టరు వచ్చాడనుకోండి. అగ్రకులస్థులు కూడా అతని పరిచయానికి, అతనితో కరచాలనానికి, అలాయ్–బలాయ్ అంటూ కౌగిలించుకోవడానికి, ఎంతో ముందుకు వచ్చి ఉవ్విళ్లూరి, ప్రయాసపడతారు. అదే కులానికి, అదే మతానికి చెందినవాడైనా సరే... ఒక బీదవాడిని ఎవరూ గుర్తించరు. ఈ రిజర్వేషన్ల జాడ్యం జ్యుడిషీయల్ (జడ్జి) ఉద్యోగాలకు కూడా పాకుతోంది. కాబట్టి సమాజంలో అధికారం, సంపద– ఈ రెండే కులాలు. ఈ కులాల విభజనతో, కులాల వారీగా రిజర్వేషనులు చేసుకొంటూ పోతే చదువులు, డిగ్రీలు, నైపుణ్యాలు ఎందుకు? వృథాశ్రమ. కులాలవారీగా జనాభా లెక్కల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేయవచ్చు. పేదవాడికి లేనిది ధనమే కనుక వారి పిల్లలకు ఉచితంగా భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫారాలు, అవసరమైతే ప్రత్యేక శిక్షణ కూడా ఇద్దాం. కానీ మార్కులు, సీట్లు ఫ్రీగా ఇవ్వకూడదు. అప్పుడే నైపుణ్యానికి, జ్ఞానానికి, డిగ్రీలకు నిజమైన విలువ వస్తుంది. మతాలను, కులాలను ఎవరి ఇంటికి వారు పరిమితం చేసుకుందాం. బడికి, కాలేజికి, ఆఫీసుకి, పరిశ్రమలకు మన కులాన్ని, మన మతాన్ని వెంట తీసుకు వెళ్ళవద్దు. – మరింగంటి శ్రీరామ్, భద్రాచలం -
హిందూ ధార్మిక వ్యవస్థల రక్షణకు కొత్త చట్టాలు తేవాలి
శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: హిందూ ధర్మానికి ఆటంకం కలగకుండా ఆచారాలను, సంప్రదాయాలను కాపాడడానికి ప్రస్తుతం సెక్యులర్ పరంగా చట్ట సవరణ అవసరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. రుషికేష్‌లోని శారదా పీఠంలో నిర్వహించబోయే 21వ చాతుర్మాస దీక్షలో పాల్గొనడానికి బయలుదేరిన ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిశారు. ఏపీలో దేవాలయ భూముల అన్యాక్రాంతం, రామజన్మ భూమి, గోవధ తదితర విషయాలపై చర్చించారు. ఏపీలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములను లీజు పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ఇతర మతాలకు చెందిన వారికి, ఆగమాలకు విరుద్ధంగా ఉన్న కొన్ని సంస్థలకు కట్టబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సెక్యులర్ పేరిట, ఇతర మతాల ప్రభావంతో హిందూ ధర్మ వ్యవస్థపై అధికారం చెయ్యడానికి ప్రయత్నిస్తూ పీఠాధిపతులు, మఠాధిపతులపై కుట్ర జరుగుతోందన్నారు. నాస్తిక వాదంతో కొందరు దేవాలయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ సంప్రదాయాలను, ఆచారాలను మంట కలుపుతున్నారని స్వామి చెప్పారు. హిందూ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడడానికి చట్ట సవరణకు బీజేపీ సహకారం కోసం రాం మాధవ్‌ను కలసినట్లు ఆయన తెలిపారు. గోవధలను నివారించడానికి, సెక్యులర్ పేరిట కొన్ని ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరముందన్నారు. త్వరలోనే ప్రధాని, రాష్ట్రపతిలను కలిసి హిందూ ధర్మ, ధార్మిక వ్యవస్థలను కాపాడడానికి కొత్త చట్టాలు తేవాలని కోరనున్నట్లు స్వామి తెలిపారు. హైందవ సనాతన ధర్మ సంస్థలను, వ్యవస్థలను కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని రాం మాధవ్ చెప్పారు. స్వామి చెప్పిన విషయాలను ప్రధాని తదితర పెద్దలతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు.