అగ్గి మీ అరచేతిలో..
చూడ్డానికి వాచీలా కనిపిస్తున్న ఈ పరికరం మన చేతిలో ఉంటే.. అగ్గి మన అరచేతిలో ఉన్నట్లే. ‘పైరో’ అనే ఈ పరికరాన్ని మన చేతికి కట్టుకుంటే.. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు కురిపించినట్లు అగ్నిగోళాలను మనమూ కురిపించవచ్చు. ‘పైరో’లో నాలుగు వేర్వేరు చాంబర్లు ఉంటాయి. దీని వల్ల రెండు మూడు అగ్నిగోళాలకు ఒకేసారి కురిపించవచ్చు.
30 అడుగుల దూరం వరకు అగ్నిగోళాలు దూసుకెళ్తాయి. ఇందులో మండే స్వభావం కలిగిన ‘ఫ్లాష్ కాటన్’ అనే పదార్థం ఉంటుంది. అది మండటం వల్లే ఇది నిప్పులను కురిపిస్తుందన్నమాట. పైరోను రిమోట్ సాయంతోనూ నియంత్రించవచ్చు.
దీన్ని తయారుచేసిన ఆడమ్ విల్బర్ ఓ ఇంద్రజాలికుడు. ప్రధానంగా దీన్ని ఇంద్రజాలికుల కోసమే రూపొందించాడు. 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే పైరోను విక్రయిస్తున్నారు. దీని ధర రూ.10,700. ఇందులో ఉండే రీఫిల్తో 50 సార్ల వరకు నిప్పులు కురిపించవచ్చు. తర్వాత మళ్లీ రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో రీఫిల్ ధర రూ.500.