breaking news
Heavy security arrangement
-
ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ఐపీఎల్ మ్యాచ్.. భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్ల రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ (IPL-2025) మ్యాచ్‌ల భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని.. 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. రేపు (శనివారం) నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. -
పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతం
జిల్లా పరిషత్: జిల్లాలో మూడు సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 3 వార్డు స్థానాలకు గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ కారణాల వల్ల జిల్లాలో మూడు సర్పంచ్, ఒక ఎంపీటీసీ, 38 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, 32 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, మూడు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో మూడు సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు గురువారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉప ఎన్నిక నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. బిచ్కుంద మండలం ఎల్లారం సర్పంచ్‌గా మాన్యా రాథోడ్ 43 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కమలాబాయి రాథోడ్‌పై విజయం సాధించారు. అలాగే, నవీపేట్ మండలం బినోల సర్పంచ్‌గా ఒల్కె సుధాకర్ 186 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి రవిని ఓడించారు. మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ సర్పంచ్‌గా రాములు తన ప్రత్యర్థి ఈరయ్యపై 320 మెజార్టితో గెలుపొందారు. ఇక, దోమకొండ మండలం సంగమేశ్వర్ 7వ వార్డు మెంబర్‌గా లక్ష్మీనర్సింహులు, లింగంపేట్ మండలం భవానీపేట్ 7వ వార్డుసభ్యుడిగా దత్తయ్య, ఎడపల్లి మండలం పోచారంలో 7వ వార్డు మెంబర్‌గా తాడెం ఇస్తారి విజయం సాధించారు. వీరికి రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మద్నూర్ మండలంలోని సుల్తాన్‌పేట్, బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి పరిశీలించారు. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానానికి ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ముషీర్‌నగర్, కొటాల్‌పల్లిలో రెండు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, ఓటర్లు బారులు తీరారు. మొత్తం 77.94 శాతం పోలింగ్ నమోదైందని జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఈవీఎంలను సీజ్ చేసి మండల పరిషత్ కార్యాలయంలో భద్రపరుస్తామన్నారు. 10వ తేదీన ఉదయం కౌంటింగ్ ఉంటుందని వివరించారు.