breaking news
heavy rains in nizamabad district
-
కేరళలో తెలుగోడి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళ వరద విలయానికి అక్కడ నివసిస్తోన్న వందలాది మంది తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కేరళ వ్యాప్తంగా వేలాది మంది తెలుగువారు ఉండగా.. ఒక్క కొచ్చిలోని ఏలూర్ కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వారంతా అక్కడికి వలస పోయారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వరద చుట్టుముట్టడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 నుంచి 100 తెలుగు కుటుంబాలపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. అనేక ఇళ్లు మునిగిపోవడంతో సామాన్లు పనికిరాకుండా పోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో తలదాచుకుని ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం వస్తువులన్నీ పాడవడంతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన స్థానిక ఫ్యాక్ట్ కంపెనీలో చిన్న కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వలస కార్మికులు కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీ, షిప్‌యార్డుల్లో దాదాపు వెయ్యి, పదిహేను వందల మంది తెలుగువారు పని చేస్తున్నారు. వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేక రోజు గడవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వీరిని ఆదుకోవడానికి కొచ్చి తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ చేపడుతోంది. ఇక్కడి తెలుగు ప్రజల్లో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. -
కొట్టుకుపోయిన కారు: తల్లీ, కొడుకు గల్లంతు
-
వాగులో కొట్టుకుపోయిన కారు: తల్లీ, కొడుకు గల్లంతు
నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. వేల్పూర్ మండలం పడకల వద్ద ఉధృతంగా వాగు ప్రవహిస్తుంది. వాగులో శనివారం కారు కోట్టుకుపోయింది. దీంతో అందులోని తల్లీ, కొడుకు గల్లంతయ్యారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1084 అడుగుల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో లక్షా 31 వేల 713 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 11 వేల క్యూసెక్కులు ఉంది.నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో నీటిమట్టం 1405 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 1377 అడుగులకు నీరు వచ్చి చేరింది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 18 వేల క్యూసెక్కులు ఉంది.