ధరలు పెంచితే కఠిన చర్యలు
కాకినాడ సిటీ :
నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. ఆదివారం కలెక్టరేట్లో హోల్సేల్ వర్తకులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో కరెన్సీ నోట్ల మారకం, నిత్యావసర ధరలపై సమీక్షించారు. నిత్యావసర వస్తువులు దొరకవని, ధరలు పెరుగుతాయని వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరారు. అలాగే ఉప్పు దొరకదంటూ ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. వర్తకులు కృత్రిమ కొరత సృష్టించడం, ధర పెంచి అమ్మడం వంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాంటి వ్యాపారులపై పీడీ యాక్టు ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర సరుకులు సాధారణ ధరలకు విక్రయించాలని ఆదేశించారు. రైతుబజార్లలో నిత్యావసర సరుకుల ధరల బోర్డులను ప్రదర్శించాలని చెప్పారు. ఉప్పు నిల్వలు, కందిపప్పు, మినపప్పు, నూనె వంటి సరుకులను ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేయించాలని ఆర్డీఓలకు సూచించారు. ఈ నెల 14 వరకు పెట్రోల్ బంకులు, మందులషాపులు, హాస్పిటల్స్, మీ–సేవ కేంద్రాల్లోనూ పాత రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్, మార్కెటింగ్ ఏడీ కేవీఆర్ఎ¯ŒS కిషోర్, పౌర సరఫరాల శాఖ ఏఎస్ఓలు పి.సురేష్, ప్రసాద్, రాజు పాల్గొన్నారు.