breaking news
Health concern
-
ఈ ప్రపంచం రోగగ్రస్తం!
95 శాతం మందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య * మూడో వంతు మందికి ఐదు కంటే ఎక్కువ వ్యాధులు * అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో ఏకంగా 95 శాతం మంది ప్రజలు రోగగ్రస్తులే! దాదాపు మూడొంతుల మందికి ఐదు కన్నా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరోగ్యవంతులు ఉన్నారు.1990-2013 సంవత్సరాల మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితులపై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ(జీబీడీ)’ పేరుతో జరిగిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే ఫలితాలు తాజాగా అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 188 దేశాల నుంచి 35,620 వనరుల నుంచి సమాచారం సేకరించి పరిశోధించారు. సర్వేలోని ముఖ్యాంశాలు... ⇒ 2013 నాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఉన్నారు. ⇒ ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది (230 కోట్లు) ఐదు కన్నా ఎక్కువ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. పది ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంఖ్య 1990-2013 మధ్యలో ఏకంగా 52 శాతం పెరిగింది. ⇒ 1990, 2013లో నడుం నొప్పి, కుంగుబాటు, రక్తహీనత, మెడ నొప్పి, వయసు సంబంధ వినికిడిలోపం వంటి సమస్యలే ఆరోగ్య నష్టాలకు అత్యధికంగా కారణమయ్యాయి. ⇒ 2013లో ప్రపంచ ఆరోగ్య నష్టాలకు ముఖ్యంగా నడుంనొప్పి, కీళ్లనొప్పి, కుంగుబాటు, ఆందోళన, డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత అనారోగ్యాలే అధికంగా కారణమయ్యాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యల వల్ల ప్రజలు తమ జీవితాల్లో నష్టపోయిన ఆరోగ్యకర సంవత్సరాలు 1990లో 21 శాతం కాగా, అది 2013 నాటికి 31 శాతానికి పెరిగింది. ⇒ 1990తో పోల్చితే 2013 నాటికి మరణాల రేటు కంటే అంగ వైకల్య రేటు చాలా నెమ్మదిగా తగ్గుతోంది. -
డెంటల్ కౌన్సెలింగ్
మా అబ్బాయి వయసు నాలుగేళ్లు. వాడి పాలపళ్లన్నీ ఇప్పటికే పిప్పిపళ్లయ్యాయి. ఎందుకిలా జరిగింది? తర్వాత వచ్చే శాశ్వత దంతాలపై దీని దుష్ర్పభావం ఉంటుందా? - ఎమ్. రాజేశ్వరరావు, కరీంనగర్ పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలపళ్లు ఊడకముందే శాశ్వత దంతాలు వస్తే పళ్లు ఎగుడుదిగుడుగా ఉండేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాలపళ్లు వచ్చినప్పటి నుంచీ అవి పాడయ్యే అవకాశాలు ఉంటాయి. తీపిపదార్థాలు, చక్కెర ఉన్న పానీయాలు ఎక్కువగా తాగడం, పిల్లలు ఏడ్వకుండా ఉండటానికి పాలపీకను నోట్లో ఉంచేయడం వంటి అలవాట్లతో పళ్లు పాడవుతాయి. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే- పాడైన వాటినన్నింటినీ తొలగించాలి, ఇలా పళ్లు పాడయ్యే ప్రమాదాన్ని చాలామట్టుకు నివారించవచ్చు. ఆ స్థానంలో కొత్త పళ్లను అమర్చాల్సి రావచ్చు. మా పాపకు తొమ్మిదేళ్లు. ఆమె పై పళ్ల వరుసలో ఒక చిన్న సందు ఏర్పడింది. అది క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే పెద్దయ్యాక అసహ్యంగా ఉంటుందని మా ఆందోళన. దీనికి సరైన చికిత్సను సూచించగలరు. - వంశీమోహన్, సికింద్రాబాద్ ఎదిగే పిల్లల్లో అంటే 9-10 సంవత్సరాల మధ్య వయసులో పళ్ల వరుసలో సందులు ఏర్పడటమనేది చాలా సాధారణమైనదీ, సహజమైనదీ. ఈ దశను అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. దీనికి ఏ విధమైన చికిత్సా అవసరం లేదు. 11-12 సంవత్సరాలు వచ్చేసరికి సందులు వాటంతట అవే పూడుకుపోతాయి. ఒకవేళ అప్పటికీ పళ్ల మధ్య సందులు అదేవిధంగానే ఉంటే గనుక అప్పుడు మీరు దంతవైద్యులను కలసి వారి సలహా మేరకు చికిత్స తీసుకోవచ్చు. కాబట్టి దీని గురించి మీరేమీ ఆందోళన పడనవసరం లేదు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి,ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్ మీకు ఎదురయే రకరకాల అనారోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యుల బృందం ద్వారా తగిన వైద్య సలహాలు పొందండి. ఇందుకు మీరు చేయవలసిందల్లా మీ సమస్యలను వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34కు రాయండి. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com