breaking news
Health care bill
-
వాతావరణ మార్పుల బిల్లుపై బైడెన్ సంతకం
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో ఇది చట్టరూపం దాల్చినట్లే. కొత్త బిల్లు ప్రకారంఅమెరికాలో వాతావరణ మార్పుల వల్ల తలెత్తే దుష్పరిణామాలను నివారించడానికి వచ్చే పదేళ్లలో 375 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న యుద్ధంలో ఇది అతిపెద్ద పెట్టుబడి అని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించనున్నారు. అర్హులకు రాయితీతో ఆరోగ్య బీమా, ఔషధాలు అందిస్తారు. తాము ఎల్లప్పుడూ అమెరికా ప్రజల వెంటే ఉంటామని, ఇతర ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదని ఈ సందర్భంగా బైడెన్ వ్యాఖ్యానించారు. కొత్త బిల్లుకు అమెరికా పార్లమెంట్ గత వారమే ఆమోదం తెలిపింది. -
‘కిరణాల’ పేరిట దగా !
నిరుద్యోగులను నిండా ముంచుతున్న బోగస్ సంస్థలు అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు.. ఆనక భారీగా డిపాజిట్ల వసూలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణ పేర పుట్టుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలవి... యువకులకు ఉద్యోగాల ఆశ ఎరచూపి డబ్బులు దండుకోవటం వాటి పన్నాగం. ఇలాంటి సంస్థల గుట్టు రట్టు చేసి నిర్వాహకులను కటకటాల వెనక్కు నెట్టాల్సిన అధికారులు, వాటితో జతకట్టారు. రాజీవ్ యువకిరణాల కింద నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చేస్తామని అధికారులు బొంకేసరికి అభ్యర్థులు ఎగబడ్డారు. ఇంకేముంది.. ఆ సంస్థల నిర్వాహకులు కోరినంత ముట్టజెప్పారు. ధనదాహం తీరాక.. ఓ మంచి ముహూర్తం చూసుకుని అవి బోర్డు తిప్పేశాయి. ఇదేం దారుణమంటూ అభ్యర్థులు నిలదీస్తే ‘మాకు సంబంధం లేదు, డబ్బులెవరికిచ్చారో వారిని అడుక్కోండి’ అంటూ అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఇలా వందలాది మంది యువజనులు దగా పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మానస పుత్రిక ‘రాజీవ్ యువకిరణాలు’ పేరిట జరుగుతున్న నిలువు దోపిడీ ఇది! ఉద్యోగాల పేరు చెప్పి అమాయక యువత నుంచి డబ్బు దండుకొని ఉడాయించే దగాకోరులకు ఈ పథకం అండగా మారింది. వీరికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలవుతున్నాయి. విచిత్రమేమిటంటే... ఉద్యోగాలు కల్పించినట్టుగా రాజీవ్ యువకిరణాలు వెబ్సైట్లో అధికారులు చేర్చిన జాబితాలలో ఇలా దగాపడ్డ యువకుల పేర్లు ఉండడం! సీఎం మెప్పు కోసం అధిక ఉద్యోగాలు కల్పించామని చెప్పుకోవడానికి అధికారుల నిర్వాకాలు ఇవి. నిండాముంచిన స్వచ్ఛంద సంస్థ కర్నూలు జిల్లాలో రూరల్ హెల్త్ ఇండియా సర్వీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇచ్చే ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఆశలు రేపింది. రకరకాల ఉద్యోగాల్లో ఉపాధి చూపనున్నట్లు యువతకు ఎర వేసింది. వేల సంఖ్యలో యువకులు దరఖాస్తు చేసుకోగా.. డీఆర్డీఓ అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు, శిక్షణ కార్యక్రమాల తంతు జరిపారు. ఎంపికైన వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల చొప్పున వసూలు చేశారు. భంగపడిన ఉద్యోగార్థుల గగ్గోలుతో ఈ అక్రమం వెలుగు చూసింది. కొద్దిరోజులకే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. మోసపోయిన బాధితులు అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారుల సమక్షంలో ఎంపికలు జరగడంతో ఇవి ప్రభుత్వ పక్షాన జరిగే నియామకాలుగానే భావించి అడిగినంత డబ్బు ఇచ్చామని అభ్యర్థులు వాపోతున్నారు. మోసపోయిన విషయం గ్రహించి డీఆర్డీఓ అధికారులను నిలదీస్తే... డబ్బు వసూలుతో తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారని బాధితులు వాపోయారు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటూ ‘రాజీవ్ యువకిరణాల’ బాధిత అభ్యర్థులు రోడ్డెక్కారు. దీంతో అధికారులు రాజీవ్ యువకిరణాలు వెబ్సైట్ నుంచి ఆయా అభ్యర్థుల పేర్లను తొలగించి చేతులు దులి పేసుకున్నారు. దీంతో యువకులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. బోర్డు తిప్పేసిన ‘ఆరోగ్యదాత’ శ్రీకాకుళం జిల్లాలో ‘ఆరోగ్యదాత’ అనే సంస్థ పేరిట ఇలాంటి మోసమే చేసింది. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత ఈ సంస్థ కూడా బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేర అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్య తీసుకునే వారే కరువయ్యారు. దీంతో ఇలాంటిదే ఓ సంస్థ విశాఖపట్టణంలో తాజాగా దుకాణం తెరిచింది. ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేసే ఉద్యోగాలిస్తామంటూ అభ్యర్థులకు గాలం వేస్తోంది. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ ఇలాంటి బోగస్ సంస్థలు అధికారుల అండతో నిరుద్యోగులకు శఠగోపం పెట్టే పనుల్లో నిమగ్నమయ్యాయని వినికిడి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే సంగతి దేవుడెరుగు.. ‘రాజీవ్ యువకిరణాలు’ పేరిట నిరుద్యోగులను నిండా ముంచుతున్న వారికి చెక్ పెట్టలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటున్న ఈ పథకంలో చీకటి కోణంపై ప్రభుత్వం దృష్టిసారించకపోవటం విమర్శలకు తావిస్తోంది. -
ఆత్మహత్యాయత్నం నేరం కాదు!
న్యూఢిల్లీ: ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించరాదని పేర్కొనే మానసిక ఆరోగ్య పరిరక్షణ బిల్లు 2013ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సదరు వ్యక్తి అలాంటి చర్యలకు పాల్పడటానికి కారణం అతడి మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడమేనని.. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 309 నిబంధనల కింద వారిని శిక్షార్హులుగా పరిగణించరాదని ఈ బిల్లు చెబుతోంది. విప్లవాత్మక బిల్లుగా పేర్కొంటున్న దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖఈ వారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దేశ క్రిమినల్ చట్టంలో ఈ తరహా సవరణ కోరడం ఇదే తొలిసారి. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి హక్కుల పరిరక్షణకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.