breaking news
healing Free
-
Divine Space: శ్వాసపై ధ్యాస
రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలు. పాతిక గంటలు చేసినా తరగనన్ని పనులు. ఇదీ నేటి ఫాస్ట్ లైఫ్... బతుకు చిత్రం. ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరుగుతోంది. మెదడు తన వంతుగా హెచ్చరిక చేస్తుంది. గమనించే తీరిక ఉండదు మనిషికి. ఊపిరి సలపనివ్వనన్ని పనులు. ఆరోగ్యాన్ని హరిస్తున్న బిజీ లైఫ్‌లో ధ్యాసతో ఊపిరి పీల్చమంటున్నారు అర్పిత. మోడరన్ లైఫ్‌లో మనిషి జీవితం... మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా గమనించలేని స్థితిలోనే ఎక్కువ భాగం గడిచిపోతోంది. కొన్నిసార్లు సమస్య మానసికమైనదా, శారీరకమైనదా అనే స్పష్టత కూడా ఉండదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి టెస్టులు చేయించుకుని మందులతో నయం చేసుకోవాల్సిన అనారోగ్యం కూడా చాలా సందర్భాల్లో ఉండదు. అలాగని మనశ్శాంతి కోసం ధార్మిక సత్సంగాలతో కాలం గడిపే విశ్రాంత జీవనమూ కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పరుగులు తీయక తప్పదు. ఈ పరిస్థితికి సమాధానం డివైన్ స్పేస్‌లో దొరుకుతోంది. ఒత్తిడుల మధ్య జీవిస్తూనే తేలికగా జీవించగలగడం ఎలాగో తెలిపే ఒక వేదిక ఇది... అంటున్నారు అర్పితా గుప్తా. విభిన్నమైన రంగాన్ని ఎంచుకుని సమాజహితం కోసం పని చేస్తున్న అర్పితా గుప్తా పరిచయం. గాలి పీల్చడం తెలియాలి! ‘‘సైకాలజీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ కలగలిసిన వేదిక ఇది. కెరీర్లో కొనసాగుతూనే వారానికో గంట సమయం కేటాయించుకోవడం అన్నమాట. మా నాన్న డాక్టర్, అమ్మ టీచర్. మా ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటైంది నాకు. మొదటి నుంచి అలాగే ఉండేదాన్ని. పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది పార్ట్‌టైమ్ జాబ్‌లు చేయడం చూసి నేను కూడా ఒక ఇరిగేషన్ కంపెనీలో చేరాను. డిగ్రీ వరకు అంతే... చదువు ఉద్యోగం రెండూ. పెళ్లి తర్వాత చదువు, ఉద్యోగం రెండూ మానేసి ఇంట్లో ఉన్నాను. నాకు అది ఒక టర్నింగ్ పాయింట్. 1998–99 సంవత్సరాల్లో రేఖీ సాధన ట్రెండింగ్‌లో ఉండేది. పక్కింటి ఆవిడ వెళ్తూ నన్ను పిలిచింది. ఆ ప్రాక్టీస్‌తో నా ఆలోచనా ధోరణి మారిపోయింది. త్రీ లెవెల్స్ వరకు ప్రాక్టీస్ చేసి మానేశాను. ఓ ఏడాదిపాటు మళ్లీ గృహిణిగా, పిల్లల్ని పెంచుకుంటూ రొటీన్ లైఫ్. అయితే ఆ గ్యాప్‌లో ఫ్రెండ్స్, బంధువులు తలనొప్పి, మైగ్రేన్, డయాబెటిక్, ఎసిడిటీ వంటి సమస్యలకు రెమిడీ అడిగేవారు. శ్వాస తీసుకోవడం కరెక్ట్‌గా వస్తే జీవక్రియలన్నీ సక్రమంగా ఉంటాయి. గంట నుంచి ఒకటిన్నర గంట హీలింగ్ సెషన్ లో శ్వాస సాధన చేయించడమే వైద్యం. ఇంట్లో మూడు వారాలు ప్రాక్టీస్ చేస్తే ఇక అదే అలవాటయిపోతుంది. ఇలా మొదలైన సర్వీస్ ఆ తర్వాత చారిటబుల్ ట్రస్ట్‌గా రూపాంతరం చెందింది. అవి బంధాలే– బంధనాలు కాదు! ఇటీవల అమ్మాయిల్లో చాలా మంది పెళ్లంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నారు. బాల్యంలో సెక్యువల్ అబ్యూస్‌కి గురి కావడమే ప్రధాన కారణం అయి ఉంటుంది. మగవాళ్ల మీద ఏహ్యభావం పేరుకుపోయి ఉంటుంది. భర్తతో సరిగ్గా మెలగలేకపోతుంటారు. ఈ పరిస్థితులు అనేక అపార్థాలకు, విడాకులకు దారి తీస్తున్నాయి. ఆ అమ్మాయి ఓపెన్ అయ్యే వరకు ఆమెకు ఆలంబనగా నిలవాలి. మొదట తన దేహాన్ని తాను ప్రేమించుకునేటట్లు కౌన్సెలింగ్ ఇవ్వాలి. వైవాహిక జీవితాన్ని స్వాగతించడానికి మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక మధ్య వయసు గృహిణుల్లో... ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ చాలా పెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలూ ఉండవు. ఏమీ తోచని స్థితి నుంచి దేహంలో ఏదో ఒక అనారోగ్యం ఉన్నట్లు భావిస్తుంటారు. పిల్లలు పెద్దయి చదువు, ఉద్యోగాలతో వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే మిగులుతారు. మగవాళ్లు దాదాపుగా రోజంతా బయట పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆడవాళ్లు ఇంట్లో రోజంతా ఒంటరిగా గడపలేక ఏదో కోల్పోయినట్లవుతారు. అలాంటి వాళ్లను ‘మీకు ఏ కూర ఇష్టం’ అంటే వెంటనే సమాధానం చెప్పలేరు. భర్త ఇష్టాలు, పిల్లల ఇష్టాలను టక్కున చెప్పేస్తుంటారు. తమకంటూ జీవితం ఉందనే వాస్తవాన్ని కూడా గ్రహించకుండా యాభైఏళ్లపాటు జీవించేసి ఉంటారు. సెల్ఫ్ లవ్ అనే భావనే ఉండదు వాళ్ల మనసులో. మన సమాజం ఆడవాళ్లను అలా పెంచేసింది మరి. అలాగే ఆఫీసుల్లో ఆడవాళ్లకు ఎమోషనల్ అబ్యూజ్ మరో రకమైన సమస్య. ఇవన్నీ ఇలా ఉంటే... అత్తగారి హోదా వచ్చేటప్పటికి విచిత్రంగా మారిపోతుంటారు. ‘మేము వీకెండ్ సినిమాకు వెళ్తే మా అత్తగారు ఒప్పుకునే వారు కాదు. ఎంత బాధగా అనిపించేదో’ అని గుర్తు చేసుకుంటూ తాను మాత్రం కోడలి విషయంలో అలా ఉండకూడదు... అని నిర్ధారించేసుకుంటారు. ఇక కోడలితో ‘సండే సినిమాకు వెళ్లండి’ అని పదే పదే చెబుతుంటారు. సినిమాకు వెళ్లాలని ఆ కోడలికి ఉందా లేదా అనే ఆలోచన ఉండదు. ఇలాంటి ఎన్నో సున్నితమైన సమస్యలకు పరిష్కారం తమంతట తాముగా తెలుసుకోగలిగినట్లు చేయడమే నా సర్వీస్. నేనిచ్చే పాతిక ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాసుకుంటే చాలు... బంధాలు అనుబంధాలుగా ఉండాలి తప్ప బంధనాలుగా ఉండకూడదని వాళ్లే తెలుసుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి’’ అని చెప్పారు అర్పితా గుప్తా. భయం కాదు... భరోసానివ్వాలి! కొంతమందికి క్లోజ్డ్ లిఫ్ట్ అంటే భయం. బలవంతంగా తీసుకువెళ్లినా కూడా ఊపిరాడనట్లు సతమతమవుతారు. ఇంట్లో వాళ్లు జాగ్రత్త కొద్దీ ‘లిఫ్ట్‌లోకి వెళ్లకు, నీకు ఊపిరాడదు’ అని భయపెడుతుంటారు. లిఫ్ట్‌లో ఏ ప్రమాదమూ రాదని ధైర్యం చెప్పాలి. వారిలో ఆ భయాన్ని పోగొట్టాలంటే ఆత్మీయంగా మాట్లాడాలి. మాటల్లో మాటలుగా ఎప్పటికో అసలు విషయం బయటపడుతుంది. చిన్నప్పుడు ఎప్పుడో తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో బంధీ అయి ఉక్కిరి బిక్కిరి కావడం వంటివేవో కారణాలు ఉంటాయి. ఒక పేషెంట్ కోసం గంట– రెండు గంటలు కేటాయించడం డాక్టర్లకు సాధ్యం అయ్యేపని కాదు, అంతేకాదు, ఇలాంటి ఫోబియాలున్న వాళ్లలో చాలామంది పేషెంట్ అనిపించుకోవడం ఇష్టంలేక డాక్టర్ దగ్గరకు వెళ్లరు. ఒక స్నేహితురాలిగా వాళ్లకు ఇష్టమైన టాపిక్ మాట్లాడుతూ వాళ్లంతట వాళ్లే ఓపెన్ అయ్యేలా చూడాలన్నమాట. – అర్పితా కె గుప్తా, చైర్ పర్సన్, డివైన్ స్పేస్ చారిటబుల్ ట్రస్ట్, సైనిక్‌పురి, సికింద్రాబాద్ – వాకా మంజులారెడ్డి – ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఆడపిల్ల పుడితే..వైద్యం ఫ్రీ
మహాలక్ష్మి పుట్టిందని పెద్దలు అంటుంటారు. దీనిని నిజం చేస్తోంది మండపేటలోని నారాయణరెడ్డి హాస్పటల్. ఆడపిల్ల పుడితే చాలు నార్మల్ డెలివరీ అయినా, శస్త్ర చికిత్స అయినా కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. అమ్మాయి పుట్టగానే అదృష్టం కలిసొచ్చిందన్న ఆనందాన్ని ఆ కుటుంబంలో నింపుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఆడ శిశువులకు జన్మనిచ్చిన 45 మంది తల్లులకు ఉచితంగా పురుడు పోసి, లక్షలాది రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందించారు. సృష్టికి మూలం మహిళ. సాంఘిక దురాచారాలకు అనేక సందర్భాల్లో భ్రూణ స్థాయిలోనే అంతమవుతోంది. ఈ నేపథ్యంలో తన వంతుగా ఇలాంటి దురాగతాలను నిర్మూలించడంతో పాటు ఆడశిశువుల జనన శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది మండపేటలోని నారాయణరెడ్డి హాస్పటల్స్. లయన్స్ క్లబ్ డెరైక్టర్, పారిశ్రామికవేత్త కర్రి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ వసతులతో మండపేటలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన నారాయణరెడ్డి హాస్పటల్స్ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఉచితంగా పెద్దఎత్తున వైద్య శిబిరాలనూ నిర్వహిస్తోంది. లయన్స్ క్లబ్ డెరైక్టర్‌గా, సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారాయణరెడ్డి చేతనైనంతలో ఆడ శిశువుల జనన శాతాన్ని పెంచాలన్న సంకల్పమే ఈ ఉచిత డెలివరీలకు నాంది పలికింది. తెల్లరేషన్ కార్డు ఉంటే.. పేద వర్గాలకు చెందిన వారు (తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు) తమ ఆస్పత్రిలో డెలివరీ చేయించకుని, ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, శస్త్ర చికిత్స అయిన నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నారు. డిసెంబర్లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మండపేట, అనపర్తి, కొత్తపేట, రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు చెందిన 45మంది మహిళలకు ఆడ పిల్లలు జన్మించగా డెలివరీ, శస్త్రచికిత్సల రూపంలో లక్షలాది రూపాయలు విలువచేసే వైద్యసేవలను వారికి ఉచితంగా అందించారు. శస్త్ర చికిత్స అయితే మత్తు డాక్టర్, రక్తపరీక్షలు, మందులు చెల్లించుకుంటే సరిపోతుంది. ఎంత మందికి అయినా ఆడపిల్లలు జన్మించిన వారికి ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే తమ లక్ష్యమని నారాయణరెడ్డి తెలిపారు. చాలా ఆనందంగా ఉంది నా భార్యకు నారాయణరెడ్డి హాస్పటల్స్‌లో పురుడు పోయిచాం. ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. ఆపరేషన్‌కు, వైద్య పరీక్షలకు డబ్బులేవి తీసుకోకుండా ఉచితంగా చేశారు. కేవలం మత్తు డాక్టర్‌కు, మందులకు డబ్బులు చెల్లించామంతే. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. రూ. ఐదు వేలకే రూ.25 వేల వైద్యసాయం రెండో డెలివరీలో నాకు ఆడపిల్ల జన్మించింది. రూ.25 వేల వరకు ఖర్చవుతుందని భావించాం. ఆడపిల్ల పుట్టడంతో ఆపరేషన్, వైద్య ఖర్చులేవీ తీసుకోలేదు. కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఖర్చయ్యాయి. నారాయణరెడ్డి హాస్పటల్స్ డాక్టర్లు కూడా దగ్గరుండి ఎంతో బాగా చూశారు. - ఈ.సునీత, మండపేట చేతననైనంతలో మార్పు తెచ్చేందుకు.. పెంట కుప్పల్లోనో, కాలువల్లోనో ఎక్కడో ఓ చోట ఆడ శిశువులు విగత జీవులుగా పడి ఉండటం నన్ను ఎంతో కలిచివేస్తోంది. భ్రూణహత్యల నియంత్రణకు మా వంతు తోడ్పాటుగా ఉచిత డెలివరీలకు శ్రీకారం చుట్టాం. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రెండు నెలల్లో మా ఆస్పత్రి ద్వారా 45 మందికి ఉచితంగా పురుడు పోయడం ఆనందంగా ఉంది. - కర్రి నారాయణరెడ్డి, నారాయణరెడ్డి హాస్పటల్స్ అధినేత, మండపేట