breaking news
H D Deve Gowda
-
బరిలో మనవళ్లు.. హసన్‌ను వదులుకుంది అందుకేనా?!
బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ తెలిపారు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి వేణుగోపాల్, మాజీ సీఎం సిద్ధరామయ్యతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హసన్ లోక్‌సభ స్థానం నుంచి దేవెగౌడ మనుమడు, కర్ణాటక మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ ఎన్నికల బరిలో దిగనున్నారనే ప్రచారం జోరందుకుంది. నిఖిల్ కుమారస్వామికి కూడా ఛాన్స్! నెల రోజుల క్రితం బెంగళూరులో జరిగిన జేడీఎస్ నేత, ఎమ్మెల్సీ బీఎం ఫరూఖ్ కూతురి పెళ్లికి ఎంపీ దేవెగౌడ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మనుమలు నిఖిల్ (కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, కన్నడ హీరో), ప్రజ్వల్ (మంత్రి రేవణ్ణ కుమారుడు) తమ తాతయ్యతో ముచ్చటించిన దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో నిఖిల్, ప్రజ్వల్‌లు త్వరలోనే రాజకీయ అరంగేట్రం ఖరారైందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పోటీ చేసే విషయమై వీరిరువురు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హసన్‌ను వదులుకుంది అందుకేనా? జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తుతం హసన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో పార్టీకి మంచి పట్టు ఉంది. గత ఆరు పర్యాయాలుగా(ఉప ఎన్నికలు సహా) హసన్‌లో జేడీఎస్ గెలుపు జెండా ఎగురవేస్తూనే ఉంది. ఇక్కడి నుంచే దేవెగౌడ ఎంపీగా హ్యాట్రిక్ కూడా కొట్టారు. ఈ నేపథ్యంలో రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్.. తాతయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచే బరిలో నిలవాలని ఆశిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్ పార్టీ టికెట్ ఆశించారని.. అయితే అప్పుడు కుదరకపోవడంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించేందుకు దేవెగౌడ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హసన్ నుంచి తాను పోటీచేయబోనని, తన స్థానంలో ప్రజ్వల్ పోటీ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం తాను పోటీచేసే విషయమై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. దీంతో నిఖిల్ కూడా తనకు టికెట్ ఇచ్చే విషయమై దేవెగౌడపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే తండ్రి కుమారస్వామి నుంచి మాట తీసుకున్న నిఖిల్ మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. ‘ ఒకవేళ ప్రజ్వల్ పోటీ చేయడం ఖాయమైతే, నిఖిల్ కూడా తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి దేవెగౌడ నో చెప్పలేరు అని అభిప్రాయపడ్డారు. కాగా జేడీఎస్ నుంచి ఇప్పటికే దేవెగౌడ ఎంపీగా, కుమారస్వామి సీఎంగా, ఆయన భార్య అనితా కుమారస్వామి ఎమ్మెల్యేగా, రేవణ్ణ మంత్రి(పీడబ్ల్యూడీ)గా, ఆయన భార్య భవానీ హసన్ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా వివిధ పదవుల్లో ఉన్నారు. దీంతో ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు వారసులు కూడా అరంగేట్రం చేయనుండటంపై వారు ఎలా స్పందిస్తారోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
‘దేశమంతా తిరిగి ఒక్కటి చేస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి తమ దగ్గర సరైన వ్యూహాలున్నాయని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడలతో కలిసి దేశమంతా పర్యటించి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని అన్నారు. జాతీయ స్థాయిలో కాకుండా ప్రాంతీయంగా అన్ని పార్టీలతో కూటములను ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమన్నారు. 1975-77 ప్రభుత్వ కాలంలో ఇందిరాగాంధీపై ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత ఇప్పుడు ప్రధాని మోదీపై మొదలైందని అన్నారు. మోదీ దేశానికి ఏదో చేస్తాడని ఇన్నాళ్లూ ఉన్న భ్రమలు తొలగిపోయాయని ఎద్దేవా చేశారు. నాడు లోకమాన్య జయప్రకాశ్ నారాయణ్ ఇందిరకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరేలా చేశారని అన్నారు. ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడంతో ఇందిరాగాంధీ ఓటవి చవిచూడక తప్పలేదనీ, అలా జనతా పార్టీ నుంచి ఎన్నికైన మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమి బీజేపీపై విజయం సాధిస్తే ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారని ప్రశ్నించగా.. ప్రస్తుత తరుణంలో సరైన ప్రత్యామ్నాయం రాహుల్ గాంధీయేనని, అందరూ ఆయనవైపే మొగ్గుచూపుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సిద్ధు పాలనపై మాజీ ప్రధాని నో కామెంట్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనకు పాత మిత్రుడని, ఆయన పాలనపై వ్యాఖ్యలు చేయబోనని జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ అన్నారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిద్ధరామయ్య నాలుగేళ్ల పాలన ఎలావుందని అడగ్గా... ‘దీనిపై నేను ఎలా మాట్లాడగలను. సిద్ధరామయ్య నాకు పాత మిత్రుడు. ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేద’ని సమాధానం ఇచ్చారు. బంగారప్ప, అంబరీష్ బీజేపీ చేరనున్నారని వార్తలపై స్పందించేందుకు దేవెగౌడ నిరాకరించారు. బీజేపీలో చేరే విషయంపై జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. గతంలో కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజశేఖర్ మూర్తి, బంగారప్ప వంటి నాయకులను వాడుకుని వదిలేశారన్నారని గుర్తు చేశారు. యూపీలో బీజేపీ గెలిస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లినట్లేనని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాటలు మారుస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.