breaking news
guns and bullets seized
-
యూట్యూబ్ చూసి తుపాకుల తయారీ
వరంగల్ క్రైం: యూట్యూబ్ చూసి తుపాకులు తయారుచేసి జనగామ జిల్లా మొండ్రాయి పాలకుర్తిలో ఈ నెల 15న అర్ధరాత్రి దోపిడీకి పాల్పడిన ఆరుగురి దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడిన నకిలీ నక్సలైట్ ముఠాను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు తండాకు చెందిన ఇస్లావత్ శంకర్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన నారబోయిన మల్లేష్, నల్గొండ జిల్లా చిట్యాల మండలం, పేరపల్లికి చెందిన గంగాపురం స్వామి, అలియాస్ మల్లేష్, పాలకుర్తి మండలం చెన్నూరుకి చెందిన పిట్టల శ్రీనివాస్, చెన్నూరు గ్రామానికి చెందిన చీలూరి పరమేశ్, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎన్జి కొత్తపల్లికి చెందిన సరిపంగి విప్లవ్‌లు ఉన్నారని సీపీ తెలిపారు. ముఠాగా ఏర్పడి.. ప్రధాన నిందితుడు ఇస్లావత్ శంకర్ మరో నిందితుడు గంగారపు స్వామితో కలిసి 2018లో జనశక్తి పార్టీ అనుబంధ సంస్థ అయిన రైతు సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జనశక్తి పేరుతో మరోసారి డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో గంగారపు స్వామి పిట్టల శ్రీనివాస్, నారబోయిన మల్లేశంను ప్రధాన నిందితుడు ఇస్లావత్ శంకర్‌కు పరిచయం చేశాడు. వీరంత ఒక ముఠాగా ఏర్పడి పలుసార్లు వివిధ ప్రాంతాల్లో కలుసుకొని అసెంబ్లీ ఎన్నికల ముందు స్వామిని గ్రామంలో కలుసుకున్నారు. జనశక్తి పేరుతో డబ్బులు సంపాధించాలంటే ఆయుధాలు అవసరం కావడంతో పిట్టల శ్రీనివాస్ తుపాకులు తయారు చేశాడు. డిసెంబర్ 31న దోపిడీకి ప్రణాళిక.. బొమ్మలు తయారు చేసే నైపుణ్యం కలిగిన పిట్టల శ్రీనివాస్ యూట్యూబ్ చూసి తుపాకులు తయారు చేశాడు. సైకిల్ బొంగులు, కర్ర, డ్రమ్స్, రాగిరేకు ఇలా... అందుబాటులో ఉండే వస్తువులతో నాటు తుపాకులతో పాటు అవసరమైన బులెట్లను తయారు చేశాడు. దీనికి తోడు మరో నిందితుడు స్వామి గతంలో తన దగ్గర ఉన్న 12 బోర్ తూటాలను అందించాడు. కొడకండ్ల మండలంలోని మద్యం షాపులను లక్ష్యంగా చేసుకున్న ముఠా సభ్యులు మొదట డిసెంబర్ 31న దోపిడీకి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆ రోజు రాత్రి జనం ఎక్కువగా ఉండంతో ప్రణాళిక మార్చుకున్నారని సీపీ వివరించారు. సమానంగా వాటాలు 15న ఇస్తావత్ శంకర్ ఇంటి దగ్గర ముఠా సభ్యులు అందరూ కలుసుకుని శంకర్ మద్యం షాపు దగ్గర కాపు కాయగా మిగితా నిందితులు మొండ్రాయి, పాలకుర్తి రోడ్డులో తుపాకులతో కాపుకాచి దోపిడీకి సిద్ధం అయ్యారు. తిరుమల మద్యం దుకాణం నిర్వహకులు రూ.6.70 లక్షలు తీసుకుని ముగ్గురు ఒకే వాహనంపై వెళ్తుండగా మద్యం షాపు దగ్గర ఉన్న శంకర్ మిగితా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. డబ్బులతో వస్తున్న షాపు నిర్వాహకుల ద్విచక్రవాహనాన్ని రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి గాలిలో కాల్పలు జరిపి డబ్బులను డబ్బులు తీసుకుని వెళ్లారు. దోపిడీ అనంతరం నిందితులు సొమ్మును సమాన వాటాలుగా పంచుకుని వివిధ ప్రాంతాలకు పారిపోయారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు స్థానిక పోలీసులతో పాటు పది ప్రత్యేక బృందాలు పనిచేశాయని సీపీ తెలిపారు. నిందితులు శంకర్ , మల్లేష్, స్వామిలు ముగ్గరు చెరువు ముందు తండాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు రాజు, సతీష్‌లు వారిని అదుపులోకి తీసుకోని విచారించగా శ్రీనివాస్, పరమేశ్, విప్లవ్‌లు చెన్నూరులో ఉన్నట్లు తెలిపడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని సీపీ రవీందర్ వివరించారు. రూ.5.56 లక్షలు స్వాదీనం.. నిందితుల నుంచి దోపిడీ చేసిన సొమ్ము నుంచి రూ.5,56,650 నగదు, మూడు తపంచాలు,10 తూటాలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అధికారులకు అభినందనలు.. నిందితులను సకాలంలో గుర్తించి సొమ్మును రికవరీ చేసిన వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ మధుసూధన్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి, పాలకుర్తి ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు సతీష్, రాజు, టాస్క్‌ఫోర్స్, ఐటీకోర్, సైబర్ విభాగం, స్పెషల్ పార్టీ పోలీసులను సీపీ అభినందించారు. -
భారీ ఎత్తున అక్రమ ఆయుధాలు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సోమవారం సరాయ్‌కాలే ఖాన్‌లో ముగ్గురు ఆయుధ స్మగ్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 1,800 కాట్రిడ్జ్‌లు, 9 డబుల్ బ్యారెల్ తుపాకులు, రెండు సింగిల్ బ్యారెల్ తుపాకులను స్వాధీనపరచుకున్నారు. అక్రమ ఆయుధాల గురించి సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితులపై దాడి చేసింది. అక్రమ ఆయుధాల రాక గురించి అందిన సమాచారం ఆధారంగా వలపన్ని ముగ్గురిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఈ ఆయుధాలను నిందితుల నుంచి తీసుకోవాల్సిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆయుధాలను అందించడానికి వచ్చిన నిందితులు మాత్రమే పోలీసుల చేతికి చిక్కారు. ఈ స్థాయిలో ఆయుధాలు పోలీసులకు దొరకడం ఈ ఏడాదిలో రెండోసారి. గతంలో కూడా 900 కాట్రిడ్జ్‌లతో పాటు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.