breaking news
gundrevula
-
గుండ్రేవులపై తెలంగాణతో చర్చిస్తాం
సాక్షి, కర్నూలు: తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించేందుకు చేసిన ప్రతిపాదనలపై తెలంగాణతో చర్చించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం అమరావతిలో జిల్లాకు చెందిన జల వనరుల శాఖ ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఈ నారాయణరెడ్డి, కర్నూలు సర్కిల్ ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు అందుబాటులో ఉన్న వనరులపై అధ్యయనం చేయాలని సూచించారు. వెంకటాపురం చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, గుట్టుపల్లి చెరువులో నీటిని నిల్వ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హంద్రీ–నీవా కాలువ 110 కి.మీ దగ్గర నుంచి గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు నీరు ఇచ్చేందుకు చేసిన ప్రతిపాదనల గురించి ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి మంత్రికి వివరించారు. మంత్రి తక్షణమే జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి ఈ ప్రతిపాదనలను వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హంద్రీ–నీవా విస్తరణ, లైనింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయండి హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణలో మిగిలిన పనులు, కాలువ లైనింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ ప్రాజెక్టు ఎస్ఈ నాగరాజ ఇంజినీర్లను ఆదేశించారు. బుధవారం హంద్రీ–నీవా విస్తరణ ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులపై జల వనరుల శాఖ కర్నూలు ప్రాజెక్టŠస్ సీఈ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యాకేజీ–1, 2లో పెండింగ్ ఉన్న పనులతో పాటు, కాలువకు పూర్తి స్థాయిలో లైనింగ్ చేసేందుకు, అదనపు మోటార్ల ఏర్పాటు, కాలువపై ఉన్న స్ట్రక్చర్లకు లూప్‌లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్యాకేజీ–1 కింద 0 కి.మీ నుంచి 78.67 కి.మీ వరకు కాలువను విస్తరించేందుకు రూ.358.09 కోట్లతో రిత్విక్ ప్రాజెక్ట్సు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ చేపట్టిన పనులు ఇప్పటి వరకు 62.56 శాతం మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా రూ.157.21 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయని ఇంజినీర్లు వివరించారు. రెండో ప్యాకేజీ కింద 79.075 కి.మీ నుంచి 134.27 కి.మీ వరకు కాలువ విస్తరణ పనులను చేపట్టిన హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ఇప్పటి వరకు 32 శాతం మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.159.50 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు వచ్చే నెల 5లోపు ప్రతిపాదించాలని ఎస్ఈ సూచించారు. ప్రధాన కాలువ విస్తరణ పనులు పూర్తి చేస్తే 3,850 క్యూసెక్కుల నీరు వెళుతుందని, అదే లైనింగ్ చేస్తే 6,300 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని తెలిపారు. తద్వారా తక్కువ రోజుల్లోనే ఎక్కువ నీటిని డ్రా చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముచ్చుమర్రి పంపింగ్ స్టేషన్‌లోని మోటార్ల సామర్థ్యాన్ని పెంచేలా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఈఈలు విశ్వనాథం, పురుషోత్తం, ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుండ్రేవులను పక్కనబెట్టిన ప్రభుత్వం
– 64 ఏళ్లగా రాయలసీమకు నీటి కేటాయింపుల్లో అన్యాయం – రాయలసీమ జలచైతన్య సదస్సును జయప్రదం చేయండి కోవెలకుంట్ల: గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని కర్నూలు సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రాష్ట్రాల సాకుతో పక్కనబెట్టారని అఖిలభారత రైతు సంఘాల సమాఖ్య, సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక రోటరీక్లబ్ భవనంలో రాయలసీమ జలచైతన్యసభ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ఏపీపాటు తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతో ముడిపడి ఉందని సీఎం చెప్పడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 160 టీఎంసీల నీరందే దుమ్ముగూడెం ప్రాజెక్టును చేర్చకపోవడం అన్యాయమన్నారు. గత 64 సంవత్సరాల నుంచి సీమకు నీటి కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గాలేరు, హంద్రీనీవా, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం సీమ ప్రజల సాగు, తాగునీటి హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కుందూనదిపై జోళదరాశి, రాజోలి ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు కేటాయించినా పనులు ప్రారంభించకుండా నిలుపుదల చేశారన్నారు. సీమకు చట్టబద్ధమైన నీటి హక్కు సాధనకు రైతులు నడుం బిగించాలని లేకపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందన్నారు. ఈ నెల 21వ తేదీన నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్లో నిర్వహించే రాయలసీమ జలచైతన్య సభకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ జాయింట్యాక్షన్ కమిటీ కో ఆర్డినేటర్ కామని వేణుగోపాల్‌రెడ్డి, సభ్యులు కరీంబాషా, సీపీఎం డి విజన్ కార్యదర్శి సుధాకర్, వడ్డె సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.