ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు డీజీపీ డిస్క్ అవార్డు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో నక్సల్ అణచివేతలో విశేష కృషి చేసిన తెలుగు ఐపీఎస్ అధికారి, నువాపడా జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ప్రతిష్టాత్మక డీజీపీ డిస్క్ అవార్డు (2024–25) ప్రదానం చేశారు.నువాపడా జిల్లా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలో ఉండటం వల్ల నక్సల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఆపరేషన్లు అత్యంత క్లిష్టమైనవిగా ఉన్నప్పటికీ,ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర సమర్థవంతమైన వ్యూహాలతో నక్సల్ దాడులను అణచి వేయడంలో, వారి ప్రాభవాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు.నక్సల్ అణచివేతతో పాటు, నువాపడా జిల్లాలో క్రైమ్ కంట్రోల్, శాంతి భద్రతా పరిరక్షణలో ఆయన విశేష కృషి చేశారు. ప్రజలలో భద్రతా నమ్మకం పెంచడం, చట్టాన్ని కాపాడుతూ.. నేరాలను తగ్గించడం వంటి అంశాలు ఈ అవార్డు పొందడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. కటక్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒడిశా డీజీపీ.. ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను ప్రశంసిస్తూ, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే అధికారుల ధైర్యం, క్రమశిక్షణ, ప్రజా సేవా తపనకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఒడిశాలో పనిచేస్తున్న తెలుగు అధికారిగా గుండాల రెడ్డి రాఘవేంద్ర ఈ అవార్డు పొందడం తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారుల ప్రతిభను జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత గౌరవమే కాకుండా, తెలుగు అధికారుల ధైర్యం, క్రమశిక్షణ, ప్రజా సేవకు నిదర్శనంగా నిలుస్తోంది.చలపతిని సైతం ఎన్కౌంటర్లో..ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి నాలుగున్నర దశాబ్దాల క్రితం నక్సల్బరీ ఉద్యమంలోకి వచ్చారు. రెండున్నర దశాబ్దాల నుంచి ఉత్తర కోస్తాతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించిన చలపతి ఎన్కౌంటర్లో తెలుగు ఐపీఎస్ అధికారి గుండాలరెడ్డి రాఘవేంద్ర కీలక పాత్ర పోషించారు. కూంబింగ్ బృందానికి నాయకత్వం వహించారు. గతేడాది ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్ బలగాలు కూంబింగ్ చేపట్టి,సోమవారం మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందగా వారిలో చలపతి కూడా ఉన్నారు. ఇలా నక్సల్స్ అణిచివేతకు సత్తా చాటిన ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్రకు డీజీపీ నుంచి డిస్క్ అవార్డును అందుకున్నారు.