breaking news
Gudala Sai Srinivas
-
కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గుడాల శ్రీనివాస్ అరెస్ట్
ఏలూరు అర్బన్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కరభూషణ్ కేసు వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 20వ తేదీన మృతురాలు కృపామణి భర్త వెల్దుర్తి నాగపవన్‌కుమార్ తన భార్య కనబడడంలేదని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు పాలకోడేరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని శృంగవృక్షం కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం దొరికింది. ఈ నేపథ్యంలో అదే నెల 25 తేదీన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కృపామణి భర్త పవన్‌కుమార్ తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఆమె మృతికి కాకరపర్రు గ్రామానికి చెందిన గుడాల సాయి శ్రీనివాస్, అత్తమామలు రావూరి లక్ష్మి, నాగలింగేశ్వరరావుతో పాటు బావమరిది రాజ్‌కుమార్‌లు కారణమని ఫిర్యాదు చేశాడు. తనను గుడాల సాయి శ్రీనివాస్‌తో వేశ్యావృత్తి చేయమంటూ తల్లిదండ్రులు, అన్నలు నిర్బంధించ డంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి లేఖ రాయడంతో పాటు సెల్ఫోన్లో తన వేదనను వివరిస్తూ రికార్డు చేసి భర్తకు పంపింది. ముమ్మర గాలింపు ఈ ఉదంతం పెనుదుమారం రేపడంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఈ కేసు దర్యాప్తునకు జంగారెడ్డి గూడెం, కొవ్వూరు డీఎస్పీలు కె.వెంకట రావు, ఎన్.వెంకటేశ్వరరావులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. కృపామణి రాసిన లేఖ, సెల్‌ఫోన్, మృతురాలి భర్త అందించిన సాక్ష్యాలను ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపడంతో పాటు కృపామణి తన లేఖలో నిందితులుగా పేర్కొన్న పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అక్టోబర్ 31న విశాఖపట్నంలో కేసులో ఏ-1 నిందితుడు సాయి శ్రీనివాస్‌కు చెందిన కారును స్వాధీనం చేసుకున్నా నిందితుడు శ్రీనివాస్ తప్పించుకుపోయాడు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన కృపామణి తల్లిదండ్రులు, అన్నతో పాటు నిందితులు పోలీసులకు చిక్కకుండా తన ఇంటిలో ఆశ్రయం కల్పించిన దాసని మంగలను దెందులూరు సమీపంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. ఆ తరువాత గాలింపు ముమ్మరం చేసి చివరకు శనివారం పెరవలి బ్రిడ్జి వద్ద కారులో ప్రయాణిస్తున్న ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ వెల్లడించారు. వివాహితను వేశ్యావృత్తి చేయమంటూ నిర్బంధించడం దారుణంగా పరిగణించి నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన విధంగా కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. రిమాండ్‌కు తరలింపు తణుకు : అరెస్ట్‌కు ముందు తణుకు ప్రభుత్వాసుపత్రిలో గుడాల సాయిశ్రీనివాస్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఏలూరులో ఎస్పీ భాస్కర్‌భూషణ్ సమక్షంలో అరెస్ట్ చూపారు. అనంతరం తణుకు తీసుకువచ్చిన పోలీసులు శనివారం పొద్దుపోయాక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు. గత చరిత్ర నేరమయమే ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ గతంలోనూ నేరచరితుడే అని ఎస్పీ చెప్పారు. నిందితునిపై పెరవలి, ఉండ్రాజవరం పోలీసు స్టేషన్లలో చాలా సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. పెరవలి పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉందన్నారు. ఇటీవల పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం ఏలూరు నివాసిగా తప్పుడు డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నాడని వివరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత, జంగారెడ్డిగూడెం డీఎస్పీ కె.వెంకటరావు, తణుకు సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. -
రహస్యంగా గుడాల విచారణ
జంగారెడ్డిగూడెం : తణుకు మండలం వేల్పూరులో కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్లోని ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇత న్ని ఉంచి గోప్యంగా విచారిస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గుడాల సాయి శ్రీనివాస్‌ను పట్టుకున్నాయి. ఇతను వెల్దుర్తి కృపామణి ఆత్మహత్యానంతరం పరారయ్యాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పోలీసులు ఇతని బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేశారు. ముంబైలో ఉన్న సాయిశ్రీనివాస్ వద్ద డబ్బులు అయిపోవడంతో బ్యాంకు ఖాతాలు సీజ్ అయిన కారణంగా ఏటీఎం నుంచి నగదు రాకపోవడంతో హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే అతని కోసం గాలిస్తున్న ఒక బృందం ముంబైకు చేరుకుంది. ఆ సమయానికి సాయి శ్రీనివాస్ హైదరాబాద్ చేరుకున్నాడని తెలుసుకున్న ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో ఇతన్ని అదుపులోకి తీసుకుంది. ఇదంతా సాయి శ్రీనివాస్ సెల్‌ఫోన్ నెట్వర్క్ ఆధారంగా పోలీసులు సాగించారు. ఇతన్ని హైదరాబాద్ నుంచి ఈ నెల 25న జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో ఓ రహస్య ప్రాంతానికి తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు ప్రత్యేకాధికారిగా ఉన్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, ఇంటెలిజెన్స్ డీఎస్పీ, తణుకు సీఐ అంకబాబులు సాయి శ్రీనివాస్‌ను విచారిస్తున్నట్టు తెలిసింది. నోరు మెదపని నిందితుడు! విచారణ అధికారులు ఎంతసేపు ప్రశ్నించినా సాయిశ్రీనివాస్ నోరు మెదపడం లేదని తెలిసింది. నోరువిప్పితే చాలామంది పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జరిగిందేదో జరిగిందని, తాను ఇరుక్కున్నానని, అందువల్ల ఇతరుల పేర్లు ఏవీ కూడా సాయి శ్రీనివాస్ బయట పెట్టడం లేదని సమాచారం. సాయి శ్రీనివాస్ వ్యవహారం మొత్తం పోలీసులకు, రాజకీయ నాయకులకు, స్పెషల్‌బ్రాంచి పోలీసులకు పూర్తిగా తెలుసునని తెలుస్తోంది. వీరందికీ సాయి శ్రీనివాస్ నెలవారీ మామూళ్లు పెద్దఎత్తున ముట్టజెప్పేవాడని సమాచారం. బాగా సంపాదించిన శ్రీనివాస్ వ్యభిచార గృహాలు నిర్వహించేవారు సాయి శ్రీనివాస్ ద్వారా అమ్మాయిలను తీసుకుని వెళ్లేవారని తెలిసింది. సాయి శ్రీనివాస్ ఇదే వృత్తిలో బాగా సంపాదించినట్టు సమాచారం. ఒక్కొక్క అమ్మాయికి మూడు నెలల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకుని రూ.లక్ష చెల్లించే విధంగా ఒప్పందంతో ముంబై తరలిస్తుంటాడని సమాచారం. అక్కడి నుంచి నాగ్‌పూర్, పూణె ప్రాంతాలకు కూడా మహిళలను తరలిస్తాడని సమాచారం. సాయి శ్రీనివాస్ నిర్వహించిన లావాదేవీల్లో ఒక అమ్మాయికి 3 నెలలకు గాను అత్యధికంగా రూ. 5లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. కృపామణి తలిదండ్రులు సాయి శ్రీనివాస్ వద్ద రూ.లక్ష తీసుకుని తమ కుమార్తెను పంపిసామని ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కృపామణి అంగీకరించకపోవడంతో సాయిశ్రీనివాస్ తన సొమ్ము వెనక్కి ఇచ్చేయమని అడిగాడు. దీంతో కృపామణి తల్లితండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులు తమ కుమార్తెపై ఒత్తిడి తేవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయిశ్రీనివాస్ చెబుతున్నట్టు తెలిసింది. సాయి శ్రీనివాస్‌కు రాజకీయ నాయకుల అండ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఎక్కడ ఉంచింది, అతను ఏం చెప్పింది చెప్పడం లేదు.