కార్ల అమ్మకాలు 6 శాతం అప్
న్యూఢిల్లీ: కార్ల విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 శాతం వృద్ధి సాధించాయి. ఇది మెరుగుపడుతున్న వినియోగదారుల సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తోందని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. బడ్జెట్లో ఆర్థిక వృద్ధికి పలు చర్యలు ప్రతిపాదించారని, కార్లు విక్రయాలు పుంజుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతున్న ప్రతికూల సెంటిమెంట్లు తగ్గుతున్నాయని ఫిబ్రవరి గణాంకాలు వెల్లడిస్తున్నాయని వివరించారు.
సాధారణంగా మార్చి నెలలో అమ్మకాలు బావుంటాయని, దీంతో ఫిబ్రవరి విక్రయాలతో పోల్చితే మార్చి విక్రయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాలు ఒక అంకె వృద్ధిని సాధిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. వర్షాలు సరిగ్గా కురవకపోవడం, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు కొరత కారణంగా మోటార్ సైకిళ్ల విక్రయాలు తగ్గాయని వివరించారు.