breaking news
Green Super Rice
-
గ్రీన్ రైస్ దిగుబడి అదుర్స్!
తక్కువ ఎరువులతో 67 బస్తాలు పండిన జెడ్‌జీవై-1.. తెలంగాణ ఎర్రనేలల్లో బోర్ల కింద సాగుకూ అనుకూలం చౌడు పొలాల్లో, ఉప్పు నీటిని తట్టుకొని 55 బస్తాలు పండిన హెచ్హెచ్జెడ్5 ఎస్ఏఎల్-10 వంగడం అసలు ఎరువులు, పురుగుమందుల్లేకుండా 30 బస్తాలు పండిన ఎస్ఏజీఎస్4 వంగడం ఆకలిపై పోరులో వజ్రాయుధం విత్తనం! మన సుదీర్ఘ వ్యవసాయ సంస్కృతికి బలమైన పునాదీ విత్తనమే. వేలాది ఏళ్ల సేద్య పరంపరలో అన్నదాతలు ఎంపిక చేసి సాగుచేస్తూ పరిరక్షించుకుంటున్న అపురూప సంపద దేశవాళీ విత్తనాలు. ఆధునిక వంగడాలు విఫలమవుతున్న నేపథ్యంలో.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిశ్చింతగా తిరిగి వాడుకోదగిన దేశవాళీ వంగడాలే మళ్లీ అవసరమవుతున్నాయి. 250 దేశవాళీ వంగడాల్లో సద్గుణాలను తమలో ఇముడ్చుకున్న గ్రీన్ సూపర్ రైస్ వంగడాల రాకకు పూర్వరంగం ఇదే. తక్కువ వనరులతో 67 బస్తాల వరకు ధాన్యం దిగుబడినిచ్చే ఈ వంగడాలు ఇప్పుడిప్పుడే తెలుగు రైతు తలుపు తడుతున్నాయి.. వాతావరణ మార్పులను తట్టుకుంటూ.. తక్కువ వనరులతోనైనా అధిక దిగుబడినివ్వగల గ్రీన్ సూపర్ రైస్ వరి విత్తనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ని రైతుల చేతికి అందివచ్చాయి. చైనా శాస్త్రవేత్తలు, మనీల (ఫిలిప్పీన్స్)లోని అంత ర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఇరి) ఉమ్మడి గా సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా గ్రీన్ సూపర్ రైస్ వంగడాలు రూపొందించారు. సుమారు 250 దేశవాళీ వరి వంగడాల్లోని సద్గుణాలను పుణికిపుచ్చుకున్న ఏడు విశిష్ట వంగడాలను ప.గో. జిల్లా ఆచంటకు చెందిన ధాన్య పండిట్ బిరుదాంకితులు, అభ్యుదయ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు ఈ రబీలో తొలిసారిగా సాగు చేయడం సాగుబడి పాఠకులకు తెలిసిందే. ఈ 7 వంగడాలకు చెందిన 1,400 గ్రాముల విత్తనాలతో ట్రేలలో నారు పెంచి.. శ్రీ వరి పద్ధతిలో ఆరుతడులతో సాగు చేసి ఆయన 20 క్వింటాళ్ల వరకు విత్తనాలను ఉత్పత్తి చేశారు. ఈ వంగడాల్లో 4 చక్కని ఫలితాల నిచ్చాయని సుబ్బారావు తెలిపారు. సాధారణ వరి వంగడాలతో పోల్చితే 25% తక్కువ రసాయనిక ఎరువులతో, తక్కువ నీటితోనే మంచి దిగుబడి నిచ్చాయన్నారు. జడ్జీవై-1 విత్తనాలను తెలంగాణ, సీమలోని 10 జిల్లాల రైతులకు ఇస్తున్నానని చెప్పారు. అన్నదాతలూ ఆల్ ది బెస్ట్! - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ అంతిమ తీర్పరి రైతే! జీరో ఫెర్టిలైజర్ వంగడం చక్కగా 30 బస్తాలు పండింది. జెడ్‌జీవై-1 అత్యధి కంగా 67 బస్తాల దిగుబడి నిచ్చింది. నా నుంచి విత్తనాలు తీసుకున్న 200 మంది రైతుల జాబితాను మనీలా పంపిస్తా. ఈ ఖరీఫ్‌లో 2 కిలోల విత్తనాలతో రబీలో 18 ఎకరాలకు విత్తనాలు తయారు చేసుకోవచ్చు. ఏ విత్తనానికైనా అంతిమ తీర్పరి రైతే. - నెక్కంటి సుబ్బారావు (94912 54567), రైతు శాస్త్రవేత్త, ఆచంట -
2015 తెస్తోంది..‘గ్రీన్’ వరి విప్లవం!
చైనా- ఐఆర్ఆర్ఐ కృషితో అందుబాటులోకి రానున్న‘గ్రీన్ సూపర్ రైస్’ వంగడాలు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అక్కర్లేదు.. ఉప్పు నీరు సమస్యే కాదు.. కరువు కాలంలోనూ అధిక దిగుబడి! తగ్గనున్న సాగు వ్యయం.. పర్యావరణానికీ మేలు తెలుగునాట అధిక దిగుబడులిచ్చిన 8 ‘గ్రీన్’ వంగడాలు కొద్ది నెలల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 10 లక్షల హెక్టార్లకు విత్తనాలు అవును.. కొత్త సంవత్సరం వరి చేలల్లో బహుముఖ విప్లవమే తేబోతోంది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకపోయినా.. ఉప్పునీటి తాకిడి ఉన్నా.. అంతేకాదు, కరువు మేఘాలు కమ్ముకున్నా సరే.. చీడపీడలను తట్టుకొని.. ఇప్పుడున్న వంగడాల సగటు కన్నా ఎక్కువగా (ఎకరానికి 6 టన్నులకు పైగా) దిగుబడినిచ్చే వరి వంగడాలు రాబోతున్నాయట! ఇవేవో ‘జన్యుమార్పిడి’ వంగడాలేమోననుకునేరు.. సుమా! కాదు. చైనా, ఫిలిప్పీన్స్, భారత్‌లో ప్రభుత్వరంగ సంస్థలే అందిస్తున్న, తిరిగి వాడుకోదగిన విత్తనాలే కాబట్టి రైతులకు భారం కాబోవు. వందలాది దేశవాళీ వంగడాల్లోని సద్గుణాలను నూటికి నూరుపాళ్లూ పుణికి పుచ్చుకున్న వంగడాలివి! అందుకే వీటిని ‘గ్రీన్ సూపర్ రైస్’ అని పిలుస్తున్నారు! ఇదేదో అందమైన ఊహ కాదండోయ్.. ముమ్మాటికీ నిజం. అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరం జరుపుకుంటున్న 2015లో ప్రధాన ఆహార పంటైన వరి సాగును గుణాత్మక మలుపు తిప్పగల గ్రీన్ వంగడాలు అందుబాటులోకి వస్తుండడం సంతోషదాయకం. అది ఫిలిప్పీన్స్ దేశం. బొహొల్ ప్రాంతంలో ఒక వరి పొలం. ఉప్పు నీరు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ పొలంలో రైతు ధైర్యంగా వరి నాటేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఎడాపెడా వర్షాలు కురిశాయి.. పంట పొట్ట దశకు పెరిగేటప్పటికి నీటి కొరత వచ్చిపడింది. పొలం బీటలు వారింది. కడదాకా చుక్క నీరు అందలేదు... అయినా ఆ పొలంలో హెక్టారుకు 3,300 కిలోల ధాన్యం పండింది! ఈ నాటకీయమైన దిగుబడి ఎలా సాధ్యమైన్నట్లు? ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా అయితే కిలో ధాన్యం కూడా చేతికి రాదు. కానీ, ‘గ్రీన్ సూపర్ రైస్’ ప్రాజెక్టులో భాగంగా రూపొందించిన ప్రత్యేక వంగడాన్ని సాగు చేయడం వల్లనే ఈ అద్భుతం సాధ్యమైందని డాక్టర్ జాహర్ ఆలి ఇటీవల చెప్పారు. ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఆయన పనిచేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడితేనే అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను ఇప్పుడు సాగు చేస్తున్నందున భూములు నిస్సారమవుతున్నాయి. నదులు, సముద్రాలు కలుషితమై మత్స్య సంపద మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ సమస్య పరిష్కారానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల్లేకుండా చక్కని దిగుబడులనిచ్చే ఈ వంగడాల వల్ల రైతులకు ఖర్చు తగ్గడమే కాకుండా భూమి, నీరు, పర్యావరణ కాలుష్యం బాగా తగ్గనుంది. ఇదీ గ్రీన్ సూపర్ రైస్ సంగతి.. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో వరి సాగును కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం ‘గ్రీన్ సూపర్ రైస్’(జీఎస్ఆర్) విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని 1998లో చేపట్టారు. చైనా అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్, ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రపంచ దేశాల నుంచి సేకరించిన 250 దేశవాళీ వరి వంగడాలు, హైబ్రిడ్లలోని మేలైన లక్షణాలను (ఇంట్రికేట్ క్రాస్‌బ్రీడింగ్, బాక్ క్రాస్‌బ్రీడింగ్ పద్ధతుల ద్వారా) ఒడిసిపట్టి కొన్ని ‘గ్రీన్’ వంగడాలను దేశ విదేశీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తొలి దశలో 16 దేశాల్లో, మలి దశలో మరో 16 దేశాల్లో ‘గ్రీన్’ వంగడాల రూపకల్పన, ప్రయోగాత్మక సాగు చేపట్టారు. రెండో దశ ఇప్పుడు ముగింపు దశలో ఉంది. ఈ వంగడాలను వివిధ దేశాల్లో వీటిని పండించి చూశారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా.. ఉప్పు నీరున్నభూముల్లో.. బెట్ట పరిస్థితుల్లో.. చీడపీడలను తట్టుకొని సగటు దిగుబడులకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే విధంగా ‘గ్రీన్’ వంగడాలను రూపొందించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజల రుచి, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉండే వంగడాలను రూపొందించామని డా. ఆలి వివరించారు. సాధారణ వరి వంగడాలు అసలు మనుగడ సాగించలేని పరిస్థితుల్లోనూ సగటుకన్నా అధిక దిగుబడినివ్వడం ‘గ్రీన్’ వంగడాల ప్రత్యేకత. వియత్నాంలో 25 వేల హెక్టార్లు, ఫిలిప్పీన్స్‌లో 5,700 హెక్టార్లలో వీటిని అనేక సీజన్ల పాటు సాగు చేయించారు. ఫిలిప్పీన్స్‌లో ఎకరానికి 6 టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రావచ్చని ఆశిస్తున్నామన్నారు. ఇలా ఉండగా, గ్రీన్ వంగడాల వార్త తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని పశ్చిమబెంగాల్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త, దేశీ వరి విత్తనాల సంరక్షకుడు డా. అనుపమ్ పాల్ పెదవి విరిచారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతోపాటు సేంద్రియ ఎరువులూ లేకుండానే హెక్టారుకు 5-6 టన్నుల దిగుబడినిచ్చే దేశీ వరి వంగడాలు పూర్వం నుంచే మన దగ్గరున్నాయని, విస్మరణకు గురయ్యాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా అనేక వంగడాల్లో సద్గుణాలతో కూడిన గ్రీన్ వంగడాల రాక కచ్చితంగా శుభపరిణామమే కదా..! - పంతంగి రాంబాబు అధిక దిగుబడులిచ్చిన 8 ‘గ్రీన్’ వంగడాలు! జీఎస్ఆర్ మలి దశ పరిశోధనల్లో హైదరాబాద్(రాజేంద్రనగర్)లోని డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కూడా పాలు పంచుకుందని ప్రాజెక్టు డెరైక్టర్(ఎ) వీ రవీంద్రబాబు ‘సాక్షి’కి వెల్లడించారు. 2011లో కొన్ని ‘గ్రీన్’ వంగడాలను స్వల్ప మోతాదులో రసాయనిక ఎరువులు వాడి అనేక చోట్ల పండించగా.. వాడుకలో ఉన్న వంగడాల కన్నా 11 ‘గ్రీన్’ వంగడాలు అధిక దిగుబడినిచ్చాయన్నారు. నత్రజని, ఫాస్ఫరస్ నిల్వలు తక్కువగా ఉన్న భూముల్లోనూ దిగుబడి బాగుందన్నారు. వీటిలో నుంచి మేలైన 8 వంగడాలను ఎంపికచేసి మళ్లీ పండిస్తున్నామన్నారు. చౌడు, క్షార గుణం కలిగిన భూముల్లోనూ ఒక వంగడం సాగవుతోందని డా రవీంద్రబాబు తెలిపారు. ఈ వంగడాలు 2015 ఏప్రిల్ నాటికి సిద్ధమవుతాయన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి గ్రీన్ వంగడాలు మన రైతులకూ అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.