breaking news
Green hunt
-
ఖనిజసంపదను దోచుకునేందుకే గ్రీన్‌హంట్
పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య, సాధినేని సాక్షి, కొత్తగూడెం: అడవితల్లిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసీలకు కల్లా కపటం తెలియదని, కానీ వారి హక్కులను కాలరాయాలని చూస్తే, ఆ హక్కులను కాపాడుకోవడానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడతారని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సంత గ్రౌండ్లో గురువారం జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పోడు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం గిరిజనులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. అడవుల నుంచి వారిని బయటకు పంపించి, ఖనిజసంపదను దోచుకునేందుకే గ్రీన్‌హంట్ పేరుతో దాడులకు దిగుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని లక్షల ఎకరాల భూములను బడాబాబులకు, కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసీలను అటవీ భూముల్లో నుంచి తరిమివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు, గిరిజనులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారని, వారి సమస్యలు పట్టవు కానీ, వారి భూములు మాత్రం కావాలా అని ప్రభుత్వాలను ప్రశ్నించారు. ఖనిజసంపదను దోచుకెళ్లడానికి ఆదివాసీలు అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో, వారికి అండగా నిలబడుతున్న నాయకులను ఎన్కౌంటర్ పేరుతో చంపుతున్నారని అన్నారు. కొత్తగూడెంలోని పునుకుడు చెలకలో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసి విమానాల ద్వారా అక్కడి ఖనిజ సంపదను దోచుకెళ్లాడానికి, బహుళజాతి కంపెనీలను తీసుకరావడానికి జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంటకటేశ్వరరావు మాట్లాడుతూ అడవులను నాశనం చేసేది గిరిజనులు కాదని, ప్రభుత్వాలేనని అన్నారు. పోడు చేసుకుంటున్న గిరిజనులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తొలుత అరుణోదయ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటలతో అందరినీ అలరించారు. సభలో ఎన్డీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్తార్‌పాషా, ఇప్టూ జిల్లా కార్యదర్శి ఎల్.విశ్వనాధం, జిల్లా నాయకులు సత్యం, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు కోలేటి నాగేశ్వరరావు, ఇప్టూ జాతీయ కమిటీ సభ్యులు రాసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
సహజ వనరులు దోచిపెట్టేందుకే మారణకాండ
జంగారెడ్డిగూడెం : గ్రీన్‌హంట్ పేరుతో ప్రభుత్వాలు దండకారణ్య ప్రాంతంలో ఉద్యమకారులను, ఆదివాసీలను దారుణగా కాల్చి చంపుతున్నాయని ఏపీ సీఎల్సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు సహజ వనరులు కట్టబెట్టేందుకు ఈ మారణకాండ కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యహింసను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా ప్రాంతాల్లో పౌరులను, ఆదివాసీలను, నక్సల్స్‌ను కాల్చి చంపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. నక్సల్స్ సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య అని ఈ సమస్య పరిష్కారానికి ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేయడం సమంజసంకాదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేశాయన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య పరిష్కారానికి తుపాకీతో సమాధానం చెప్పాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎ¯ŒSకౌంటర్ నిలుపుదల చేసి సహజ వనరుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. శాంతియుత సమాజం కోసం ఎన్కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత సమాజం భారతీయ సమాజంలో సాధ్యం కాదని పేర్కొన్నారు. కెన్యా తదితర చిన్నదేశాల్లో ఈ విధానం అమలు చేయడం వల్ల ద్రవ్యోల్భణం పెరిగి ఆయా దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని గుర్తుచేశారు. -
గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలి: వరవరరావు
హైదరాబాద్: ఆదివాసీలను మట్టుపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన 3వ దశ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేయాలని విరసం నేత వరవరరావు అన్నారు. ఆదివాసీ, దళిత, మహిళ, మైనార్టీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, పోలీస్, పారామిలటరీ జరుపుతున్న హత్యాకాండలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన వరంగల్ పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఎదురుగా ఇస్లామియా కాలేజీ వరకు ర్యాలీ, అనంతరం బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభ పోస్టర్‌ను స్వాతంత్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్తా, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరితో కలసి గురువారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ దోపిడీకి పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారని వారికి పాలకులు అండగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఆదివాసీ సమాజాన్ని మ్యూజియం వస్తువుగా మార్చారని భారతదేశంలో కూడా చేసేందుకు యత్నిస్తున్నా వామపక్షాలు వారికి పూర్తిగా అండగా ఉండడంవల్ల సాధ్యం కావడంలేదని అన్నారు. -
వాక్ స్వాతంత్య్రానికి ‘చంద్ర’గ్రహణం
మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదన్నారు. సరిగ్గా వారానికి హక్కుల గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదని తిరుపతి సభను అడ్డుకున్నారు. రాజ్యహింస, నిర్బంధం గత పాలనకన్నా అధికంగా ఉండబోతున్నాయనడానికి ఇదొక నిదర్శనం. పరస్పరం మాటల కత్తులు దూసుకునే రెండు రాష్ట్రాల చంద్రు లిద్దరూ కలిసి ప్రత్యామ్నాయ గొంతును నొక్కేశారు. ప్రత్యా మ్నాయ రాజకీయ వేదిక తలపెట్టిన సభను అడ్డుకొని హైదరా బాద్ నడిబొడ్డున భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. రెండు రాష్ట్రాల్లోనూ అర్ధరాత్రి, తెల్లవారు జామున ప్రయాణిస్తు న్న వారిని దారి కాచి అడ్డుకొని సభా సమ యం అయిపోయేదాకా నిర్బంధించారు. హైదరాబాద్ సభ ప్రత్యామ్నాయ రాజకీ యాలుగా ముందుకొచ్చిన నక్సలైట్ రాజకీ యాల గురించి మాట్లాడాలనుకుంది. మావోయిస్టు ఎజెండా అమలుచేస్తానన్న కేసీఆర్ అది మావోయిస్టుల సభ అని చెప్పి బలప్రయోగంతో అడ్డుకున్నాడు. మావోయిస్టు ఎజెండా అమ లుచేస్తానన్న ముఖ్యమంత్రి ఆ ఎజెండా ఏమిటో చర్చించే సభను జరగనివ్వాల్సింది కదా అన్న వాళ్లకు సమాధానంగా.. మేము అమలు చేస్తున్నది మావోయిస్టు ఎజెండానే, సభను మాత్రం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఆడ్డుకోవాల్సివచ్చిం దని ఒక తెలంగాణ మంత్రి గడుసుగా జవాబిచ్చారు. పోరాడి సాధించిన స్వయం పాలనలో ఉద్యమ విలువలూ, ఫెడరల్ స్ఫూర్తి తొందరగానే మారిపోయాయి. స్పీడ్ యుగం కదా, మార్పులూ వేగవంతమయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆశించేది పెద్దగా ఏమీ ఉండదు. సరిగ్గా వారానికి హక్కుల గురించి కూడా మాట్లాడటానికి వీల్లేదని పోలీసులు తిరుపతి సభను అడ్డుకున్నారు. తిరుపతి సభ మాట్లాడాలనుకున్నది ప్రత్యామ్నాయ రాజకీయాల గురిం చి కాదు. రాజ్యాంగం గురించి. ఆ రాజ్యాంగం ద్వారా భారత ప్రజలు తమకు తాము దఖలు పరచుకున్న హక్కుల గురించి. నిర్దిష్టంగా ఇప్పటి పరిస్థితిలో రాజ్యాంగ విరుద్ధమైన ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి మాట్లాడాలనుకున్నది. అది గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసులను చంపటం అన్యాయం అనబోయింది. ప్రజాసంఘాలు, మేధావులు కలిసి ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతి రేక కమిటీగా ఏర్పడి సదస్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో బీడీ శర్మ, బొజ్జా తారకం, చుక్కా రామయ్య, ఘంటా చక్రపాణి, ఊసా వంటి భిన్న రాజకీయ విశ్వాసాలున్న మేధావులు పాల్గొ న్నారు. వీరంతా భారత ప్రభుత్వం సొంత ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తున్నారు. తిరుపతి సభలోనూ పౌర హక్కుల సంఘంతోపాటు ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే, వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు డా॥విజయ్ కుమార్ వంటి వాళ్లు వక్తలుగా ఉన్నారు. అయినా అది మావోయిస్టుల సభ అని, వాళ్లకు మీరు హాలు ఎట్లిస్తారని పోలీసులు సభా వేదిక కోసం హాలు అద్దెకిచ్చిన వారిపై కేకలేశారు. నిజానికి హైదరాబాద్ సభ భగ్నం చేసిన తర్వాత కూడా సభ జరుగుతుందా లేదా అని ఏ మాత్రం సంశయం లేకుండా ముందు అనుకున్న తేదీకే నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవడానికి కారణం ఇది ఏ రాజ కీయాల గురించీ మాట్లాడాలనుకున్న సభ కాకపోవడమే. అదే విషయం పోలీసులతో చెబితే అంతా ఒకటేలెండి, మాకు పై నుండి ఆదేశాలున్నాయి అన్నారట. ప్రశ్నలంటే చంద్రబాబుకు గిట్టవు. ప్రశ్నించే వారిపై తోడే ళ్లను, పులులను ఉసిగొలిపే చరిత్ర ఆయనది. సభకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసుల తదుపరి దౌర్జన్యం తిరుపతి ప్రజా సంఘాల వాళ్లకు తెలుసు గనక సభను రద్దు చేసుకుంటున్న ట్లుగా ప్రకటించారు. నాతో సహా బయటి ప్రాంతాల నుంచి వచ్చే వక్తలకు ప్రయాణం మానుకొమ్మని చెప్పారు. అయినా అనంతపురంలో ప్రొఫెసర్ శేషయ్యను, విజయ్, హరినాథ్‌లను గృహనిర్బంధం చేశారు. తిరుపతి సభ గురించే తెలియని విర సం కవి అరసవెల్లి కృష్ణను ముందురోజు సాయంకాలం నుండే నిర్బంధించారు. ఆయనను ఎందుకు అరెస్టు చేశారని అడిగిన పౌర హక్కుల సంఘం ఆంజనేయులుని ఇంటికెళ్లి అరెస్టు చేశా రు. బాబు హయాంలో రాజ్యహింస, నిర్బంధం గత పాలన కన్నా అధికంగా ఉండబోతున్నాయని నిరూపణ అయింది. ఎవరైనా తిరుపతి సభను భగ్నం చేయడం వెనక అలిపిరి తీర్పును కలిపి చూడవచ్చు. అయితే సరిగ్గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో హక్కులను హరించే సంఘటనలు జరుగుతున్నప్పుడే ఆదివారం వడోదరలో మతకలహాలు మొదలయ్యాయి. కానీ మీడియాను మేనేజ్ చేయవచ్చుననుకున్నారేమో.. అక్కడ ఇంట ర్నెట్ కనెక్షన్లు నిలిపివేశారు. ఇద్దరిదీ ఒకే సంస్కృతి. ఒకే సామ్రా జ్యవాద మార్కెట్ చక్రాలపై నడుస్తున్న ప్రభుత్వాలు భిన్న రాజ కీయాభిప్రాయాల్ని సహించే పరిస్థితి ఉండదు. జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్యానికి హెచ్చరికల వంటివి. భిన్న రాజకీయ విశ్వాసాలున్న వారు, దేశంలో భిన్నత్వాన్ని పరిరక్షిం చడానికి, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడానికి ఐక్యం కావాల్సిన సమయం ముంచుకొచ్చింది. (వ్యాసకర్త విరసం నాయకురాలు) - వరలక్ష్మి -
గ్రీన్‌హంట్‌లో 200 మంది ఉద్యమకారులు బలి
మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన చింతూరు: మావోయిస్టులతోపాటు క్రాంతికారీ ఆందోళనను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 200 మంది ఉద్యమకారులు అమరులయ్యారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ దక్షిణ రీజినల్ కమిటీ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో ఈ మేరకు కరపత్రాలను విడుదల చేసింది. కాగా, సోమవారం నుంచి ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రాష్ర్టంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతిచెందగా ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. -
‘గ్రీన్‌హంట్’ పేరుతో గిరిజనులపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరుతో గిరిజనులపై యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బొజ్జా తారకం ధ్వజమెత్తారు. అడవుల్లోని సైనిక బలగాలను తక్షణమే నియంత్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేత చిలకా చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తారకం ముఖ్యవక్తగా ప్రసంగించారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని సైనిక శిబిరాలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ప్రగతిశీల మహిళాసంఘం నాయకురాలు సంధ్య, టీఎస్ జాక్ నేత కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విభజనతో వెసులుబాటు!
విశ్లేషణ: ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు. మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్‌కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబడులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉంది. కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల సమ స్య తిరిగి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య తిరిగి మొదటికి వస్తుందని పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి భయా లు నిరాధారమైనవని తెలంగాణవాదులు కొట్టిపారేస్తున్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండానే అందరూ అంగీకరించే వాస్తవం ఒకటుంది. దేశవ్యాప్తంగా అసంతృప్తి, ఆందోళనల వ్యాప్తికి అనువైన పరిస్థితులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆ కారణంగానే మావోయిస్టులు కేరళ నుంచి ఈశాన్యం, జమ్మూ-కాశ్మీర్ వరకు విస్తరించగలిగారు. 21 రాష్ట్రాల్లో 18 రాష్ట్ర కమిటీలతో ఆ పార్టీ పనిచేస్తోంది. దండకారణ్యంగా పిలిచే మధ్య భారతంలో కేంద్ర బలగాలు చేపట్టిన ‘గ్రీన్‌హంట్’ ఆశించిన ఫలితాలిస్తున్న దాఖలాలులేవు. పైగా ఆర్థికవ్యవస్థ ఇప్పట్లో మాంద్య పరి స్థితుల నుంచి బయటపడే సూచనలు లేవు. గ్రామీణ, పట్టణ నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది. పెరిగే ధరలకు తోడు, సంక్షేమ వ్యయాల, సబ్సిడీల కోతలు సామాన్యులలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధం గా అమలైన సంక్షేమ పథకాలను అటకెక్కించారు. దీంతో మన రాష్ట్ర ప్రజానీకంలో అసంతృప్తి ప్రబలుతున్నది. ఈ పరిస్థితుల నేపథ్యం నుంచి చూస్తే రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు ఉద్యమం పుంజుకునే అవకాశాలే హెచ్చుగా ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతల ప్రతిష్టకు సవాలు పార్టీ యూనిటీ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన నక్సలైట్ పార్టీలు విలీనమైనా నేటికీ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ నేతలదే. మల్లోజుల కోటేశ్వరరావు, చెరుకూరి రాజ్‌కుమార్‌లు మరణించినా అత్యున్నతస్థాయి పొలిట్‌బ్యూరోలోని ఏడుగురిలో ఐదుగురు ఏపీకి చెందినవారే. వారిలో నలుగురు తెలంగాణకు చెందినవారు. స్వరాష్ట్రంలో ఉద్యమం దెబ్బ తినడంతో ఏపీ అగ్రనాయకత్వం ఇతర రాష్ట్రాల్లో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సివస్తోంది. ఒడిశా మాజీ మావోయిస్టు నేత సవ్యసాచి పాండా ‘తెలుగువారి ఆధిపత్యమే’ తన తిరుగుబాటుకు కారణమని చెప్పడం గమనార్హం. ‘ఉద్యమ ప్రాంతాలకు నాయకత్వం’ అన్నది ఏపీ నేతలే తెచ్చిన నిర్మాణ సూత్రం. ఏపీ నేతల ప్రతిష్ట మసకబారడానికి అదే కారణమవుతోంది. కాబట్టి ఏపీలో ఉద్యమ పునర్నిర్మాణం వారికి తక్షణావసరం. ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకోక మావోయిస్టులు గుడ్డిగా పాత పంథానే కొనసాగిస్తుం డటంవల్లనే ఉద్యమ పునర్నిర్మాణం కావడం లేదనేది వాస్తవం కాదు. 2001 నాటికే ఉత్తర తెలంగాణలో 1980 నుంచి 1990ల చివరి వరకు జరిగిన మార్పులపై ఆ పార్టీ లోతైన అధ్యయనాన్ని నిర్వహించింది. ఆ పార్టీ తొమ్మిదవ (యూనిటీ) కాంగ్రెస్ (2004) ఆమోదించిన ‘వ్యూహం-ఎత్తుగడలు’, దానిపై ఆధారపడి రూపొందిన ‘పట్టణ ప్రాంతాలలోని పని’ (అర్బన్ పర్స్పెక్టివ్ 2007) అనే డాక్యుమెంట్లలో ఆ నూతన అవగాహన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దేశ ‘ఆర్థిక కేంద్రం గ్రామీణ ప్రాంతాల నుం చి పట్టణ ప్రాంతాలకు మారింద’ని అవి పేర్కొనడం విశేషం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మారిన పరిస్థితులకు తగిన ఎత్తుగడలను, పని పద్ధతులను ఆ డాక్యుమెం ట్లు సూచించాయి. రాష్ట్రంలో తిరిగి పాగా వేయడానికి అవసరమైన సైద్ధాంతిక కసరత్తును పూర్తి చేసిన మావోయిస్టులు రాష్ట్ర విభజనవల్ల ఏర్పడే ‘తాత్కాలిక వెసులుబాటు’ను ఉపయోగించుకోడానికి సకల శక్తులను ఒడ్డుతారనడంలో సందేహం లేదు. తెలంగాణలో పాగా ఖాయం దక్షిణాదిలో ఉద్యమ పునరుద్ధరణకు ఆ పార్టీ పకడ్బందీగా అమలుచేస్తున్న పథకం వివరాలు 2011, డిసెంబర్ 8న నాటి హోంశాఖ స్టేట్ మంత్రి జితేందర్‌సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనలో ఉన్నాయి. కేరళ వైనాడ్ జిల్లా నుంచి కర్ణాటకలోని మైసూర్ జిల్లాల వరకు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు విస్తరించారు. సాయుధ గె రిల్లా దళాలు ఆ అడవుల్లో పనిచేస్తున్నాయి. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని నీలంబూర్-గిడలూల్ అటవీ ప్రాంతంలో కూడా దళాలు పనిచేస్తున్నాయి. మరోవంక తెలంగాణకు, ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని నాగపూర్, వార్ధా, భండారా, యవత్మాల్ జిల్లాలకు వారి ఉద్యమం విస్తరి స్తోంది. ఒకప్పుడు రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల్లో ఉద్యమ వ్యాప్తికి తోడ్పడితే, నేడు మావోయిస్టులు పొరుగు రాష్ట్రాలను చుట్టుముట్టి రాష్ట్రంలో ఉద్యమాన్ని పునర్నిర్మించే వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. కొత్త రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు, యంత్రాంగాల ఏర్పాటుకు, అవి నిలదొక్కుకొని స్థిరపడటానికి కనీసం రెండు మూడేళ్లయినా పడుతుంది. మావోయిస్టులు (ఒకప్పటి కొండపల్లి వర్గం నక్సలైట్లు) 1969 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజా పునాదిని సమకూర్చే సాధనంగా చూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా నక్సలైట్ల ప్రాబల్యం పైకి కనబడిన దానికంటే ఎక్కువే. రాష్ట్ర విభజన తదుపరి ఏర్పడే రెండు ప్రభుత్వాలకు వెంటనే నక్సలైట్లపై దృష్టిని కేంద్రీకరించడం సాధ్యం కాదు. మావోయిస్టు శాంతి భద్రతల సమస్యను, హింసాత్మక ఘటనలను అవి కోరుకోవు. కాబట్టి నక్సలైట్ల విషయంలో అవి తాత్కాలికంగానే అయినా ఉదారవైఖరిని చూపకతప్పదు. మావోయిస్టులు ఆ అపూర్వ అవకాశం వదులుకోకపో వచ్చు. గోదావరికి ఆవలి దండకారణ్యాన్ని (ఛత్తీస్‌గఢ్) కేంద్రంగా చేసుకొని జినుగు నర్సింహారెడ్డి, పుల్లెల ప్రసాదరావు వంటి అగ్రనేతల నేతృత్వంలో వివిధ జిల్లా కమిటీలు తెలంగాణతో సజీవ సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, మంగి ఏరియా కమిటీలు, ఖమ్మం జిల్లాలో వెంకటాపూర్, శబరి ఏరియా కమిటీలు గుట్టుగా పనిచేస్తున్నాయి. విభజన వల్ల కలిగే ‘తాత్కాలిక వెసులుబాటు’ మూలంగా మావోయిస్టులకు ఒకప్పడు పెట్టని కోటలైన ఖమ్మం, వరంగ ల్, కరీంనగర్ జిల్లాల్లో వారు తిరిగి పాగా వేయడం తథ్యమని సీని యర్ పోలీసు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సరిహద్దులలో మావోయిస్టుల దాడుగుమూతలు కేంద్ర హోంశాఖ నేతృత్వంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా కేంద్ర బలగాల ‘గ్రీన్‌హంట్’ సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా 50 వేలకుపైగా కేంద్ర బలగాలు రంగంలో ఉన్నా, మావోయిస్టులపై పైచేయి సాధించలేకపోతున్నాయి. కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపించి, భిన్న నాయకత్వ కేంద్రాలుగా మారినస్థితే ఇందుకు కారణం. ఏపీలో నక్సలైట్ల ఆటకట్టిం చడంలో కీలకపాత్ర వహించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఇన్ఫార్మర్ల నెట్‌వర్క్‌ను నిర్మించడంలో రాష్ట్రాల నుంచి సహకారం అందడంలేదని కేంద్ర హోంశాఖ ఆరోపిస్తోం ది. కేంద్ర కమాండ్, స్థానిక బలగాలను చిన్నచూపు చూస్తోందని రాష్ట్రాలు వాపోతున్నాయి. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీకి చెందినవి కాకపోవడం కూడా సమస్యగా మారుతోంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖం డ్, ఒడిశాలలో పలు సందర్భాలలో అధికార పార్టీలు స్వీయప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పరిస్థితులను అందిపుచ్చుకుని మావోయిస్టులు కేంద్ర బలగాలపై భారీ దాడులను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మధ్యా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్యా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌ల మధ్యా మావోయిస్టులు భద్రతాబలగాలతో దాగుడుమూతలు ఆడుతున్నారు. అటు సన్నాహాలు జరిపి, ఇటు దాడులు చేస్తున్నారు. ఇటు దాడి చేసి, అటు రక్షణ పొందుతున్నారు. ఒడిశా పోలీసులతో సమన్వయ లోపం కారణంగానే 33 మంది ఏపీ గ్రేహౌండ్స్ పోలీసులు 2008లో బలిమెల వద్ద బలైపోయారు. ఖమ్మం జిల్లా పూవర్తి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతి చెందిన ఎస్ఐ ప్రసాద్‌బాబు మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రాంతం నుంచి తరలించడానికి మూడు రోజులు పట్టింది. అదికూడా హక్కులనేతల సహాయంతో. కేంద్ర హోంశాఖ ఈ మూడు మావోయిస్టు తిరుగుబాటు సరిహద్దు ప్రాంతాలను ‘త్రికోణం’గా అభివర్ణించింది. రాష్ట్ర విభజన ఆ త్రికోణానికి నాలుగో కోణాన్ని చేర్చి చతురస్రంగా మారుస్తుంది. నల్లమల ఉద్యమ పునరుజ్జీవం... ‘నాలుగో కోణం’ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 7 జిల్లాలకు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో సరి హద్దు ఉంది. మెదక్‌తో కలిపి ఆ నాలుగు జిల్లాలు దక్షిణ తెలంగాణ ప్రాంతీయకమిటీ కింద బలమైన ఉద్యమ కేంద్రాలు. అప్పట్లో కృష్ణానది మీదుగా మావోయిస్టులు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోకి యథేచ్ఛగా రాకపోకలు సాగించేవారు. ఆ నాలుగు జిల్లాల్లో విస్తరించిన నల్లమల మావోయిస్టులకు పెట్టనికోట. కొల్లాపూర్, పెద కొత్తపల్లి, లింగాల, అమ్రాబాద్ మండలాలు నక్సలైట్లకు అప్పట్లో మంచి పట్టున్న ప్రాంతాలు. కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, మొలచింతపల్లి, ఎర్రగట్టు బొల్లారం ప్రాంతాల్లో కృష్ణ దాటితే కర్నూలు జిల్లా కొత్తపల్లి మం డలం సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, కపిలేశ్వరం, బలపాలదిబ్బ అటవీ ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొల్లాపుర్-సోమశిల మధ్యనే ఐపీఎస్ అధికారి పరదేశీనాయుడును మావోయిస్టులు హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే రంగదాస్ను కాల్చిచంపారు. లింగాల, అప్పాయిపల్లి, అప్పాపూర్ పెంట, చెన్నంపల్లి గ్రామాలను ఆధారం చేసుకొని పుట్టీలలో నదిని దాటి కర్నూలు జిల్లా శ్రీశైలం, ఆత్మకూరు మండలాల్లో దాడులు చేసి తిరిగి రావచ్చు. అమ్రాబాద్ నదీ పరివాహక ప్రాంతం నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలలోకి చొరబడటం అతి సులువు. అమ్రాబాద్‌లో గతంలో మావోయిస్టులు చాలా దాడులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కాల్చిచంపారు. అప్పట్లో కృష్ణపట్టీ దళం ఇటు నల్లగొండ, అటు గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయింది. చందంపేట, పెద అడిచర్లపల్లి మండలాల నుంచి సులువుగా నది దాటి గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం, వెల్దుర్తి, మాచర్ల అటవీ ప్రాంతాలకు చేరవచ్చు. ఒకప్పుడు మేళ్లచెరువు, చందంపేట మండలాల్లో మావోయిస్టులు చురుగ్గా పనిచేశారు. ఆ మండలాల నుంచి దాచేపల్లి, మాచవరం చేరుకోవచ్చు. ఇక నాగార్జున సాగర్ జలాశయం మార్గంగా రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించవచ్చు. మావోయిస్టులు పలుమార్లు గ్రేహౌండ్స్ కూంబింగ్ల నుంచి పర్యాటకుల మరబోట్లలో నదిని దాటి తప్పించుకున్నారు. 2005లో నక్సలైట్లు నల్లగొండ జిల్లా నుంచి వెళ్లి గుం టూరు జిల్లా చిలకలూరిపేట పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. ఏపీ రాష్ట్ర కమిటీ కీలక నేతలేగాక, పత్రిక, ప్రెస్, తదిరత యంత్రాంగం నల్లమల నుంచే పనిచేసేవి. కృష్ణానది, నల్లమల ఆధారంగా మావోయిస్టులు కీలకమైన తెలంగాణ, సీమాంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మధ్య స్వేచ్ఛగా సంచరించగలుగుతారు. కాబట్టి రా్రష్ట విభజనతో మావోయిస్టులు తెలంగాణతోపాటూ సీమాం ధ్రలో కూడా విస్తరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు అధికారంలో ఉంటే పరి స్థితి మరింత జటిలం అవుతుంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ, ఒడిశా అటవీ ప్రాంతాలకు కలిపి ఏర్పడ్డ ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ (ఏవోబీ) ఏపీ పోలీసులకు కొరకరాని కొయ్యగా మిగిలింది. ఏ మాత్రం వెసులుబాటు కలిగినా ఏవోబీ నాయకత్వం ఉద్యమాన్ని విశాఖ మైదానాలకు, నగరానికి కూడా విస్తరింపజేస్తుంది. కోస్తా జిల్లాల్లోని మెట్టప్రాంతాల పరిస్థితి, సాగునీటి సదుపాయాలు లేని తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఏమంత మెరుగు కాదు. కాబట్టి నక్సలైటు ఉద్యమవ్యాప్తికి ఇవన్నీ అనువైన ప్రాంతాలే. ముసుగు సంస్థలు- పట్టణ ఉద్యమం 1990లలోనే నక్సలైట్లు ముసుగు సంస్థలను (కవర్ సం ఘాలు) నిర్మించడం ప్రారంభించారు. ఆర్ఎస్యూ, ఆర్‌వైఎల్, సికాస వంటి బహిరంగ ప్రజాసంఘాలకు భిన్నం గా ఎలాంటి సంబంధం లేనట్టు కనిపించే కవర్ ప్రజా సంఘాలను నిర్మించడంపై దృష్టిని కేంద్రీకరించాలని యూనిటీ కాంగ్రెస్ స్పష్టం చేసింది. మావోయిస్టులు ఇప్పుడు తమ ఉనికి బయటపడకుండానే ఉద్యమాలను నిర్మిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే కేవలం రెండు మూడేళ్ల వెసులుబాటైనా మావోయిస్టులకు చాలు. పైగా మావోయిస్టులు పట్టణాలలో ఉద్యమ నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ‘ప్రజాయుద్ధానికి, విముక్తి ప్రాంతాల ఏర్పాటుకు అవసరమయ్యే వివిధ రకాల శక్తిసామర్థ్యాలను కలిగిన క్యాడర్లను, నాయకులను అందించే ప్రధాన వనరు పట్టణ ప్రాంతాలే’. (అర్బన్ పర్స్పెక్టివ్). పట్టణ ప్రాంతాలకు తగిన నాయకత్వాన్ని, క్యాడర్లను పంపి, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యక్రమంతో పనిచేయాలని 2004 రాజకీయ నిర్మాణ నివేదిక నిర్దేశిం చింది. ముంబై, పూణె, ఢిల్లీలలో మావోయిస్టుల ప్రాబ ల్యం విస్తరిస్తోందని జాతీయ మీడియా చెబుతోంది. గత ఏడాది మారుతీ సుజుకీ మానేసర్ కర్మాగారం కార్మిక సమ్మె, సీనియర్ ఎగ్జిక్యూటివ్ హత్యల వెనుక వారి హస్తం ఉన్నదని భావించారు. 1990ల మొదట్లో హైదరాబాద్‌లోని శివారు కార్మిక వాడలన్నిటిలోనూ నక్సలైట్లు మంచి పట్టు సాధించారు. నాటి పారిశ్రామిక అశాంతి మూలంగా పలు పారిశ్రామిక సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. నేడు మావోయిస్టులు ‘గోల్డెన్ కారిడార్’లపై దృష్టిని కేంద్రీకరించారు. పూణె నుంచి ముంబై, సూరత్, వడోదరాలకు అటు నుంచి అహ్మదాబాద్‌కు విస్తరించిన పారిశ్రామిక కారి డార్లో ఉన్న ‘ఖాళీలను’ భర్తీ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించిన మరో పారిశ్రామిక కారిడార్‌పైన కూడా కేంద్రీకరించారు. చెన్నై, హైదరాబాద్, విశాఖ పారిశ్రామిక కేంద్రాలతో మరో విప్లవ పారిశ్రామిక కారిడార్ కోసం ప్రత్యేక నాయకత్వాన్ని కేటాయించారు. స్వల్పకాలిక ఫలి తాలను ఆశించకుండా నిర్మితమవుతున్న ఈ పట్టణ ఉద్యమ బలాన్ని అంచనా వేయడం కష్టమని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్’ నిపుణులు అంటున్నారు. మూడేళ్ల క్రితం నేటి తెలంగాణ ఉద్య మం ప్రారంభమైనప్పటి నుంచి నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు హైదరాబాద్‌కు ముఖం చాటేస్తున్న సంగతి తెలిసిందే. నేటి రాష్ట్ర విభజన ప్రతిపాదన ఆ అనిశ్చితిని తొలగించకపోగా పొడిగిస్తుంది. దీనికి తోడు నక్సలైట్ల కారణంగా 1988-1992 మధ్య రాజధానిలో నెలకొన్న పారిశ్రామిక అశాంతి తిరిగి నెలకొంటే పెట్టుబ డులు రెండు రాష్ట్రాలకు దూరంగా జరిగే ప్రమాదం ఉం ది. రాష్ట్ర విభజన మావోయిస్టులు ఎదురుచూస్తున్న అనుకూల పరిస్థితులకు దారితీయడం అనివార్యం కావచ్చు. పైగా నక్సలైటు ఉద్యమం గత పదేళ్లలో గుణాత్మకంగా భిన్నమైన సాయుధశక్తిగా ఎదిగింది. పట్టణాలలో సుశిక్షితమైన సాయుధ ఆత్మరక్షణ దళాలను, యాక్షన్ టీంలను నిర్మించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో తిరిగి నక్సలైటు ఉద్యమం పుంజుకుంటే ఏపీ పోలీసులు కొత్త తరం మావోయిస్టులతో పోరాడవలసి ఉంటుంది. ‘‘మన రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పరిష్కారమైపోయిందనుకోవడం తప్పు. మేం ఆ పని ఎప్పటికీ చేయలేం. అసలా పని మాదికాదు. నక్సలైట్లవల్ల తలెత్తే శాంతిభద్రతల సమస్యను అదుపులోకి తేవడం మాత్రమే మా పని. శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సింది ప్రభుత్వమే. అందుకు బదులుగా ప్రభుత్వమే నక్సలై ట్లు తయారు కావడానికి కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సృష్టిస్తే మేం చేయగలిగేది ఏమీ ఉండదు, మళ్లీ కథ మొదటికే వస్తుంది’’ అంటూ ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వెలిబుచ్చారు. - చెవుల కృష్ణాంజనేయులు