breaking news
G.Ravi Babu
-
అటకెక్కిన అదనపు చక్కెర
తెనాలి : రంజాన్ పర్వదినం కానుకగా రాష్ట్రంలోని తెల్ల రేషను కార్డుదారులందరికీ ఈ నెలలో అరకిలో చొప్పున అదనంగా చక్కెర పంపిణీ చేస్తామని చెప్పిన రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు తూచ్ అంటోంది. ఈ ప్రకారం రేషను డీలర్లకు పౌరసరఫరాలశాఖ సంక్షిప్త సందేశాలను పంపింది. దీనితో ఈనెలలో మరో అరకిలో చక్కెర అదనంగా వస్తుందని భావించిన సాధారణ కార్డుదారులకు నోరు చేదయినట్టే! భిన్న ప్రకటనలు.. సాధారణ కోటా కింద అరకిలో, రంజాన్ సందర్భంగా మరో అరకిలో కలిపి మొత్తం ఒక్కో కార్డుకు కిలో చొప్పున చక్కెర ఇవ్వనున్నట్టు పౌరసరఫరాలశాఖ డెరైక్టర్ జి.రవిబాబు గత నెల 24న ప్రకటించారు. ఈ చక్కెరను డీలర్లు విధిగా అందరూ కార్డుదారులకు జూలైలో ఇవ్వాలని, ఇతర పథకాలకు మళ్లించరాదని ఆయన స్పష్టంచేశారు. దీనితో బియ్యంతోపాటు అదనపు చక్కెరకు రేషను డీలర్లు డీడీలు తీయాలని అధికారులు హడావుడి మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గత నెల 27న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ముస్లిం కార్డుదారులకు రంజాన్ కానుకను ప్రకటించారు. అందుకనుగుణంగా పౌరసరఫరాల శాఖ ‘చంద్రన్న రంజాన్ తోఫా’ పేరుతో చౌకదుకాణాల ద్వారా ఒక్కో ముస్లిం కార్డుదారుకు అయిదు కిలోల గోధుమపిండి, రెండు కిలోల చక్కెర, ఒక కిలో సేమియా, వంద గ్రాముల నెయ్యి సహా ఉచితంగా అందించేందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఇప్పటికే కార్డుపై ఒక కిలో గోధుమపిండిని ఇస్తున్నచోట ఈ కానుక కింద మరో నాలుగు కిలోలు ఇస్తారని చెప్పినా, గోధుమపిండిని జిల్లాలో ఎక్కడా చౌకదుకాణాల్లో ఇవ్వటం లేదు. మొత్తం అయిదు కిలోలు ఇప్పుడు ఇవ్వాల్సివుంటుంది. నెలనెలా ఇస్తున్న అర కిలో చక్కెర కు మరో కిలోన్నర అదనంగా కలిపి మొత్తం రెండు కిలోలు ఇస్తారు. రాష్ట్రంలో 10-12 లక్షల ముస్లిం కార్డుదారులకు ఈ కానుక అందించనున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ తెల్లరేషను కార్డుదారులకు అదనంగా ఇస్తామన్న అరకిలో చక్కెర హామీ అటకెక్కించారు. సాధారణ కోటా కింద నెలనెలా అందిస్తున్నట్టే జూలై నెలకూ అరకిలో చొప్పున ఇవ్వాలని, అదనపు కోటా లేదని పౌరసరఫరాల అధికారులు చౌకడిపోల డీలర్లకు సంక్షిప్త సందేశాలు పంపారు. దీనితో ఈసారి ఇతర అదనపు చక్కెరకు కార్డుదారులు ఆశను వదిలేసుకున్నారు. ఉన్నతస్థాయిలో సమన్వయం లేనందునే కొన్ని కీలకమైన నిర్ణయాలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయనీ, ఫలితంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో గందరగోళానికి దారితీస్తోందనే అభిప్రాయానికి అదనపు చక్కెర వ్యవహారం బలం చేకూరుస్తోంది. -
ప్రజల జీవితాల్లో వెలుగు నింపే క్రిస్మస్
విజయవాడ, న్యూస్‌లైన్ : క్రైస్తవ భక్తిగీతాలు... నృత్య ప్రదర్శనలు... కొవ్వొత్తుల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు, సిటీ క్యాండిల్ లైట్ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. క్రైస్ట్ కల్వరీ టెలివిజన్ శాటిలైట్ చానల్-విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్వరాజ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. నృత్యరూపకాలను ప్రదర్శించారు. ఏసుక్రీస్తు జననం, జీవిత విశేషాలను వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. మేరీమాత, బాలఏసు, దేవదూతల వేషధారణలతో చిన్నారులు క్రీస్తు జీవిత విశేషాలను కళ్లకు కటినట్టు చూపించారు. వేదికపై విద్యుత్ దీపాలతో అలంకరిం చిన క్రిస్మస్ ట్రీని ఏర్పాటుచేశారు. వేలాదిగా హాజరైన భక్తులు కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కరుణామయుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తుల వెలుగుతో స్వరాజ్ మైదానం శోభాయమానంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పౌరసరఫాల శాఖ డెరైక్టర్, నగరపాలక సంస్థ మాజీ కమిషనర్ జి.రవిబాబు ‘క్రైస్ట్ కల్వరీ టెలివిజన్ శాటిలైట్ చానల్’ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవితంలో చీకటిని పారదోలి వెలుగులు నింపడమే క్రిస్మస్ సందేశమని అన్నారు. అనంతరం ఏఈ మిషన్ డెరైక్టర్ రెవరెండ్ డాక్టర్ లంకా కరుణాకర్‌దాస్ వాక్యోపదేశం చేశారు. క్రీస్తు బోధనలు, సందేశాలను నిరంతరం ప్రజలకు అందించేందుకే చానల్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. చానల్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని తెలి పారు. మనుషులను పాపముల నుంచి రక్షించేందుకే ఏస్తుక్రీస్తు మానవరూపంలో జన్మించాడని కొనియాడారు. క్రీస్తు జననంతో లోకానికి వెలుగు వచ్చిందన్నారు. దానికి సూచికగానే భారీ క్యాండిల్ ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పూనూరు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఏసుక్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. శాంతి, సహనం, క్షమాగుణం వంటి గొప్ప లక్షణాలను క్రీస్తు మానవాళికి బోధించారని తెలిపారు. ఆ గొప్ప లక్షణాలను మానవులు అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని వివరించారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, డీఎం అండ్ హెచ్‌వో సరసిజాక్షి, జి.స్టెల్లా రవి బాబు, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్పీ గ్రిటన్, క్రైస్తవ ప్రముఖులు కొడాలి ఏలియా, డేవిడ్ బెన్హామ్, డి.ప్రసాదరావు, పచ్చిగోళ్ల ఆనందరావు, పాలపర్తి జయకర్, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు పాల్గొన్నారు.