breaking news
gowden
-
హవ్వ... పరువు తీశారు!
రైతులనుంచి సేకరించిన ధాన్యం మరాడించి ఇవ్వాల్సిన మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యాన్నే అంటగడుతున్నారు. నాణ్యత లోపించినా... కిమ్మనకుండా క్వాలిటీసెల్ అధికారులు ఆమోద ముద్ర వేసేస్తున్నారు. ఇన్నాళ్లూ జిల్లాలో ఆ తరహా బియ్యానే పౌరసరఫరాల అధికారులు లబ్ధిదారులకు అందించారు. ఇక్కడ గోదాములు నిండిపోయేసరికి ఇతర జిల్లాలకు తరలించినపుడు అసలు బాగోతం బయట పడుతోంది. గతంలో విశాఖలో... తాజాగా ఒంగోలులో అధికారులు ఇక్కడి బియ్యాన్ని తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం జిల్లా అధికారుల పనితీరుపై ప్రభావం చూపుతోంది. సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్ల మధ్య లోపాయికారీ ఒప్పందాలతో పేదోడి బియ్యం పక్కదారి పడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లకు తరలిస్తున్న ధాన్యం మరాడించి ఇచ్చేందుకు ప్రభుత్వం తక్కువ మొత్తాన్ని అందజేస్తున్నా మిల్లర్ల అత్యుత్సాహానికి కారణం రీసైక్లింగేనని స్పష్టమవుతోంది. జిల్లాలోని కొందరు మిల్లర్ల నుంచి వస్తున్న రీసైక్లింగ్ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు ప్రతీ పౌరసరఫరాల గోదాములో బియ్యం తనిఖీ చేసే సాంకేతికాధికారులున్నారు. వారిలో కొందరు మిల్లర్లు ఇచ్చిన మొత్తాలకు అలవాటు పడి నాణ్యత బాగుందంటూ ధ్రువీకరించడంతో వీటిని గోదాములకు తరలిస్తున్నారు. ఇక్కడి గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ఇతర జిల్లాలకు తరలించే ప్రక్రియలో ఈ బాగోతం బయటపడింది. ఇటీవల ఒంగోలు తరలించిన బియ్యాన్ని తనిఖీ చేసిన అక్కడి అధికారులు వాటిలో నాణ్యత లేదనీ, ముక్కి, రంగుమారాయని తిరస్కరించారు. దీంతో ఇక్కడి నాణ్యత డొల్లతనం బయట పడింది. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు పంచాయితీ నిర్వహించారు. ముక్కిన బియ్యం 800 టన్నులు? జిల్లా నుంచి తరలిన బియ్యం దాదాపు 800 టన్నులు ముక్కి, రంగుమారిపోయినట్టు ఒంగోలులోని నాణ్య తా విభాగం అధికారులు ధ్రువీకరించినట్టు తెలిసింది. దీనిపై కమిషనర్ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లిన జిల్లా మేనేజర్, సహాయ మేనేజర్లను పిలిపించిన పోస్ట్‌మార్టం నిర్వహించారు. చివరకు ఇక్కడి నాణ్యతా విభాగం డొల్లతనాన్ని ఎత్తిచూపారు. జిల్లానుంచి చిత్తూరు, విశాఖ పట్నం తదితర జిల్లాల్లోని గోదాములకూ గతంలో బియ్యాన్ని తరలించారు. ఎక్కడి నుంచి వెళ్లిన బియ్యాన్నైనా భద్రపరిచేముందు నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తారు. అలాంటి సమయాల్లో ఎగుమతి చేసిన జిల్లాలోని నాణ్యతా విభాగం సిబ్బంది పనితనం తేటతెల్లమవుతుంది. ఇప్పుడదే జరిగింది. ఒంగోలులో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన బియ్యంలో కొంత భాగం సూరంపేట గోదామునుంచి తరలించినవి. వాస్తవానికి సూరంపేటలోనే కాదు. మరికొన్ని గోదాముల్లోని నాణ్యతా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, మిల్లర్లతో మిలాఖత్ అయి పాడైన బియ్యాన్ని తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలోనూ విశాఖలోనూ తిరస్కరణ గతేడాది విశాఖపట్నం తరలించిన దాదాపు 40 లారీల లోడ్ల బియ్యం నాణ్యత బాగాలేదని అక్కడి అధికారులు ధ్రువీకరించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అక్కడి డీఎం బియ్యాన్ని తిప్పి పంపారు. కానీ ఇక్కడినుంచి సహాయ మేనేజర్‌ను పంపించి గొడవ పెద్దది కాకుండా సర్దుబాటు చేయించారనే ఆరోపణలు వినిపించాయి. ఆ తరువాత ఆ బియ్యంలో కొంత మాత్రమే ఇతర చోట్లకు పంపించారు. మిగతాది అక్కడే సర్దుబాటు చేశారని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఖరీఫ్ సరుకును రబీకి మార్చిన వైనం జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 3.40లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా ధాన్యం ఉన్నాయని మిల్లర్లు, రైతులు చెప్పడంతో మరో లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయొచ్చని అధికారులు ఉన్నతాధికారులకు ఇక్కడినుంచి నివేదిక పంపారు. కానీ 60వేల టన్నులు కొనుగోలు చేసేందుకు నిర్ణయించి వాటిని వెంటనే ఆగమేఘాల మీద ఆన్లైన్ చేశారు. కానీ రైతులకు మాత్రం నేటికీ డబ్బు ఇవ్వలేదు. విచిత్రమేమిటంటే ఇక్కడి రబీ ధాన్యం ఇతరులు కొనుగోలు చేసుకోగా ఖరీఫ్‌లోని ధాన్యాన్నే రబీ లో కొన్నట్టుగా అధికారులు రికార్డులు సిద్ధం చేశారు. ఇంకా ముక్కిన బియ్యం గోదాముల్లో.. జిల్లాలోని పలు గోదాముల్లో ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని నిల్వ ఉంచారు. ఈ బియ్యాన్ని అదను చూ సి ఇతర గోదాములకు మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సూరంపేట ఘటన తరువాత ఈ బియ్యాన్ని ఎక్కడిదక్కడ గప్‌చుప్‌గా దాచేసినట్టు తెలు స్తోంది. కొన్ని గోదాముల్లోని బియ్యం ఇటీవల కురిసి న వర్షాలకు మరింత పాడై తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నట్టు సమీపంలో నివాసం ఉంటున్న ప్రజలు ఫిర్యాదు కూడా చేశారు.ఈ వైఖరిపై కొత్తగా వచ్చిన ఇన్చార్జి జిల్లా మేనేజర్ సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే దీనిపై సంబంధిత శాఖా ధికారులు ఎవరూ స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. -
గోదాములో అగ్నిప్రమాదం
రూ.7లక్షల గృహోపకరణాల దగ్ధం నెల్లూరు(క్రైమ్) : గోదాములో అగ్నిప్రమాదం సంభవించి రూ.7 లక్షల గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన గురువారం అర్ధరాత్రి ఏసీ సెంటర్లో జరిగింది. బెల్లంకొండ కిరణ్‌రాజు ఏసీ సెంటర్లో శ్రీనివాస ఎంటర్ ప్రైజస్ దు కాణం నిర్వహిస్తున్నాడు. దుకాణానికి సమీపంలోనే గోదాము ఉంది. అందులో గృహోపకరణాలను నిల్వ ఉంచాడు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఉండి అనంతరం దుకాణం, గోదాముకు తాళం వేసి వెళ్లాడు. ఈ నేపథ్యంలో గోదాములో విద్యుత్ షార్ట్ సర్కూ్యట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. బయటకు దట్టమైన పొగ రావడంతో గమనించిన స్థానికులు కిరణ్రాజుకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గోదాము తలుపులు తెరిచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.7లక్షలు విలువ చేసే గృహోపకరణాలు (టీవీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు, ఫర్నీచర్) అగ్నికి ఆహుతైనట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
గోదాముల్లో గోల్మాల్!
సాక్షి నిఘా విభాగం, మెదక్: మెదక్ జిల్లాలో ప్రజాపంపిణీ బియ్యం సరఫరా కోసం మొత్తం 19 మండల స్థాయి గోదాములున్నాయి. నెలనెలా జిల్లాకు సుమారు 13 వేల టన్నుల సబ్సిడి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో గానీ, ఇతర జిల్లాల్లో గానీ ఉన్న స్టేజ్-1 గోదాం నుంచి సంబంధిత స్టేజ్-1 కాంట్రాక్టర్ మండలస్థాయి స్టాక్ పాయింట్లకు రేషన్ సరుకులు రవాణా చేస్తాడు. అక్కడి నుండి స్టేజ్-2 కాంట్రాక్టర్ గ్రామాల్లోని రేషన్ డీలర్లకు రేషన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే డీలర్లు ప్రతినెలా తమ కోటాకనుగుణంగా డీడీలు చెల్లించి 18 తేదీలోగా మండల రెవెన్యూ కార్యాలయంలో అందజేస్తే వారు ఆర్ఓలు జారీ చేస్తారు. ఇందుకనుగుణంగా నెల చివరి వరకు స్టేజ్-2 కాంట్రాక్టర్ డీలర్లకు రేషన్ సరఫరా చేయాలి. బియ్యం పక్కదారి పడుతున్న తీరిది మామూలుగా స్టేజ్-1 గోదాం నుంచి రేషన్ సరుకులను వే బ్రిడ్జి మీద తూకం వేసి ఇస్తారు. అలాగే స్టేజీ-2 గోదాం నుంచి సరుకులను తూకం వేసిన తర్వాతే డీలర్లకు పంపిణీ చేయాలి. జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఎక్కడా వే బ్రిడ్జిలు లేవు. కేవలం చిన్నపాటి తులామాన్ తూకాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంఎల్ఎస్ పాయింట్లో బియ్యం తూకం వేయకుండానే 50 కిలోల లెక్కన బియ్యాన్ని సంచిల్లో నింపి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. బియ్యం సంచులు లోడ్ అన్లోడ్ చేసేటప్పుడు ఇనుప కొక్కాలు వాడుతుంటారు. దీంతో సంచులకు కన్నాలు పడి కిలోల కొద్ది బియ్యం గోదాంలో పడిపోతుంటాయి. బియ్యంలోని తేమ ఆవిరవుతుండటంతో కూడా సంచుల్లో తరుగు వస్తుంది. ఈ లెక్కన 50 కిలోలుండాల్సిన బియ్యం సంచి డీలరును చేరే సరికి 48 నుంచి 49 కిలోలు మాత్రమే ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఒక్కోసారి సంచులకు రంద్రాలు పడితే అందులో 5 కిలోల వరకు తరుగు వస్తుందని డీలర్లు వాపోతున్నారు. ఈ లెక్కన గోదాముల్లో నెలనెలా క్వింటాళ్లకొద్ది బియ్యం మిగిలిపోతున్నాయి. అలాగే బోగస్ రేషన్‌కార్డులు కలిగి ఉన్న రేషన్ డీలర్లు మిగులుబాటు బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లోనే అమ్ముకుంటున్నారు. కొన్నిచోట్ల రేషన్ డీలర్లు ప్రతినెల మొదటివారంలో ఇవ్వాల్సిన బియ్యాన్ని 20వ తేదీ నుంచి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అవికూడా రెండు, మూడు రోజులకోసారి బియ్యం ఇస్తుండటంతో 20 శాతం బియ్యం పంపిణీ చేయకముందే మరో నెల కోటా వ స్తోంది. ఇలా ఒక నెల బియ్యం..మరో నెలలో కలుపుతూ ఏడాదికి ఎంతలేదన్నా రెండు, మూడు కోటాల రేషన్ సరుకులను మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరికొన్ని గ్రామాల్లో ఒకే వ్యక్తి పేరుపై రెండు, మూడు బినామి రేషన్ షాపులున్నాయి. అవికూడా వేర్వేరు షాపులుగా కాకుండా ఒకేదుకాణంలో నిర్వహిస్తున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో అధికారులు బినామీ విద్యార్థుల పేర్లు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరికి సంబంధించిన బియ్యం కూడా మిగిలిపోతున్నాయి. ఇలా రకరకాల మోసాలతో మిగిలించుకున్న బియ్యం తిరిగి గోదాముల్లోకే చేరుతున్నాయి. బయట అమ్ముకుంటే బజారు పాలవుతామన్న ఉద్దేశ్యంతో అవినీతి పరులు గుట్టుచప్పుడు కాకుండా మిగులుబాటు బియ్యాన్ని గోదాంలోనే వదిలేసి...అందుకు సంబంధించిన డబ్బులందుకొని బయట పడుతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం రేషన్ సరుకులు గ్రామాల్లోకి తీసుకెళ్లే సమయంలో తప్పనిసరిగా రూట్ అధికారి ఉండాలి. గ్రామంలోని కనీసం ఐదు గురుకి సమాచారం ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో బియ్యం బకాసురుల అవినీతికి అడ్డేలేకుండా పోతుంది. ఆర్‌ఓలే మారుతాయ్... బియ్యం బస్తాలు కదలవు.. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వార సరఫరా చేసే బియ్యం కుంభకోణం రాకెట్ పకడ్బందీ ప్రణాళికతో, హైటెక్ మోసంతో కొనసాగుతుందన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా మండలస్థాయి స్టాక్ పాయింట్లలో వివిధ మార్గాల ద్వారా ప్రతినెల ఎన్ని బియ్యం మిగులుతాయనే విషయం సంబంధిత గోదాం ఇన్చార్జికి అవగాహన ఉంటుంది. అంతే పరిమాణంలో రేషన్ బియ్యాన్ని స్టేజ్-1 గోదాం నుంచి స్టేజ్-2 గోదాంకు తీసుకురాకుండానే ఆర్ఓలను ఎంఎల్ఎస్ పాయింట్ల స్టాక్ రిజిష్టర్‌లో నమోదు చేసుకుంటారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు అక్రమ పద్ధతి ద్వారా మిగిలిన బియ్యాన్ని సర్దుబాటు చేస్తారు. అలాగే స్టేజ్-1 గోదాంలో మిగిలిన బియ్యానికి సమానంగా ఏదో ఒక రైస్‌మిల్ నుంచి లేవీ కింద తెచ్చి జమ చేసినట్లు లెక్కలు చూపుతారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో డీలర్లు, గోదాం అధికారులు, కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లు కూడబలుక్కొని లక్షలాది రూపాయల బియ్యం కుంభకోణాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. సాధారణంగా స్టేజ్-1 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తులు స్టేజ్-2 కాంట్రాక్ట్ తీసుకోకూడదనే నిబంధనలున్నాయి. కానీ స్టేజ్-1 కాంట్రాక్టరే బినామీ పేర్లతో స్టేజ్-2 కాంట్రాక్ట్ తీసుకుని నడిపిస్తున్నట్లు సమాచారం. కేసులైనా...ఆగని అక్రమాలు.. * ఈనెల 15న దుబ్బాక ఎంఎల్ఎస్ పాయింట్‌పై విజిలెన్స్ శాఖ దాడులు చేయగా, 54 బియ్యం బస్తాలు, రెండు ఉప్పు బస్తాలు, ఒక చెక్కర బస్తా తక్కువగా వచ్చాయి. * ఈ సంవత్సరం జూలైలో సదాశివపేటలోని ఎంఎల్ఎస్ పాయింట్‌పై జరిగిన విజిలెన్స్ దాడి చేయగా, భారీమొత్తంలో బియ్యం స్టాక్ గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు లోనైన గోదాం ఇన్చార్జి గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. * ఏడాదిన్నర క్రితం గజ్వేల్ ఎంఎల్ఎస్ పాయింట్ పై జరిగిన దాడిలో సుమారు 50 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వచ్చినట్లు సమాచారం. తూకానికి వే బ్రిడ్జిలు లేవు: సివిల్ సప్లయీస్ డీఏం జయరాజ్ జిల్లాలోని గోదాముల్లో బియ్యం తూకం చేయడానికి వే బ్రిడ్జిలు లేవు. వేసవికాలంలో బియ్యం తరుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తూకం చేస్తుంటారు. ఇతర సమయాల్లో డీలర్లు అడిగితే బయట వే బ్రిడ్జిలపై తూకం వేసి ఇస్తారు. గోదాముల్లో ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహించవద్దు. ఎలాంటి అక్రమాలు జరిగినా తగిన చర్యలు తీసుకుంటాం.