నృసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్
మంగళగిరి: మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామిని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం దర్శించుకున్నారు. నూతన సచివాలయంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో తొలి రోజు శాసనసభలో ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ ఉదయం ఏడు గంటలకు పానకాల లక్ష్మీనృసింహస్వామి ఎగువ సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దిగువ సన్నిధికి చేరుకుని ధ్వజస్తంభానికి సాష్టాంగనమస్కారం చేసి స్వామివారితోపాటు ఆలయ ఆవరణలోని రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో పానకాలరావు, పాలకవర్గ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి నృసింహుని చిత్రపటాన్ని బహూకరించగా అర్చకులు దివి పద్మనాభాచార్యులు, ఎన్ఎస్ భట్టాచార్యులు పూజలు నిర్వహించారు.