breaking news
Government murder
-
Alexey Navalny: నిరసన గళం మూగబోయింది
మాస్కో: రష్యాలో మరో అసమ్మతి గళం శాశ్వతంగా మూగబోయింది. మూడేళ్లుగా నిర్బంధంలో ఉన్న విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు 47 ఏళ్ల అలెక్సీ నవాల్నీ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ‘‘ఆయన శుక్రవారం ఉదయం వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయతి్నంచినా, తక్షణం అంబులెన్సు రప్పించినా లాభం లేకపోయింది’’ అని జైలు వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి కారణమేమిటో బయట పెట్టలేదు. దశాబ్దానికి పైగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంట్లో నలుసుగా మారి ఆయనకు ప్రబల ప్రత్యర్థిగా ఎదిగిన నవాల్నీ మృతిపై తీవ్ర అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది కచి్చతంగా ప్రభుత్వ హత్యేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తో పోటీ పడేందుకు విఫలయత్నం చేసిన నవాల్నీ, నాటినుంచీ ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. పలు స్థాయిల్లో పెచ్చరిల్లిన అవినీతిని బయటపెడుతూ సంచలనం సృష్టిస్తూ వచ్చారు. దాంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న నవాల్నీని మాస్కో సమీపంలోని జైలు నుంచి గత డిసెంబర్లో దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజీమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. వచ్చే నెలలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో ఇది కచి్చతంగా ఆయన గొంతు నొక్కే ప్రయత్నమేనని అభిమానులు అప్పుడే ఆందోళనలకు దిగారు. ఈ ఎన్నికల్లో పుతిన్‌ను సవాలు చేసే గట్టి ప్రత్యర్థి లేకపోయినా ‘నవాల్నీ ఫ్యాక్టర్’ ఆయన్ను బాగా చీకాకు పరుస్తోంది. నవాల్నీ అనుయాయులతో పాటు నానాటికీ పెరిగిపోతున్న అభిమాన గణం సోషల్ మీడియా ద్వారా పుతిన్ వ్యతిరేక ప్రచారంతో దేశమంతటా హోరెత్తిస్తోంది. దేశ విదేశాల్లోని పుతిన్ అపార ఆస్తుల చిట్టాను కొద్ది రోజులుగా ఒక్కొక్కటిగా విప్పుతూ ఫొటోలు, వీడియోలతో సహా బయట పెడుతూ వస్తోంది. వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షలాది లైక్‌లు వచ్చి పడుతున్నాయి! ఈ నేపథ్యంలో నవాల్నీ ‘మృతి’ పుతిన్ పనేనని భావిస్తున్నారు. దీనిపై పాశ్చాత్య దేశాలన్నీ స్పందించాయి. పుతిన్ అణచివేతను నవాల్నీ ఆజన్మాంతం అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించారంటూ పలు దేశాధినేతలు కొనియాడారు. విషప్రయోగం జరిగినా... మూడున్నరేళ్ల క్రితం ప్రాణాంతక విషప్రయోగం జరిగినా వెరవని గుండె ధైర్యం నవాల్నీది! ఆయన 2020 ఆగస్టులో సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ‘నొవిచోక్’ దాడికి గురయ్యారు. రష్యాకే ప్రత్యేకమైన ఆ ప్రాణాంతక రసాయనాన్ని నవాల్నీ లో దుస్తులపై చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బ తీసే నొవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్‌పై ‘అండర్‌ప్యాంట్స్ (లో దుస్తుల) పాయిజనర్’ అంటూ చెణుకులు విసిరారు. దాంతో అండర్‌ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులరైంది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నవాల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగీ దిగగానే ఆయన్ను నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నవ్వుతూనే కన్పించారు... నవాల్నీ చివరిసారిగా గురువారం బయటి ప్రపంచానికి కన్పించారు. ఓ కేసు విచారణలో వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండటమే గాక సరదాగా నవ్వుతూ, విచారణ సందర్భంగా జడ్జితోనూ జోకులు వేస్తూ గడిపారు. సాహసమే శ్వాస... మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జని్మంచిన నవాల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయట పెట్టారు. 2008 నుంచీ ఆయన పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నవాల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. 2014లో ఆశ్చర్యకరంగా జైలు నుంచి విడుదల చేయడంతో మాస్కో మేయర్ ఎన్నికల బరిలో దిగారు. ప్రచార మార్గాలన్నింటినీ మూసేసినా పుతిన్ బలపరిచిన అభ్యరి్థకి గట్టి పోటీ ఇవ్వడంతో నవాల్నీ పేరు మారుమోగిపోయింది. దాంతో ప్రభుత్వం మళ్లీ అరెస్టుల పర్వానికి తెర తీసింది. చివరికి 2018 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించడంతో ప్రజల దృష్టిలో నవాల్నీ మళ్లీ హీరోగా మారారు. రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవడం, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్త్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్‌ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో ‘విమాన ప్రమాదం’లో మరణించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది. నవాల్నీ మాత్రం పుతిన్‌ను గట్టిగా సవాలు చేస్తూ ప్రబల ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు. సోషల్ మీడియాను, స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ చెమటలు పట్టించారు. భౌతిక దాడులు, హత్యాయత్నాలను ఏమాత్రం లెక్కచేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించి పెట్టింది. నిరసనలు... ఆగ్రహావేశాలు నవాల్నీ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పుతిన్ పనేనంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. నవాల్నీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎవరినైనా అంతమొందించడం పుతిన్ నైజమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ దుయ్యబట్టారు. ఆయన సర్వం కోల్పోవడంతో పాటు తన తప్పిదాలకు బాధ్యునిగా శిక్ష అనుభవించి తీరాల్సిందేనన్నారు. నవాల్నీ తన అసమాన ధైర్యసాహసాలకు జీవితాన్నే మూల్యంగా చెల్లించాల్సి రావడం బాధాకరమని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కొల్జ్ ఆవేదన వెలిబుచ్చారు. అడుగడుగునా ప్రాణాపాయం పొంచి ఉన్నా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించడం నవాల్నీకే చెల్లిందంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కొనియాడారు. ఆయన్ను రష్యా ప్రభుత్వమే క్రూరంగా పొట్టన పెట్టుకుందని లాతి్వయా అధ్యక్షుడు రింకేవిక్స్ ఆరోపించారు. తాను అత్యంత బలహీనుడినని ఈ చర్యతో పుతిన్ రుజువు చేసుకున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. రష్యాలో స్వేచ్చా గళాలపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మండిపడ్డారు. సొంత ప్రజల అసమ్మతి పుతిన్‌ను విపరీతంగా వణికిస్తోందని మరోసారి రుజువైందని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకే నవాల్నీ హత్య జరిగిందని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్, రష్యా విపక్ష నేత గారీ కాస్పరోవ్ తదితరులు దుమ్మెత్తిపోశారు. పుతినే బాధ్యుడు: భార్య నవాల్నీ మరణ వార్తలపై ఆయన భార్య యూలియా నవాల్నయా అనుమానాలు వెలిబుచ్చారు. శుక్రవారం మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అన్నారు. సదస్సులో పాల్గొన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తదితర నేతలు ఆమెను ఓదార్చారు. -
రైతుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలే..
* కోలుకొండ గుట్టల పట్టా రద్దు చేయాలి * తెలంగాణ యునెటైడ్ ఫోరం కోచైర్‌పర్సన్ విమలక్క కడవెండి(దేవరుప్పుల) : రైతుల ఆత్మహత్యలు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, తెలంగాణ కల సాకారం కావాలంటే సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాటాలు చేయూల్సిందేనని తెలంగాణ యునెటైడ్ ఫోరం కో చైర్పర్సన్ విమలక్క పిలుపునిచ్చారు. ఉద్యమాల పురిటిగడ్డ కడవెండిలో తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నేటి తెలంగాణ సాధన అమరులకు అరుణోదయ కళాకారులు కళారూపాలతో లాల్ సలామ్ తెలిపారు. శనివారం రాత్రి దొడ్డి కొమురయ్య స్మారక స్థూపం నుంచి పీపుల్స్‌వార్ అమరులు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి, పైండ్ల వెంకటరమణ స్మారక స్థూపాల నుంచి హైస్కూల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణక్క రచించిన గోదావరిలోయ గోగుపూలు(గోదావరిలోయ మహిళా అమరుల సంక్షిప్త పరిచయం) పుస్తకాన్ని పెద్ది పిచ్చమ్మ, విమలక్క, రామలింగం కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా తెలంగాణ రైతాంగ సాయధ పోరాటం నుంచి నేటి తెలంగాణ సాధన విముక్తి పోరులో ప్రాణాలర్పించిన అమరుల ఆశయం నేరావేరాలంటే ఆర్థిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం జరగాలన్నారు. కోలుకొండ గుట్టలను వారసత్వం పేరిట దొంగ పట్టాలు చేసి మెట్ట భూమిగా సీమాంధ్రకు చెందిన గ్రానైట్ మాఫియా చేతిలో పెట్టడం దారుణమన్నారు. స్థానిక సర్పంచ్ సుడిగెల హన్మంతు, నిర్మలక్క, దొడ్డి బిక్షపతి, బత్తుల సత్తయ్య, కె.రామలింగం, పీఓడబ్ల్యూ కరుణ పాల్గొన్నారు.