breaking news
Gold saree
-
పసిడి కోక.. కట్టుకుంటే కేక
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్‌కుమార్.. పది రోజులపాటు శ్రమించి పసిడి కోకను నేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురు పెళ్లి కోసం 200 గ్రాముల బంగారంతో చీర తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఆ మేరకు విజయకుమార్ బంగారంతో నిలువు, అడ్డం పోగులను చేనేత మగ్గంపై నేశారు. 800 నుంచి 900 గ్రాముల బరువు.. 49 అంగుళాల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో చీరను రూపొందించారు.కట్టుకునేందుకు వీలుగా కొత్త డిజైన్లతో పసిడి కోకను సిద్ధం చేశాడు. ఈ చీర తయారీకి బంగారంతో కలిపి మొత్తం రూ.18 లక్షలు ఖర్చయినట్టు విజయ్‌కుమార్ తెలిపారు. అక్టోబరు 17న సదరు వ్యాపారి కూతురు పెళ్లి ఉండడంతో.. ఆరు నెలల కిందటే ఆర్డర్ తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, సువాసన వచ్చే చీర, కుట్టులేని జాతీయ జెండాను చేనేత మగ్గంపై నేసిన విజయ్‌కుమార్.. తాజాగా బంగారు చీరను నేయడం విశేషం. -
కన్యకాపరమేశ్వరికి బంగారు చీర, వజ్ర కిరీటం
♦ తమిళనాడు గవర్నర్ రోశయ్య ♦ చేతుల మీదుగా సమర్పణ విశాఖ పాత నగరం కన్యకాపరమేశ్వరి దేవస్థానంలోని మూల విరాట్‌కు కోటిన్నర రూపాయల వ్యయంతో నాలుగు కేజీల బంగారాన్ని వినియోగించి రూపొందించిన బంగారు చీరను తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం అమ్మవారికి సమర్పించారు. విజయనగరం పట్టణంలోని వాసవీ మాతకు విశాఖపట్నం వాసవీ జ్యూవెలర్స్ సమర్పించిన వజ్ర కిరీటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ఆయన మాట్లాడుతూ విశాఖలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన కన్యకాపరమేశ్వరి ఆలయం అభివృద్ధికి ఆర్య వైశ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రోశయ్యను ఆలయ కమిటీ సత్కరించింది. - విశాఖపట్నం/విజయనగరం రూరల్ -
బంగారం శారీ
నల్లంచు తెల్ల చీరైనా.. చెంగావి రంగుచీరైనా.. అతివలు చుట్టుకుంటేనే వాటికి అందం. తరతరాలుగా విలువ తరగని వలువలు ఏమైనా ఉన్నాయంటే అది ముమ్మాటికీ చీరలే.మగువల మేనును చుట్టుకుని మెరిసిపోయే కోకల రూపకల్పన మహాద్భుతంగా ఉంటుంది. గాలిలోన తేలిపోయే చీరలెన్నో జిలుగువెలుగుల శిల్పాన్ని అద్దుకుని చరిత్రలో నిలిచిపోయాయి. నవాబుల కాలంలో బంగారంతో నేసిన ఓ చీర ఇటీవల తళుక్కుమంది. 16వ శతాబ్దం నుంచి వారసత్వ సంపదగా కాపాడుకుంటూ వస్తున్న ఆ బంగారు చీరను ఆనాటి మేటి నేతగాళ్ల వారసులు పురావస్తు శాఖకు అందించారు. ..:: కోన సుధాకర్‌రెడ్డి సరికొత్త చీర ఊహించడం ఈజీనే. రోజురోజుకూ ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులు చీరల్లో సరికొత్త చేర్పులు చేస్తున్నాయి. ఎన్ని ఇన్నోవేటివ్ శారీస్ వచ్చినా.. తాతమ్మల కాలం నాటి జరీ అంచు చీరలకు ఉన్న ప్రత్యేకతే వేరు. అమ్మమ్మ పెళ్లినాటి పట్టుచీర కరిగిస్తే కిలో వెండి వస్తుందన్న కథనాలూ చాలామంది వినే ఉంటారు. దీన్ని రుజువు చేస్తూ ఇటీవల వెలుగు చూసిన 16వ శతాబ్దం నాటి ఓ చీర స్వర్ణకాంతులీనుతోంది. హైదరాబాద్ పాలకుల పట్టమహిషుల కోసం రూపొందించిన ఈ చీర తాజాగా పురావస్తు మ్యూజియానికి చేరింది. బేగమ్స్ కో నజరానా.. బహమనీలు, కుతుబ్‌షాహీలు, అసఫ్ జాహీలు ఇలా శతాబ్దాల తరబడి హైదరాబాద్ ఇస్లాం రాజవంశీకుల ఏలికలో ఉండేది. వీరి జమానాలో నగరంపై ఇరాన్, పర్షియన్ ప్రభావం కనిపించేది. అయితే భారతీయ సంప్రదాయాన్ని అభిమానించిన రాజకుటుంబీకులు ఉన్నారు. అలా వారు సాదరంగా ఆహ్వానించిన వాటిల్లో భారతీయ వనితలకు మాత్రమే సొంతమైన చీరలూ ఉన్నాయి. ఎండకన్నెరగని అంతఃపుర కాంతలు తళుకుబెళుకుల చీరపై మోజుపడటంతో.. రాజులు వాటిని ప్రత్యేకంగా నేయించి బహుమతిగా అందించేవారు. అలా హిందూస్థానీ చీరకట్టును నవాబుల బేగమ్‌లు వంటబట్టించుకున్నారు. నవాబుల మన్ననలు.. మొదట్లో తమ రాణుల కోసం నవాబులు ఇరాన్, పర్షియా నుంచి చీరలను దిగుమతి చేయించేవారు. అయితే ఇక్కడి నేతకారుల ప్రతిభా పాటవాలు తెలిసి వారితో చీరలను నేయించారు. రాణుల అభిరుచి, ఆడంబరాలకు తగ్గట్టుగా చీరలు నేసి.. రాజుల మనసు గెలుచుకున్న నేతన్నలెందరో ఉన్నారు. ఇలా ప్రత్యేకంగా చీరలు నేసే వారిలో నగరానికి చెందిన రాజా భగవాన్‌దాస్ కుటుంబీకులు ఉన్నారు. వీరు తీర్చిదిద్దిన చీరల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ అపురూపమైన బంగారు పూత చీర. కొత్తదనం కోసం చీరల తయారీలో బంగారం ఉపయోగించి శభాష్ అనిపించుకున్నారు. వారసత్వ సంపదగా.. ఈ బంగారు పూత చీర తయారీకి ఢాకా (ఇప్పటి బంగ్లాదేశ్ రాజధాని)కు చెందిన మల్మల్ క్లాత్ ఉపయోగించేవారు. వేడి లోహాన్ని తట్టుకునే గుణం దీనికి ఉండటంతో ఈ వస్త్రాన్ని ఉపయోగించి పుత్తడి చీరలను పుట్టించేవారు. ఆనాటి నేతగాళ్ల ప్రతిభకు తార్కాణంగా నిలిచిన ఈ బంగారు చీర కొంగు అందంగా తీర్చిదిద్ది, దానిపై కైరీ (మామిడి పిందెలు) డిజైన్ని చూపించారు. బంగారం, వెండి జరీవర్క్తో రూపొందించిన ఈ తొమ్మిది గజాల చీర బరువు 850 గ్రాములు. ఇన్నాళ్లూ ఈ చీరను భగవాన్‌దాస్ కుటుంబీకులు వారసత్వ ఆస్తిగా దాచుకున్నారు. ‘మా పూర్వీకులు నిజాం ఆస్థానంలో పని చేసేవారు. ఈ బంగారు చీర మా ముత్తాతల దగ్గరే ఉండిపోయింది. తరతరాలుగా దీన్ని వారసత్వ ఆస్తిగా కాపాడుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సూచన మేరకు దీన్ని ప్రభుత్వానికి అందజేశాం’ అని తెలిపారు భగవాన్‌దాస్ కుటుంబ వారసుడు గోపాల్ షా. ప్రాచీనతకు పెద్ద పీట ఆ పాత అద్భుతాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే వస్తువులకు వెలకట్టలేం. వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. బంగారు చీర ఉన్నదన్న విషయం తెలిసిన వెంటనే భగవాన్ దాస్ వారసులను పిలిపించి మాట్లాడాను. దాన్ని పురావస్తు శాఖకు అందిస్తే నాలుగు కాలాలపాటు భద్రంగా ఉంటుందని చెబితే.. వారు స్పందించి ముందుకు వచ్చారు. - డాక్టర్ కె.వి. రమణాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విలువ కోట్ల పైమాటే.. చీర సంప్రదాయానికి నిలువుటద్దం. లండన్‌లోని సౌత్బీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేలైన పురాతన వస్తువులు కొనుగోలు చేస్తుంది. వారి లెక్కల ప్రకారం ఈ చీర విలువ కోట్ల పైమాటే. నిజాం రాణులు బంగారు పూత చీర ధరించినట్టు ఈ చీర చరిత్ర ద్వారా అర్థమవుతుంది. - మామిడి హరికృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు.