breaking news
Godarolla Kithakithalu
-
శ్వాస విడిచిన యాస.. ఈవీవీ బా.. ఇక లేరు..
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ రచయిత, గోదారి యాస నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాస భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషిచేసిన గోదారోళ్ళ కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బొమ్మూరులోని శివాలయం సమీపంలో ఉన్న ఈవీవీ స్వగృహం వద్ద ఆయన భౌతికకాయాన్ని బంధువులు, స్నేహితులు, గ్రూపు సభ్యులు, కోకోకోలా కంపెనీ ఉద్యోగులు అధికసంఖ్యలో వచ్చి సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఈవీవీ భౌతికకాయాన్ని ర్యాలీగా ఇన్నీసుపేటలో రోటరీ కైలాసభూమికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈవీవీ మరణవార్త తెలియగానే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఫేస్బుక్ మిత్రులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈవీవీ భార్య, ఇద్దరు కుమార్తెలను, తల్లి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. గోదారోళ్ల కితకితలు ఐదవ ఆత్మీయ కలయికలో గ్రూపు సభ్యులతో ఈవీవీ సత్యనారాయణ (పాతచిత్రం) గోదావరి యాసపై విపరీతమైన మక్కువతో... గోదావరి యాసపై విపరీతమైన మక్కువ కలిగిన ఈదల వీరవెంకట సత్యనారాయణ(ఈవీవీ) 2016లో గోదారోళ్ళ కితకితలు పేరిట ఫేస్బుక్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఉన్నవారినో ఒకటి చేశారు. ఆరోగ్యకరమైన హాస్యానికి జీవం పోస్తూ మంచి రచయితగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తరువాత జరిగిన ఓ ప్రమాదంలో ఓ స్నేహితుణ్ణి కాపాడి సంచలనంగా మారారు. ప్రాణం కాపాడిన ఫేస్బుక్ స్నేహం అంటూ అప్పట్లో వార్తకథనాలు ప్రసారం కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం కొద్దిరోజులకే గ్రూప్ లక్షమందిని చేరుకుని ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. గ్రూప్ పెట్టిన దగ్గర నుంచి ఈవీవీ హాస్యకథనాలతో పాటు మధ్యతరగతి ప్రజల స్థితిగతులపై కట్టిపడేసే కథనాలను పోస్ట్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గోదారోళ్ళకితకితలు గ్రూప్ సభ్యులందరిని ఆత్మీయ కలయిక పేరుతో ఏటా ఒకే వేదికపై తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల సంఖ్య రెండులక్షలకు పైగా చేరుకుంది. ఈవీవీ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తెలు సినిమా నటుడిగా... ఈవీవీ ఇటీవలే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. నాగార్జున, నాగచైతన్య బంగార్రాజు సినిమాలో ఒక కీ రోల్లో నటించి అందరినీ మెప్పించారు. షార్ట్ఫిల్మ్స్లో నటించారు. గోదారోళ్ల గుండెల్లో పదిలం అందరికీ నవ్వులు అందిస్తూ ఆయుష్షు పెంచే ఉద్యమంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఈవీవీ ఆయుష్షు అర్థంతరంగా ముగియడమేమిటి ! గోదారోళ్ళ యాసకు, ఎటకారాలకు చావుండదు. మన ఈవీవీ చిరంజీవి, గోదారోళ్ళ యాసలో, శ్వాసలో గుండెల్లో పదిలంగా ఉంటాడు. – కర్రి రామారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరం -
రికార్డులకెక్కిన ‘గోదారోళ్ల కితకితలు’
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్బుక్ గ్రూప్ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు సుబ్బరాజు తోటలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. భారత్ బుక్ ఆఫ్ రికార్డ్ చీఫ్ ఎడిటర్ కె.అన్నపూర్ణ.. గ్రూప్ అడ్మిన్ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సుబ్బరాజుగారితోటలో... ‘గోదారోళ్ల కితకితలు’ ఫేస్బుక్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బొమ్మూరు జీపీఆర్ రోడ్డులోని సుబ్బరాజుగారితోటలో ఉత్సాహంగా జరిగింది. వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు ఏడువేల మంది ఈ కార్యక్రమానికి తరలిచ్చారు. బొమ్మూరు గ్రామానికి చెందిన ఈవీవీ సత్యనారాయణ 2015లో ఈ ఫేస్బుక్ గ్రూపును ప్రారంభించారు. మగవారు పట్టుపంచె, కండువా, ఆడవారు పట్టుచీరలు ధరించి హాజరయ్యారు. గోదావరి జిల్లాల ప్రత్యేకమైన తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకు, పెనుగొండ గజ్జికాయ, వివిధ రకాల పిండి వంటకాలను తయారీ చేసి గ్రూపు సభ్యులకు అందుబాటులో ఉంచారు. చిన్నారుల ఆడుకునేందుకు వివిధ రకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. ఫేస్బుక్ మిత్రులు ఫొటోలు దిగేందుకు పూలతో వివిధ రకాల ఆకృతులను అందంగా అలంకరించారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నాం భోజనం వరకు గోదావరి రుచులను ఆత్మీయతతో కొసరి కొసరి వడ్డించారు. వివిధ రకాల తెలుగు వంటకాలను ఫేసుబుక్ మిత్రులకు రుచి చూపించారు. ఇది నాలుగో సమ్మేళనం గోదారోళ్ల కితకితలు నాలుగో ఆత్మీయ సమ్మేళనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గోదావరి ప్రాంత, యాస, హాస్యంతో బాబోయ్ ఇంక నవ్వలేం అన్నట్టుగా సాగింది. కితకితల సభ్యుల కలయిక. కేవలం ఫేస్బుక్లో మాత్రమే పోస్టింగులు చేసుకునే వీరంతా ప్రత్యక్షంగా కలవడంతో ఆనందానికి అవధలు లేకుండా పోయాయి. గోదారోళ్ల కితకితలుపై వెటర్నరీ డాక్టర్ కోటి కాపుగంటి రాసిన పాటల సీడీని తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మొదట సీడీని ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజుకు అందజేశారు. గ్రూపు సభ్యురాలికి సీమంతం గ్రూపులోని సభ్యురాలైన రావులపాలెంనకు చెందిన గర్భిణి కల్యాణికి సీమంతం నిర్వహించారు. ముందుగా ఈవీవీ సత్యనారాయణ దంపతులు, అనంతరం గ్రూపుసభ్యులు అక్షింతలు వేసి ఆశీర్వాదించారు. సారి పెట్టి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనూహ్య స్పందన గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్ గ్రూప్ సభ్యుల ఆత్మీయ కలయికకు సభ్యుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మన యాసపై ఉన్న మమకారంతో 2015లో గ్రూపును ప్రారంభించాను. ఇప్పటికి 1,16,127 మంది సభ్యులున్నారు. నాలుగోసారి నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం భారత్, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కావడం చాలా ఆనందంగా ఉంది. – ఈవీవీ సత్యనారాయణ, గ్రూప్ క్రియేటర్, బొమ్మూరు కలయిక అపూర్వం సోషల్ మీడియా ద్వారా ఇందరు ఒకే చోట కలవడం అపూర్వం. గోదావరి హాస్యానికి, యాసకు పెద్దపీట వేస్తూ గ్రూపు ముందుకు సాగడం అభినందనీయం. గ్రూపులో సభ్యుడిని కావడం ఆనందంగా ఉంది. – ఇరవ వెంకటసుబ్రహ్మణ్యం, హైదరాబాద్ తప్పకుండా వస్తాం గోదారోళ్ల కితకితలు ఫేస్బుక్లో నేను కూడా ఓ అడ్మిన్. బంధువుల ఇళ్లల్లో జరిగే ఫంక్షన్లకు వీలులేకపోతే మానేస్తాం గానీ, ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాత్రం రాకుండా ఉండం. ముందు నుంచే ఇంటిలో వారికి నచ్చచెప్పి వచ్చి సొంతి ఇంటిలో పండగలా నిర్వహిస్తాం. బంధువులు కంటే ఈ ఫేస్‌బుక్‌లోనే మిత్రులు ఆత్మీయులుగా ఉంటాం. – బోయపాటి పద్మ, హనుమాన్ జంక్షన్ బంధాలు పెరుగుతాయి ఆత్మీయ కలయిక ద్వారా బంధాలు పెరుగుతాయి. వేలాదిమంది తరలిరావడమే ఇందుకు నిదర్శనం. సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం. అక్కా, బావ.. పిలుపులే మా గ్రూపులో వినిపిస్తాయి. దేశవ్యాప్తంగా మా గ్రూపులో వేల మంది సభ్యులున్నారు. – అన్నందేవుల దేవీలక్ష్మీ, రాజమహేంద్రవరం