breaking news
GJF
-
‘అక్షయ’... జిగేల్!
♦ అక్షయ తృతీయకు పసిడి అమ్మకాల జోష్ ♦ కళకళలాడిన బంగారం దుకాణాలు ♦ విక్రయాల్లో 20 శాతం వృద్ధి:జీజేఎఫ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అక్షయ తృతీయకు బంగారం దుకాణాలు కళకళలాడాయి. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అంతంత మాత్రంగానే అమ్మకాలను సాగిస్తున్న షాపులు కాస్తా శుక్రవారం నాడు కస్టమర్లతో సందడిగా మారాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి 20 శాతం దాకా వృద్ధి నమోదైనట్లు ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ (జీజేఎఫ్) వెల్లడించింది. అక్షయ తృతీయ ఈ సారి రెండు రోజులు రావడంతో నేడు (శనివారం) కూడా అమ్మకాలుంటాయని, ఇది కలిసి వస్తుందని వర్తకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన కాయిన్స్.. గత కొన్నేళ్లుగా లైట్ వెయిట్ జువెల్లరీకి కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనపడుతోంది. మెట్రోలు, ప్రధాన నగరాల్లో హ్యాండ్ క్రాఫ్టెడ్ జువెల్లరీ, ఇండో–ఇటాలియన్ ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. అక్షయకు ఆభరణాలు తీసుకోనివారు నాణేలను కొనుగోలు చేసేవారు. ఈసారి మాత్రం నాణేల అమ్మకాలు పడిపోయాయని బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి తెలిపారు. నాణేల స్థానంలో చిన్న చిన్న నగలను కొనుగోలు చేశారన్నారు. బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా ఉందని, కొనుగోలుకు మంచి తరుణమని చెప్పారు. 2016 అక్షయతో పోలిస్తే ఈసారి మొత్తం పరిశ్రమలో 20 శాతం దాకా వృద్ధి ఉందని జీజేఎఫ్ మాజీ చైర్మన్ జి.వి.శ్రీధర్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డిజిటల్దే అగ్రస్థానం.. గతంలో పుత్తడి కొనుగోళ్లలో నగదు లావాదేవీలే అధికం. కొన్ని నెలల క్రితం వరకు డిజిటల్ లావాదేవీల వాటా కేవలం 20 శాతం మాత్రమే. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత కారణంగా ఇప్పుడు డిజిటల్ వాటా ఏకంగా 60 శాతానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కస్టమర్లను ఆకట్టుకోవడానికి చాలా కంపెనీలు తయారీ చార్జీలపై డిస్కౌంట్లను ప్రకటించాయి. కొన్ని కంపెనీలు ఉచిత కాయిన్లను ఆఫర్ చేస్తున్నాయి. టాప్ బ్రాండ్లు అయితే కొత్త కలెక్షన్లతో కస్టమర్లకు స్వాగతం పలికాయి. రానున్న రోజుల్లో బంగారం ధర రూ.30 వేలపైన కదలాడుతుందని కొటక్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అరబింద ప్రసాద్ గయన్ వ్యాఖ్యానించారు. పెట్టుబడి సాధనాల్లో ఇప్పుడు పుత్తడి ఆకట్టుకుంటోందని అన్నారు. ఇదీ జువెల్లరీ మార్కెట్.. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల వ్యాపార పరిమాణం రూ.4,80,000 కోట్లుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా అధికంగా 60% ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు 40% వాటా కైవసం చేసుకున్నాయి. సగటున రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అక్షయ తృతీయ రోజున 15–20 రెట్ల వ్యాపారం జరుగుతుందని వర్తకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా గతేడాది ఈ పండక్కి 20 టన్నుల పుత్తడి విక్రయం అయినట్టు అంచనా. తొలి త్రైమాసికంలో కంజ్యూమర్ సెంటిమెంట్, అమ్మకాల వృద్ధి గతేడాది కంటే ఉత్తమంగా ఉందని టైటాన్ జువెల్లరీ విభాగం రిటైల్, మార్కెటింగ్ ఎస్వీపీ సందీప్ కులహల్లి తెలిపారు. కాగా, శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.29,700(10 గ్రాములు) పలికింది. -
ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే
దీపావళికి అమ్మకాలు బాగుంటాయ్ జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ శ్రీధర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే ఉంటుందని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వర్తక సంఘం(జీజేఎఫ్) తెలిపింది. దిగుమతుల కట్టడి, సెంటిమెంటు తదితర కారణాలతో గత కొంత కాలంగా మార్కెట్ స్తబ్దుగా ఉంది. కొత్త ప్రభుత్వం, మార్కెట్ ఆశావహంగా ఉండడంతో గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2014-15లోనూ రూ.4 లక్షల కోట్ల వ్యాపారం నమోదు కావొచ్చని అంచనాలున్నాయని జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ జి.వి.శ్రీధర్ ఆదివారమిక్కడ మీడియాతో పేర్కొన్నారు. దీపావళి సీజన్లో 10-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రూ.28 వేల ధర సరైందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మైనింగ్ ధరకు బంగారం లభిస్తోందని వివరించారు. రెండో అతిపెద్ద వినియోగదారు అయిన భారత్లో పన్నులు, దిగుమతి విధానం, రూపాయి విలువ వంటి అంశాలు సైతం అంతర్జాతీయంగా ధరను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఏకీకృత ధర దిశగా..: దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీజేఎఫ్ ఎప్పటి నుంచో కోరుతోందని శ్రీధర్ తెలిపారు. ఆరు నెలల్లో బంగారం డిపాజిట్ స్కీంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ప్రజల వద్ద 20,000 టన్నుల బంగారం ఉంది. ఇందులో 5% తిరిగి వ్యవస్థలోకి వచ్చినా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చు. దొంగ రవాణాకు కట్టడి పడుతుంది. ముడి బంగారాన్ని బ్యాంకులు డిపాజిట్లుగా సేకరించాలి. ఈ బంగారాన్ని రుణం రూపంలో ఆభరణాల వర్తకులకు ఇవ్వాలి. వర్తకులు తిరిగి బంగారాన్ని బ్యాంకులకు చెల్లించేలా స్కీం రావాలి’ అని అన్నారు. ఏపీ, తెలంగాణలో 20-30% వ్యాపారం తగ్గిందని ట్విన్సిటీస్ జువెల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నకాషి, పచ్చి సెట్టింగ్ వర్క్, అన్కట్ డైమండ్ నగల తయారీలో భాగ్యనగరిదే పైచేయి అని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు.