యువతి అస్థికలను ఎత్తుకెళ్లిన ప్రేమికుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి కుటుంబసభ్యులు
హైదరాబాద్: ప్రేమించిన యువతి దక్కలేదు... ఆమె అస్థికలనైనా దక్కించుకోవాలని తలచిన ఓ యువకుడు సినీ ఫక్కీలో రాత్రిపూట శ్మశానానికి వెళ్లి దహన సంస్కారాలు చేసిన చోట ఉన్న అస్థికలను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాగ్‌అంబర్‌పేట డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన ఇ.శ్రీనివాస్ కూతురు మహేశ్వరి(22) బీటెక్ చదివింది. గత నెల 22న కడుపునొప్పి భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నిం చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 2న ఆమె మృతి చెందింది. అయితే మహేశ్వరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
ఈ నెల 2న రెడ్‌బిల్డింగ్ వద్ద గల మెయిన్ చెరువు శ్మశాన వాటికలో మహేశ్వరి శవానికి దహన సంస్కారాలు జరిపిం చారు. ఇదిలా ఉండగా ఇదే భరత్‌నగర్ బస్తీకి చెందిన డప్పు కృష్ణ కుమారుడు సాయిరామకృష్ణ తాను మహేశ్వరిని ప్రేమించానని, తన ప్రేయసి చనిపోయిందని, తాను కూడా చనిపోతానని ఆ రోజున పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధపడ్డాడు. అతనికి పోలీసులు కౌన్సెలింగ్ చేసి పంపించారు. కాగా సోమవారం ఉదయం శ్మశానంలో మహేశ్వరి అస్థికలను ఏరడానికి తాత ఆగమయ్య, మరో వ్యక్తి శ్రీహరి వెళ్లగా అక్కడ అస్థికలు కనిపించలేదు.
దీంతో కాటికాపరులు బిక్షపతి, యాదయ్యలను అస్థ్థికల విషయమై వారు ప్రశ్నించగా, ఆదివారం రాత్రి 11-12 గంటల మధ్య డప్పు కృష్ణ, సాయిరామకృష్ణలతో పాటు మరో ఇద్దరు శ్మశాన వాటికకు వచ్చి తమను బెదిరించి అస్థికలు తీసుకుని వెళ్లారని చెప్పారు. సాయిరామకృష్ణ తాగిన మత్తులో చనిపోయింది తన భార్య అని, అవి తన భార్య అస్థికలు... తనకే దక్కాలని పెద్దగా గొడవ చేశారని కాటికాపరులు ఆగమయ్యకు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే కాటి కాపరి నుంచి వివరాలను సేకరించారు. ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ, ఎస్సై అమ్జద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.