బాలిక నగ్నఫొటో.. ఫేస్‌బుక్‌పై కేసు
వియత్నాం, అమెరికా మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన చరిత్రాత్మాక ఫొటోను తొలగించి వివాదాన్ని కొనితెచ్చుకున్న సోషల్ మీడియా ఫేస్బుక్, ఇప్పుడు 14 ఏళ్ల బాలిక నగ్న ఫొటోను ప్రచురించి కొత్త వివాదాన్ని తెచ్చుకుంది. వియత్నాంపై 1972లో జరిగిన నాపాం బాంబు దాడిలో శరీరంపై బట్టలు దగ్ధం కాగా రోడ్డుపై నగ్నంగా పరుగెడుతున్న 9 ఏళ్ల బాలిక ఫొటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఫొటో రేపిన సంచలనంతోనే అనేక ప్రపంచ దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి వియత్నాంపై యుద్ధానికి తెరదించాయి.
అలాంటి చరిత్రాత్మక ఫొటోను అసభ్యంగా ఉందని భావించిన ఫేస్బుక్ యాజమాన్యం ఇటీవల దాన్ని తొలగించి వివాదంలో చిక్కుకుంది. దీనికి నిరసనగా నార్వే పత్రిక ఒకటి ఆ ఫొటోను మొదటిపేజీలో పెద్దగా ప్రచురించింది. నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ ఆ ఫొటోను ఫేస్బుక్లో మళ్లీ పోస్ట్ చేశారు. మళ్లీ తొలగించిన ఫేస్బుక్ చివరకు దాన్ని అనుమతించి నార్వే ప్రధానికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక నగ్నఫొటోను ఫేస్బుక్లో అప్‌లోడ్‌కు, రీఆప్లోడ్కు అనుమతించి వివాదంలో చిక్కుకుంది. 2014 నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు తన ఫొటోను పలుసార్లు పోస్ట్‌చేసి పరువు తీసిందని, తన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని, డేటా పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్ హైకోర్టును ఆ 14 ఏళ్ల బాలిక ఆశ్రయించింది. ఆమె వాదనను ఖండిస్తూ ఫేస్బుక్ యాజమాన్యం చేసిన వాదనను కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ కొనసాగుతుందని ప్రకటించింది.
బ్లాక్‌మెయిల్‌తో బాలిక ఫొటోను సంపాదించిన ఓ వ్యక్తి దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేశారని, ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ ద్వారా దాన్ని అడ్డుకోవాల్సిన ఫేస్బుక్ అలా చేయకపోగా, ఆ ఫొటో పలుసార్లు అప్లోడ్ చేసేలా అనుమతించిందని ఆ బాలిక న్యాయవాది వాదించారు. అందుకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొదటిసారి ఆ ఫొటోను అప్లోడ్ చేసిన వ్యక్తిపై కూడా తాము కేసు పెడుతున్నామని చెప్పారు. కోర్టు నిబంధనల ప్రకారం ఆ బాలిక పేరును వెల్లడించలేదు.
నగ్నత్వంపై సమాజం నిర్దేశించిన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని వియత్నాం ఫొటోను తొలగించాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడం సంక్లిష్టం అవుతోందని నార్వే ప్రధానికి లేఖ రాసిన ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ స్యాండ్బర్గ్ తాజా కోర్టు కేసుపై వ్యాఖ్యానించేందుకు అందుబాటులోకి రాలేదు.