కారు ఢీకొని బాలికకు తీవ్ర గాయాలు
నిడదవోలు : మండలంలోని డి. ముప్పవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం కారు ఢీకొని ఏడేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. తణుకు నుంచి నిడదవోలు పట్టణానికి వస్తున్న కారు డి.ముప్పవరం గ్రామ శివారున రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఏడేళ్ల అనమలపూడి ధనలక్ష్మిని ఢీకొంది. దీంతో బాలికకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు ఆమెను 108 వాహనంలో తణుకు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి రాజమండ్రి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలికను ఢీ కొట్టిన కారు యజమాని గ్రామస్తులకు భయపడి అక్కడ ఆపకుండా శరవేగంతో పరారయ్యేందుకు యత్నించాడు.
స్థానిక యువకులు మోటర్‌సైకిల్‌పై కారును వెంబడించడంతో వారి నుంచి తప్పించుకునేందుకు కారు వేగాన్ని పెంచాడు. దీంతో అదుపు తప్పి నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామ శివారున పంట బోదెలోకి కారు దూసుకెళ్లింది. ఈ సమయంలో అక్కడే ఉన్న కూలీలు కారులో ఉన్న ఇద్దరిని బయటకు తీసి రక్షించారు. కారు దూసుకెళ్లిన ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ సమీపంలో బేతెస్థ ప్రార్ధన మందిరం ఉండడంతో భక్తులు తిరుగుతుంటారు. పొలం పనులకు వెళ్లే కూలీలు ఆ సెంటర్లోనే ఉంటారు. కారు దూసుకెళ్ళిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఇద్దరూ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు.