breaking news
Gilles Muller
-
వింబుల్డన్‌లో మరో సంచలనం
లండన్:వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో మరో సంచలనం చోటు చేసుకుంది. మహిళల సింగిల్స్ లో ఎంజెలిక్ కెర్బర్ తో సహా నలుగురు సీడెడ్ క్రీడాకారిణులు ఇప్పటికే ఇంటిదారిపట్టగా, తాజాగా పురుషుల సింగిల్స్ లో నాల్గో సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. ఇటీవల పదో ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న నాదల్.. వింబుల్డన్ ఓపెన్ లో మాత్రం ప్రిక్వార్టర్స్ లోనే తన పోరాటాన్ని ముగించాడు.పురుషుల సింగిల్స్ లో భాగంగా ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 3-6, 4-6, 6-3, 6-4, 13-15 తేడాతో గైల్స్ ముల్లర్(లగ్జెంబర్గ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ముల్లర్ చివరకు పైచేయి సాధించి క్వార్టర్స్ కు అర్హత సాధించాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్.. ఆపై పోరాడి వరుసగా రెండు సెట్లను దక్కించుకున్నాడు. దాంతో ఐదో సెట్ అనివార్యమైంది. ఆ నిర్ణయాత్మకమైన ఐదో సెట్ లో ముల్లర్ పదునైన ఏస్‌లతో చెలరేగిపోయాడు. చివరి సెట్ లో నాదల్ పోరాడినప్పటికీ ముల్లర్ ధాటికి తలవంచకతప్పలేదు. ఈ మ్యాచ్ లో నాదల్ చేసిన 17 అనవసర తప్పిదాలు(అన్ ఫోర్స్డ్ ఎర్రర్స్) ఫలితంపై ప్రభావం చూపాయి. వింబుల్డన్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరకుండా నాదల్ వెనుదిరగడం ఐదోసారి. గతంలో 2013లో తొలిరౌండ్ లో నిష్క్రమించిన నాదల్.. 2012, 15లో రెండో రౌండ్ లో వెనుదిరిగాడు. ఇక 2014, 17ల్లో నాల్గో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు. ఇప్పటివరకూ 15 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన నాదల్.. రెండుసార్లు వింబుల్డన్((2008, 10) దక్కించుకున్నాడు.మరొకవైపు ముల్లర్ క్వార్టర్స్ కు చేరడం 2008 యూఎస్ ఓపెన్ తరువాత ఇదే తొలిసారి. -
వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు!
టొరంటో: సెర్బియా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ కాస్త తడ బడ్డాడు. టొరంటో టెన్నిస్ ఈవెంట్ రోజర్స్ కప్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో లగ్జెంబర్గ్ కు చెందిన ప్రత్యర్థి గిల్స్ ముల్లర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఓ దశలో వెనకంజ వేసినా చివరికి 7-5, 7-6(3) తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకున్నాడు. సెర్బియా యోధుడు టొరంటో టెన్నిస్ టోర్నీ, మాంట్రియల్ 2007, 2011, 2012లలో గెలుపొందాడు. మ్యాచ్ ఓడినప్పటికీ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది మార్చి తర్వాత హార్డ్ కోర్ట్ పై జొకో ఆడిన తొలి మ్యాచ్ కావడం విశేషం. అన్ సీడెడ్ ఆటగాడు ముల్లర్ సర్వీస్ ఎదుర్కోవడానికి వరల్డ్ చాంపియన్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ముల్లర్ చేసిన తప్పిదాలను స్కోర్లుగా మలుచుకుని జొకోవిచ్ రెండు సెట్లు కైవసం చేసుకున్నాడు. లేకపోతే అనామకుడి చేతిలో ఓడిపోయి పరాభవం చెందేవాడు. ఓటమి బాధతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాల్సి వచ్చేది. మూడో రౌండ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన రాడెక్ స్టెఫానెక్ తో తలపడనున్నాడు. మూడో సీడ్ ఆటగాడు నిషికోరి(జపాన్) 6-4, 7-5 తేడాతో అమెరికాకు చెందిన డెన్నిస్ నోవికొవ్ పై నెగ్గాడు. మరో మ్యాచ్ లో నాలుగో సీడెడ్ మిలోస్ రొనిక్(కెనడా) 6-3, 6-3 తో తైవాన్ కు చెందిన లు యెన్సున్ పై గెలుపొందాడు.